close
ఇంటర్వ్యూ
సూర్య విలనిజం చూస్తారు: కేవీ ఆనంద్‌

గెలుపోటములను పక్కనపెట్టి ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటున్న నటుడు సూర్య. తాజాగా ఆయన హీరోగా ‘కాప్పాన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఆర్య, సాయేషాలు నటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య ‘అయన్‌’, ‘మాట్రాన్‌’ చిత్రాల్లో నటించారు. అయన్‌ మంచి విజయాన్ని సాధించింది. ఇది మూడో చిత్రం. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి కేవీ ఆనంద్‌ మాట్లాడుతూ..

‘ఎన్‌జీకే’ ఫలితం ఈ సినిమాపై ప్రభావం చూపుతుందా?

‘ఎన్‌జీకే’ చిత్రం నాకు బాగా నచ్చింది. ఓ సినిమా విజయం కానీ పరాజయం కానీ తదుపరి సినిమాపై ప్రభావం చూపదు. మూడు సంవత్సరాల క్రితమే ఈ సినిమాను మేము ప్రారంభించాం.

తొలిసారి మీ చిత్రంలో మోహన్‌లాల్‌ నటించారే?

‘కాప్పాన్‌’లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారాయన. ప్రధాని పాత్రలో కనిపిస్తారు. తొలుత ఈ పాత్రకు అమితాబ్‌ బచ్చన్‌ను అనుకున్నాం. అయితే ఆయన కాల్షీట్‌ లభించనందున మోహన్‌లాన్‌ను ఆశ్రయించాం. సినిమాటోగ్రాఫర్‌గా నా తొలి రెండు చిత్రాలు మోహన్‌లాల్‌ సినిమాలే. అలా నాకు ఆయన బాగా పరిచయం. చాలా గాంభీర్యమైన పాత్రలో ఎంతో అలవోకగా నటించారు. తనముందు కెమెరా ఉందనే విషయాన్ని మరిచిపోయి నటించే వ్యక్తి మోహన్‌లాల్‌.

ఇందులో సూర్య పాత్ర గురించి?

సూర్య తనకంటూ కొన్ని నిబంధనలు పాటిస్తారు. ఆ పరిధిలోపే కథ ఉండాలి. ముఖ్యంగా మహిళలను హేళన చేసే సన్నివేశాలు, మాటలు ఉంటే ఆయనకు నచ్చదు. అనవసరంగా హీరోయిన్‌తో సన్నిహితంగా ఉండే సన్నివేశాలను వద్దని చెప్పేస్తారు. అంతేకాకుండా కథ వినేటప్పుడే ఆయన కొన్ని విషయాలను సరిచేసేస్తారు. ఆ కథపై ఆయనకు పూర్తి నమ్మకం వస్తేనే నటించడానికి అంగీకరిస్తారు. అయన్, మాట్రాన్‌ చిత్రాలకన్నా ఈ సినిమాకు ఎక్కువగా శ్రమించారు. కొన్ని రిస్కీ సన్నివేశాల్లో తానే మానిటర్‌ చూసి మళ్లీ మళ్లీ కూడా నటిస్తారు. ఈ చిత్రంలో సూర్య చాలా కొత్తగా కనిపిస్తారని మాత్రం చెప్పగలను. అందులోనూ కొన్ని సన్నివేశాల్లో సూర్య విలనిజాన్ని చూస్తారు.

కొత్త దంపతులు ఆర్య, సాయేషా గురించి?

ఆర్య పాత్రకు ముందుగా అల్లు శిరీష్‌ను ఎంచుకున్నాం. లండన్‌లో షూటింగ్‌. చివరి నిమిషంలో వీసా సమస్య రావడంతో ఆ పాత్ర కోసం పలువురు హీరోలకు కథ వినిపించా. కానీ ఆ పాత్రలో హీరోయిజం లేదని వద్దని చెప్పేశారు. తీరా ఆర్యకు కథ వినిపించగా నటించడానికి ఒప్పుకున్నారు. సాయేషా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

చాలా సినిమాలకు ‘కథ చోరీ’ అంశం పెద్ద సమస్యగా మారుతోందే?

నా వద్ద ఓ కథ ఉంది. విని మీ అభిప్రాయం చెప్పండి’ అని ఎవరైనా అడిగితే, ఏ మాత్రం మొహమాటం లేకుండా వద్దని చెప్పేస్తా. ఒకవేళ వారి కథలోని ఓ సన్నివేశం నా సినిమాలో ఉంటే ఆ సన్నివేశాన్ని తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే.. నా కథ విని అందులోని సన్నివేశాలను కాపీ చేశారని జెండా పట్టుకొస్తారు. అందుకే ఎవరి కథలు వినడం లేదు.

హ్యారీస్‌ జయరాజ్‌తో మళ్లీ జతకట్టడం..?

హ్యారీస్‌తో కలిసి పనిచేయడం చాలా సులువుగా ఉంటుంది. మా గత సినిమాల మాదిరిగా ఈ సినిమాలోనూ పాటలు అద్భుతంగా వచ్చాయి. హిట్లుగా నిలుస్తాయి.

తదుపరి సినిమాల వేషాలు?

ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెట్టడం అలవాటు. ‘కాప్పాన్‌’ చేస్తున్నప్పుడే లైకా నిర్మాణ సంస్థ మరో సినిమా చేద్దామని అడిగింది. అయితే నా వద్ద కథ లేదని చెప్పేశా. ఈ సినిమా విడుదలైన తర్వాత మా ఊరిలోని పొలంలో వ్యవసాయం చేయడానికి వెళ్లిపోతా. ఆ తర్వాతే తదుపరి సినిమా గురించి ఆలోచిస్తా.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.