close
సినిమా రివ్యూ
రివ్యూ: ఏబీసీడీ

నటీనటులు: అల్లు శిరీష్‌, రుక్సార్ ధిల్లన్‌‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు, రాజా, కోట శ్రీనివాస‌రావు, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల‌ కిషోర్ త‌దితరులు
సినిమాటోగ్రఫీ: రామ్‌ 
కూర్పు‌: న‌వీన్ నూలి
నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని
సంగీతం: జుదా సాందీ
స‌మ‌ర్పణ‌: డి.సురేష్‌బాబు
సంస్థ: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ 
దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి
విడుద‌ల‌: 17-05-2019

మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన క‌థానాయ‌కుల్లో అల్లు శిరీష్ ఒక‌రు. ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’, ‘ఒక్క క్షణం’ చిత్రాల‌తో న‌టుడిగా ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న ఈసారి వినోదాన్ని పంచేందుకు రీమేక్‌ని ఎంచుకున్నారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘ఏబీసీడీ’ సినిమాని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సంజీవ్‌ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. మ‌ల‌యాళంలో మెప్పించిన ఈ క‌థ, తెలుగులోనూ అదే మ్యాజిక్‌ రిపీట్ చేసిందో లేదో తెలుసుకుందాం. 

క‌థేంటంటే: అర‌వింద్ అలియాస్ అవి (అల్లు శిరీష్‌) అమెరికాలో పుట్టి పెరిగిన కుర్రాడు. తండ్రి (నాగ‌బాబు) సంపాదిస్తున్న డ‌బ్బుని విచ్చల‌విడిగా ఖ‌ర్చు చేస్తూ... జ‌ల్సాగా జీవితం గ‌డుపుతుంటాడు. కింది స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ మిలియ‌నీర్‌గా మారిన ఆ తండ్రి త‌న కొడుక్కి  డ‌బ్బు విలువ తెలిసేలా చేయాల‌నుకుంటాడు. అందుకోసం అవిని ఇండియాకి పంపాల‌ని ప్రణాళిక ర‌చిస్తాడు. తన తండ్రి ప్లాన్‌ వేశాడని అవికి ఇండియాలోకి అడుగుపెట్టాకే అర్థం అవుతుంది. నెల‌కి తండ్రి పంపించే రూ. 5 వేల‌తోనే జీవితం గడపాల్సి వ‌స్తుంది. డాల‌ర్ల మ‌ధ్య పెరిగిన అవి నెల నెలా రూ. 5 వేల‌తో ఎలా నెట్టుకొచ్చాడు? స్నేహితుడు బాషా (భ‌ర‌త్‌)తో ఒక బ‌స్తీలో ఎలా జీవితాన్ని గ‌డిపాడు?అత‌నికి డ‌బ్బు విలువ ఎలా ఎప్పుడు తెలిసింది?  ఈ ప్రయాణంలో నేహా (రుక్సార్‌) అనే అమ్మాయితో అవికి ఎలా అనుబంధం పెరిగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి. 

ఎలా ఉందంటే: డ‌బ్బంటే లెక్క లేని కుర్రాడికి చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేని ప‌రిస్థితులు వ‌స్తే? డాల‌ర్ల కొద్దీ ఖ‌ర్చు పెడుతూ జల్సాలు చేసిన  కుర్రాడు.. ప్రతి పైసాని లెక్క పెట్టుకుంటూ నెట్టుకురావాల్సి వ‌స్తే?.. ఇలా ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తూ క‌థ చెప్పడానికి క‌డుపుబ్బా న‌వ్వించ‌డానికి త‌గిన వేదికే ఈ క‌థ. కొంత‌కాలం కింద‌ట వ‌చ్చిన ‘పిల్ల జ‌మిందార్’ సినిమాలో ఇలాంటి సంద‌ర్భాల్నే ఉప‌యోగించుకుంటూ చ‌క్కటి వినోదం పండించారు. కానీ, ఇక్కడ మాత్రం చిత్రబృందం విఫ‌ల‌య‌త్నం చేసింది. ఎత్తుగ‌డ బాగున్నా... ఆ త‌ర్వాత స‌న్నివేశాల్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దలేక‌పోయారు. అక్కడ‌క్కడా కాసిన్ని న‌వ్వులు పండాయి త‌ప్ప హాస్యం ప‌రంగా కూడా పెద్దగా  ప్రభావం చూపించ‌లేక‌పోయింది ఈ చిత్రం.

అమెరికా జ‌ల్సా జీవితాన్ని కానీ... ఇండియాకి వ‌చ్చాక డ‌బ్బు లేక క‌థానాయ‌కుడు ప‌డే పాట్లని కానీ స‌హ‌జంగా తీర్చిదిద్దలేక‌పోయారు ద‌ర్శకుడు. దాంతో క‌థ‌తో ప్రేక్షకుడు ఏ ద‌శ‌లోనూ క‌నెక్ట్ అవ్వడు. స‌న్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లిన‌ట్టే అనిపిస్తుంది త‌ప్ప సినిమాలో ఎలాంటి వినోదం పండ‌దు. స‌బ్ ప్లాట్‌గా పొలిటిక‌ల్ డ్రామా కూడా ఉంటుంది. దాన్ని అస‌లు క‌థ‌కి మేళ‌వించిన విధానం కూడా అత‌క‌లేదు. రోజుకి రూ.82 రూపాయ‌ల‌తో బ‌తుకుతున్నాన‌ని క‌థానాయ‌కుడు చెబుతుంటాడు కానీ.. అత‌ని లుక్ కానీ, గ‌డిపే జీవితం కానీ అలా ఉండ‌దు. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాల్లోనూ స‌హ‌జ‌త్వం లేదు. ఇక‌పై మ‌నం ఫ్రెండ్స్ అంటారు, ఆ వెంట‌నే క‌థానాయిక‌ని చూసి క‌న్ను కొట్టేస్తాడు హీరో.

ప్రతినాయ‌కుడు దుబాయ్‌లో ప‌వ‌ర్‌ ఫ్యాక్టరీలు న‌డుపుతూ వేల కోట్లు సంపాదిస్తుంటాడు కానీ అత‌ను ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాలంటే కాలేజీ విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నట్టుగా ఆ పాత్రని తీర్చిదిద్దారు. మొత్తంగా చూస్తే మాతృక‌ని అర్థం చేసుకొన్న విధానమే స‌రిగ్గా లేదేమో అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన ఓ వీడియో స్ఫూర్తితో తెర‌కెక్కించిన ఆ స‌న్నివేశాలు బాగా న‌వ్విస్తాయి. 

ఎవ‌రెలా చేశారంటే: క‌థానాయ‌కుడు అల్లు శిరీష్  త‌న పాత్రలో ఒదిగిపోయే ప్రయ‌త్నం చేశాడు. ఆయ‌న‌కి స్నేహితుడిగా భ‌ర‌త్ న‌టించాడు. ఇద్దరూ క‌లిసి చేసిన సంద‌డి అక్కడక్కడా న‌వ్విస్తుంది. క‌థానాయిక రుక్సార్ ధిల్లన్ అందంగా క‌నిపించింది త‌ప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యంలేదు. ప్రతినాయ‌కుడిగా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌యుడు రాజా న‌టించారు. యువ రాజ‌కీయనాయ‌కుడి పాత్రలో ఆయ‌న క‌నిపించిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్ పాత్ర ప‌రిమిత‌మే అయినా బాగా న‌వ్వించారు. నాగ‌బాబు త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. రామ్ సినిమాటోగ్రఫీ, జుదా సాందీ సంగీతం బాగుంది. సినిమా స్థాయికి త‌గ్గట్టే నిర్మాణ విలువ‌లు ఉన్నాయి. ద‌ర్శకుడు ర‌చ‌న ప‌రంగా అక్కడక్కడా పర్వాలేద‌నిపించాడంతే. క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు ఏమాత్రం స‌రిపోలేదు. క‌థ విష‌యంలో ప‌లువురు ద‌ర్శకుల స‌ల‌హాలు తీసుకున్నా ఆ ప్రభావం సినిమాపై పెద్దగా క‌నిపించ‌లేదు. 
బలాలు
+ అక్కడ‌క్కడా హాస్యం
+ వెన్నెల కిషోర్‌ కామెడీ

బ‌ల‌హీన‌త‌లు
- ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ, క‌థ‌నం
- ఆశించిన స్థాయిలో హాస్యం లేక‌పోవ‌డం

చివ‌రిగా: ‘ఏబీసీడీ’.. ఇంకాస్త బాగా దిద్దాల్సింది
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.