close
అవీ.. ఇవీ..
కెమెరా ముందే కాదు.. వెనుకా మురిపించారు

మన చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న నటీమణులకు కొదవే లేదు. అయితే నటనలోనే కాదు దర్శకత్వ బాధ్యతలను సైతం తమ భుజాలపై మోసినవారూ ఉన్నారు. అయితే ఈ ట్రెండ్‌ ఇప్పటిది కాదు. అప్పట్లోనే అలనాటి తారలు భానుమతి, సావిత్రి, విజయనిర్మల దీనికి శ్రీకారం చుట్టారు. నటన పరంగా విజయం సాధించి.. మెగా ఫొన్‌ పట్టిన నటీమణులు ఎవరెవరంటే..

భానుమతి

మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం భానుమతి. బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనలోనే కాదు మ్యూజిక్‌ కంపోజర్‌గా, గాయనిగా, గేయ రచయిత్రిగా, దర్శకురాలిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. . అందుకే ఆమెను ‘అష్టావధాని’ అని చిత్రపరిశ్రమ ముద్దుగా పిలుచుకునేదట. 1939లో వచ్చిన ‘వర విక్రయం’తో భానుమతి దర్శకురాలిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత 1953లో వచ్చిన ‘చండీరాణి’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. భారత చిత్ర పరిశ్రమలో తొలి మహిళా దర్శకురాలు బహుశా భానుమతే కావచ్చు.!


‘మహానటి’ సావిత్రి

ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి మెప్పించిన మహానటి సావిత్రి కూడా దర్శకత్వం వహించారు. ఆమె భానుమతిని స్ఫూర్తిగా తీసుకుని ‘ప్రాప్తం’, ‘చిన్నారి పాపలు’, ‘మాతృదేవత’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.


విజయ నిర్మల

ప్రముఖ నటి విజయ నిర్మల కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1971లో వచ్చిన ‘మీనా’ సినిమాతో నిర్మల దర్శకురాలిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘దేవదాసు’, ‘రౌడీ రంగమ్మ’, ‘రామ్‌ రాబర్ట్‌ రహీం’, ‘సిరిమల్లె నవ్వింది’, ‘కలెక్టర్‌ విజయ’, ‘యస్‌ నేనంటే నేనే’, ‘నేరమూ శిక్ష’  తదితర సినిమాలను తెరకెక్కించడమే కాదు, అత్యధిక సినిమాలు రూపొందించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. 


జీవితా రాజశేఖర్‌

నటిగానే కాదు, దర్శకురాలిగానూ జీవిత తనదైన ముద్రవేశారు. భర్త రాజశేఖర్‌ నటించిన ‘శేషు’ సినిమాతో జీవిత దర్శకత్వం ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఆప్తుడు’, ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’ సినిమాలను తెరకెక్కించారు. అయితే భర్త నటించిన సినిమాలకు మాత్రమే జీవిత దర్శకత్వం వహించడం గమనార్హం. ఆమె తెరకెక్కించిన చివరి చిత్రం 2013లో వచ్చిన ‘మహంకాళి’. 


శ్రీప్రియ

2014లో విడుదలైన చక్కటి సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. విక్టరీ వెంకటేశ్‌ నటించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను శ్రీప్రియ చక్కగా తెరకెక్కించారు. సినిమా మంచి విజయం అందుకుంది. దర్శకురాలిగా మారక ముందు ‘అంతులేని కథ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘వయసు పిలిచింది’, ‘కొంగచాటు కృష్ణుడు’ తదితర చిత్రాల్లో నటించారు.


రేణూ దేశాయ్‌

‘బద్రి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి రేణూ దేశాయ్‌. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో వివాహం కాకముందు వరకు ‘జేమ్స్‌ పాండు’, ‘జానీ’ సినిమాల్లో నటించారు. ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్’, ‘బాలు’, ‘అన్నవరం’ సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. 2014లో వచ్చిన ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు. త్వరలో మరో సినిమాకు దర్శకత్వం వహించే పనిలో ఉన్నట్లు గతంలో రేణు ప్రకటించారు.


ఫరా ఖాన్‌

బాలీవుడ్‌కి చెందిన మల్టీటాలెంటెడ్‌ వ్యక్తుల్లో ఫరా ఖాన్‌ ఒకరు. ఆమెలో ఓ నటి మాత్రమే కాదు కొరియోగ్రాఫర్‌, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ కూడా ఉంది. 2004లో వచ్చిన ‘మై హూ నా’ సినిమాతో ఫరా దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో ఆమె నటించడమే కాదు రైటర్‌గానూ పనిచేశారు. షారుక్‌, సుస్మితా సేన్‌ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమా మరో బ్లాక్‌ బస్టర్‌. 2014లో వచ్చిన ‘హ్యాపీ న్యూఇయర్‌’ సినిమా తర్వాత ఫరా ఎక్కువగా దర్శకత్వం వైపు దృష్టిసారించలేదు.


‘క్వీన్‌’ కంగన

నటన కంటే కూడా తనకు దర్శకత్వం వహించడమే ఎంతో ఇష్టమని కంగనా రనౌత్‌ చాలా సార్లు చెప్పారు. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’.  దర్శకుడు క్రిష్‌తో విభేదాలు రావడంతో తాను దర్శకురాలిగా మారానని అన్నారు. ప్రస్తుతం ఆమె ‘మెంటల్‌ హై క్యా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. కంగన కూడా దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నట్లు ప్రకాశ్‌ వెల్లడించారు. త్వరలో తన జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించాలనుకుంటున్నట్లు కంగన ఓ సందర్భంగా వెల్లడించారు.


ఏంజిలినా జోలీ

ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజిలినా జోలీకి కూడా దర్శకురాలిగా మంచి గుర్తింపు ఉంది. 2007లో వచ్చిన ‘ఎ ప్లేస్‌ ఇన్‌ టైం’ చిత్రంతో ఆమె డైరెక్టర్‌గా మారారు. ‘ఇన్‌ ది లాండ్‌ ఆఫ్ బ్లడ్‌ అండ్‌ హనీ’, ‘అన్‌బ్రోకెన్’, ‘బై ది సీ’, ‘ఫస్ట్‌ దె కిల్డ్‌ మై ఫాదర్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.    


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.