close
సినిమా రివ్యూ


రివ్యూ: వినయ విధేయ రామ

చిత్రం: వినయ విధేయ రామ
నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల 11-01-2019

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో కొండంత హీరోయిజం కనిపిస్తుంటుంది. కథానాయకుడ్ని ప్రేమించి, అభిమానుల్లో ఓ అభిమానిగా మారిపోయి సినిమాలు తీస్తుంటారాయన. అందుకే అవన్నీ వాణిజ్యపరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. మరి బోయపాటి మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉంది? ప్రతి నాయకుడిగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏవిధంగా మెప్పించారు?

క‌థేంటంటే: ఐదుగురు అన్నదమ్ములున్న (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌, రామ్‌ చరణ్‌) అందమైన ఫ్యామిలీలో అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణిదెల. అత‌నంటే అంద‌రికీ ఇష్టం. అలాగే కుటుంబం అంటే రామ్‌కి కూడా చాలా ఇష్టం. రామ్ పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖ ఎన్నికల అధికారిగా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న బ‌య‌ట పెడ‌తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. అది నచ్చని పరశురాం.. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకు బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌ని (వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది? అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఈ చిత్రం రెండు ఛాయల్లో సాగుతుంది. ఓ వైపు పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగితే, మరోవైపు త‌న అన్న‌కు, కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాటం ఇందులో కనిపిస్తుంది. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అదే స‌మ‌యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల‌ను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అవి రెండూ ఇంకాస్త పెరిగాయి. ఒక కుటుంబంలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, రిచ్‌గా చూపించారు. ఆయా స‌న్నివేశాల‌న్నీ ఒక హిందీ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డ‌తారు. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు వ‌చ్చేస‌రికి మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తుంది. కియారా అడ్వాణీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌రిస్తుంది. అయితే, ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌ధ్య క‌థ‌ను పేర్చుకుంటూ వెళ్లాడేమో అనిపిస్తుంది. బోయ‌పాటి శైలిలోనే క‌థ ప్రారంభ‌మై చాలా మాసీగా సాగుతుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే స‌న్నివేశాలు ప‌తాక స్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. విరామం వ‌ర‌కూ ఈ సినిమాలో క‌థే ఉండదు. కానీ, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాస్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి.
ద్వితీయార్ధమంతా రామ్‌.. మున్నాభాయ్‌ల పోరు క‌న‌ప‌డుతుంది. దీంతో ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌రుస‌గా యాక్ష‌న్ ఎపిసోడ్లు వ‌చ్చేస్తాయి. వాటి మోతాదు కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అవి తెర‌పై చూడ‌టానికి బాగున్నా, అరే మ‌ళ్లీ ఫైట్ వ‌చ్చేసిందే అన్న ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి కలుగుతుంది. హింస‌, ర‌క్త‌పాతం, హీరోయిజం మ‌రోస్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ కోస‌మే యాక్ష‌న్ అన్న‌ట్లు సెకండాఫ్ సాగుతుంది. ప్ర‌థ‌మార్ధంలో క‌నిపించే ఫ్యామిలీ డ్రామా, ఎమోష‌న్స్‌, ల‌వ్ సీన్లు, ఫ‌న్ ఇవేవీ క‌నిపించ‌వు. ఒక సీరియ‌స్ పంథాలో సాగుతుంది. బోయ‌పాటి గ‌త చిత్రాల‌న్నీ క‌లిపి క‌ట్టుగా చూసిన‌ట్లు అనిపిస్తుంది. అయితే, హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డంలో బోయ‌పాటి త‌న మార్కును మ‌రోసారి చూపించాడు. రామ్‌చ‌ర‌ణ్‌లో ఫైట‌ర్‌ను చూడాలంటే ఈ సినిమా త‌ప్ప‌కుండా చూడాల్సిందే!

ఎవ‌రెలా చేశారంటే: ర‌ంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఇందులో ఒక ఎగ్రెసివ్ పాత్ర చేశాడు. రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌, ఒక ఫైట‌ర్ ఇలా అనేక కోణాల్లో సాగుతుంది. అన్నింటిక‌న్నా ఫైట‌ర్ మాత్ర‌మే ఎలివేట్ అయ్యాడు. సిక్స్‌ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌కు బాగా న‌చ్చుతాయి. కియారా అడ్వాణీ అందంగా క‌నిపించింది. అయితే, ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ముఖ్యంగా ప్ర‌శాంత్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఆర్య‌న్ రాజేష్ కూడా ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో బాగా న‌టించాడు. రామ్‌-వివేక్ పోరాట స‌న్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. బాలీవుడ్ నుంచి వివేక్‌ను తీసుకొచ్చినందుకు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్లో విల‌న్‌ డామినేష‌న్ క‌న‌ప‌డ‌టం బోయ‌పాటి స్టైల్‌. అదే ఈ సినిమాలోనూ కొన‌సాగింది.
దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు మాస్‌కు న‌చ్చేలా ఉన్నాయి.  పాట‌ల్లో సాహిత్యం, బీట్ క‌న్నా రామ్‌చ‌ర‌ణ్ స్టెప్‌లు అభిమానుల‌ను మెప్పిస్తాయి. రంగ‌స్థలంలో పెద్ద‌గా స్టెప్‌లు వేసే అవ‌కాశం రాని చెర్రీ ఇందులో ఆ లోటు తీర్చుకున్నాడు. సంభాష‌ణ‌ల్లో ప‌దునుంది. రామ్ కొ..ణి..దె..ల‌.. అంటూ చెప్పే డైలాగ్‌లు మాస్‌కు బాగా న‌చ్చుతాయి. క‌థ‌కుడిగా బోయ‌పాటి.. రామ్‌కు స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌నిపిస్తుంది. సినిమా మొత్తం ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోనే సాగుతుంది. పాట‌.. ఫైటూ.. పాట‌.. ఫైటూ అన్న‌ట్లు సినిమా సాగుతుంది.

బ‌లాలు
+ యాక్ష‌న్ ఎపిసోడ్లు
+  రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు

+  మాస్ ఎలిమెంట్స్‌
బ‌ల‌హీన‌త‌లు
మితిమీరిన హింస‌
క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం
చివ‌రిగా: విన‌య విధేయ మాస్ రాముడు
గ‌మ‌నిక‌: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.

 

 

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.