close
సినిమా రివ్యూ
రివ్యూ: హిప్పీ

నటీనటులు:కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బాసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు
సంగీతం: నివాస్‌ కే ప్రసన్న
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్‌
కూర్పు: ప్రవీణ్‌ కేఎల్
నిర్మాణ సంస్థ: వీ క్రియేషన్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీఎన్‌ కృష్ణ
విడుదల తేదీ: 6-06-2019

తొలి సినిమా ‘ఆర్‌ ఎక్స్‌ 100’తోనే కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ కథానాయకుడు కార్తికేయ. ఆ తర్వాత ఆయన్ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన ‘హిప్పీ’ సినిమాను ఎంచుకున్నారు. టైటిల్‌, పోస్టర్‌, టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అదీకాకుండా చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి ఇందులో కీలక పాత్రలో నటించారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కార్తికేయ రెండో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారా? చూద్దాం.  

క‌థేంటంటే: హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఎప్పుడు ఏద‌నిపిస్తే అది చేస్తూ, స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే ర‌కం. ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ)తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. స్నేహ (జ‌జ్బాసింగ్‌) త‌న‌ని ప్రేమిస్తున్నా, ఆమెను కాద‌ని వెంటప‌డి మ‌రీ ఆముక్త మాల్యద మ‌న‌సు గెలుచుకునేందుకు ప‌రిత‌పిస్తాడు. ఆమె చుట్టూ తిరిగేంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె తిరిగి ప్రేమించ‌డం మొద‌లు పెడుతుందో అప్పట్నుంచి త‌న స్వేచ్ఛని కోల్పోయిన‌ట్టుగా భావిస్తాడు హిప్పీ. మ‌రి వారి ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళ్లిందా? లేదా? వీరి ప్రేమ‌క‌థ‌ని హిప్పీ బాస్ అయిన అర‌వింద్ (జేడీ చ‌క్రవ‌ర్తి) ఎలాంటి మ‌లుపు తిప్పాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: మ‌నం ప్రేమిస్తే ఆ అనుభూతి స్వర్గంలోకి వెళ్లిన‌ట్టుగా ఉంటుంది. తిరిగి మ‌న‌ల్ని ప్రేమిస్తే స్వర్గం కోల్పోయిన‌ట్టుగా ఉంటుందనే అంశం చుట్టూ అల్లిన క‌థ ఇది. ప్రేమలో ప‌డ్డాక అమ్మాయి పెట్టే షరతులు, ఆమెకి న‌చ్చిన‌ట్టుగా బ‌త‌కాల్సి రావ‌డం, అందుకోసం ప‌డే తాపత్రయపడటం వంటి విష‌యాల‌న్నీ కూడా కుర్రాళ్ల స్వేచ్ఛని హ‌రించిన‌ట్టు ఉంటాయ‌ని.. ఆ ద‌శ‌లో ప్రేమ‌ని అర్థం చేసుకోవడ‌మే ముఖ్యం అన్న విష‌యాన్ని దర్శకుడు త‌నదైన శైలిలో చెప్పాడు. కుర్రాళ్ల ఆలోచ‌న‌ల‌కి అద్దం ప‌ట్టే క‌థ ఇది. ఒక చిన్న అంశాన్ని ఎంచుకొని, దాన్ని క‌థ‌గా మ‌లిచే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. క‌థ కంటే కూడా క‌థ‌న‌మే కీల‌కం. అయితే ఇందులో సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని విష‌యాలు చాలా ఉంటాయి. ప్యార‌డైజ్‌, ఎరెక్షన్‌, ఇంపొటెంట్ అంటూ మ‌ల్టీప్లెక్స్ ప్రేక్షకులు మాత్రమే అర్థం చేసుకొనే విష‌యాలున్నాయి. ఆరంభ స‌న్నివేశాలు మొదలుకొని ప్రధమార్ధం సర‌దాగానే సాగిపోతుంది. అక్కడక్కడా సంభాష‌ణ‌లు ద్వంద్వార్థాల‌తో వినిపించినా... కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ అంశాల‌తో ద్వితీయార్ధంలోకి అడుగుపెడుతుంది. ఆ త‌ర్వాత క‌థ ఎంత‌కీ ముందుకు సాగ‌దు. ఎక్కడైతే మొద‌లైందో అక్కడికే వ‌స్తుంది. దాంతో స‌న్నివేశాల‌న్నీ సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లోనూ కొత్తద‌నం ఏమీ లేదు. క‌థ‌లో మ‌లుపు కోస‌మ‌ని జేడీ పెళ్లి తంతుని మొద‌లుపెట్టినా...ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌న్నీ ప్రేక్షకుడి ఊహ‌కు తగ్గట్టుగానే సాగిపోతుంటాయి. క‌థ ప‌రంగా చేసిన ద‌ర్శకుడు చేసిన క‌స‌ర‌త్తులు చాలలేదు. అక్కడక్కడా విన‌డానికి ఇబ్బందిగా అనిపించే సంభాష‌ణ‌లు చాలా వినిపిస్తాయి. 

ఎవ‌రెలా చేశారంటే: కార్తికేయ న‌ట‌న హుషారుగా సాగుతుంది. ‘ఆర్‌ఎక్స్‌100’లో చేసిన పాత్రకి భిన్నంగా మ‌రింత ఉత్సాహంగా క‌నిపించాడు. హిప్పీ పాత్రలో చ‌క్కగా ఒదిగిపోయాడు. కాక‌పోతే కార్తికేయ సిక్స్‌ప్యాక్‌ దేహాన్ని చూపించడంపైనే మ‌రీ ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టున్నారు ద‌ర్శకుడు. అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్పించారు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘ఆర్ఎక్స్‌100’ని మ‌రోసారి గుర్తు చేశాడు హీరో. దిగంగ‌న అందం, న‌ట‌న చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. ఆమె ప్రతీ స‌న్నివేశంలో అందంగా క‌నిపించారు. ద్వితీయార్ధంలో ఆమె న‌ట‌న కూడా మెప్పిస్తుంది. బాస్ అర‌వింద్ పాత్రలో  జేడీ చ‌క్రవ‌ర్తి ఒదిగిపోయారు. తెలంగాణ యాస మాట్లాడుతూ ఆయ‌న పండించిన హాస్యం మెప్పిస్తుంది. కానీ ఆయ‌నతో చెప్పించిన సంభాష‌ణ‌లు కొన్ని ప్రేక్షకుల‌కు మింగుడు ప‌డ‌ని విధంగా ఉంటాయి. జ‌జ్బాసింగ్‌, శ్రద్ధా దాస్ చిన్న పాత్రల్లో మెరిశారు. వెన్నెల‌ కిషోర్ పాత్రతో పెద్దగా హాస్యం పండ‌లేదు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపిస్తుంది. నివాస్ కె.ప్రస‌న్న స‌మ‌కూర్చిన బాణీల కంటే నేప‌థ్య సంగీతం బాగుంది. రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన బ‌లం. ప్రవీణ్ ద్వితీయార్ధంలో త‌న కత్తెర‌కి మ‌రింత ప‌దును పెట్టాల్సింది. క‌థ‌నం ప‌రంగా ద‌ర్శకుడి ప‌నిత‌నం అక్కడక్కడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. 

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ దిగంగ‌న అందం
+ యాక్షన్ 
+ నేప‌థ్య సంగీతం
+ ఛాయాగ్రహ‌ణం
- క‌థ‌, క‌థ‌నం 
- కామెడీ 
- ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా: ప్రేమ‌లో గెలిచిన ఓ దేవ‌దాస్ కథే... ‘హిప్పీ’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.