close
సినిమా రివ్యూ
రివ్యూ: మల్లేశం

నటీనటులు: ప్రియదర్శి, అనన్య నాగల్ల, చక్రపాణి ఆనంద, జగదీశ్‌ ప్రతాప్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: మార్క్‌ కే రాబిన్‌
నిర్మాణ సంస్థ: శ్రీ అధికారి బ్రదర్స్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ సిద్ధారెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌ రాచకొండ
విడుదల తేదీ: 21-06-2019

మనకు సచిన్‌ తెందూల్కర్‌ గురించి తెలుసు. అబ్దుల్‌ కలామ్‌ గురించీ తెలుసు. ‘విజేత’ల గురించి, వాళ్ల ప్రయాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. కానీ.. తెర మరుగున, మనకు తెలియని విజేతలు చాలా మంది ఉంటారు. వాళ్ల కథలూ స్ఫూర్తి నింపుతుంటాయి. అయితే ప్రచారం లేకపోవడం వల్లో ఏమో కానీ.. కొన్ని కథలు, జీవితాలు మనకు పట్టకుండా పోతుంటాయి. కానీ.. పనికట్టుకుని మరీ తెలుసుకోవాల్సిన కథ ‘మల్లేశం’. సరైన ప్రోత్సాహం లేకుండా కుదేలైపోతున్న చేనేత పరిశ్రమకు వెన్నెదన్నుగా నిలిచి, వాళ్ల కోసం ఆసు యంత్రాన్ని కనిపెట్టి, అందుకోసం తన జీవితాన్ని ధారబోసిన చింతకింది మల్లేశం కథ చాలామందికి ఆదర్శం. ఆ కథని ‘మల్లేశం’ పేరుతో తెరపైకి తీసుకొచ్చారు రాజ్‌. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ కథ ఇచ్చిన స్ఫూర్తి ఏమిటి?

కథేంటంటే: మల్లేశం (ప్రియదర్శి)ది దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలకు చేనేతే ఉపాధి. పగలనక రాత్రనక కష్టపడితే.. పదో పరకో వస్తుంది. దాంతోనే జీవితం సాగిస్తుండాలి. ఆర్థిక కారణాల వల్ల ఆరో తరగతిలోనే మల్లేశం చదువుకి ఫుల్‌ స్టాప్‌ పడిపోతుంది. ఓ చీర తయారు చేయడానికి అమ్మ పడుతున్న కష్టం చూసి తల్లడిల్లిపోతాడు మల్లేశం. అమ్మకి కష్టం కలగకుండా, సులభంగా నేత నేసేలా ఓ యంత్రం కనుక్కోవాలనుకుంటాడు. అప్పులు చేసి మరీ కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుకున్న గమ్యం చేరుకోలేకపోతాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు. ఆఖరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కూడా మాటలు పడాల్సిన పరిస్థితి. ఈ దశలో మల్లేశం ఆత్మహత్యకీ ప్రయత్నిస్తాడు. ఆ తరవాత మల్లేశం కథ ఎలా మారింది? ఆసు యంత్రం తయారు చేయడానికి ఎన్ని ఆపసోపాలు పడ్డాడు? చివరికి తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు?అనేదే కథ.

ఎలా ఉందంటే: చింతకింది మల్లేశం జీవిత కథ ఇది. ఓ రకంగా బయోపిక్‌. తన గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కాబట్టి.. ‘మల్లేశం’ జీవితం తెరపై కొత్తగానే అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం నాటి కథ ఇది. అప్పటి వాతావరణం, ఆనాటి ఆటలు, మనస్తత్వాలు.. ఇవన్నీ తెరపై చూసుకుంటే ఒక్కసారి ప్రేక్షకులు కూడా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోతారు. చేనేత కార్మికులు, వాళ్ల జీవన విధానంపై అవగాహన ఉన్నవాళ్లకు ఈ కథ, వాతావరణం ఇంకాస్త బాగా కనెక్ట్‌ అవుతుంది. అసు యంత్రం అంటే ఏమిటి? మగ్గం చేసే పనేంటి? ఆ పని అసు యంత్రం వల్ల ఎంత సులభం అవుతుందన్న విషయం తెలుసుకుని ఈ సినిమా చూస్తే మరింత బాగా అర్థం అవుతుంది. లేదంటే కొన్ని సన్నివేశాలు లెక్కల సూత్రాల్లా కష్టంగా, గజిబిజిగా సాగుతాయి.

మల్లేశం బాల్యం, యవ్వనం, పెళ్లి.. ఇవన్నీ సరదాగానే సాగిపోతాయి. ఎప్పుడైతే ఆసు యంత్రం కనుక్కోవాలన్న తాపత్రయం మల్లేశంలో పుడుతుందో అప్పుడు కథలో సీరియస్‌నెస్‌ వస్తుంది. మధ్యమధ్యలో తెలంగాణ సంస్క్రృతి, జీవన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అప్పట్లో పెళ్లిళ్లు, వినోద కార్యక్రమాలు ఎలా సాగేవో పూస గుచ్చినట్టు వివరించారు. ద్వితీయార్ధం మొత్తం ఆసు యంత్రంపై మల్లేశం చేసే పోరాటమే కనిపిస్తుంది. ప్రతిసారీ ప్రయత్నించడం, ఓడిపోవడం, మళ్లీ ప్రయత్నానికి పూనుకోవడం, పతాక సన్నివేశాల వరకూ ఇదే తంతు. మల్లేశం చివరికి ఆసు యంత్రాన్ని కనుక్కుంటాడన్న సంగతి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. దాన్ని ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా చూపించడమే దర్శకుడి పని. ఈ విషయంలో రాజ్‌ విజయం సాధించాడనే చెప్పాలి. ఓ కథని ఎలాంటి కమర్షియల్‌ హంగులూ లేకుండా తెరకెక్కించాలనుకున్నారు. అందుకే మనకు అలవాటు పడిన సినిమాటిక్‌ మలుపులేం ఇందులో కనిపించవు. అలాంటివి ఆశించినవాళ్లకు మాత్రం కథ పోకడ రుచించకపోవచ్చు.

ఓటమి ఎదురైనప్పుడు మనకంటూ ఏదో ఓ దారి ఉండే ఉంటుంది. ఆ దారేంటో తెలుసుకోవాలి తప్ప ఆత్మహత్యలకు ప్రయత్నించకూడదు అనే సందేశాన్నీ ఈ కథలోనే ఇమిడ్చే ప్రయత్నం చేశారు. చేనేత కార్మికుల వ్యథని తెరపైకి తీసుకొచ్చిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక.. తప్పకుండా వాళ్లపై ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. చేనేత వస్త్రాలపై మమకారం పెరుగుతుంది.
ఎవరెలా చేశారంటే: దర్శక నిర్మాతలు చేసిన మంచి పని ఏంటంటే.. ఈ సినిమాకు, కథకు ఎవరైతే నప్పుతారో వాళ్లనే ఎంచుకోవడం. మల్లేశంగా ప్రియదర్శి ఎంపికే కాదు, తన నటనా ఆశ్చర్యపరుస్తుంది. నవ్వులు పంచే ప్రియదర్శిలో ఇంత లోతైన నటుడున్నాడా? అనిపిస్తుంది. అనన్య రూపమే కాదు, నటన కూడా సహజంగా ఉంది.

భార్యాభర్తల అన్యోన్యతని చాలా బాగా చూపించారు. ప్రముఖ యాంకర్‌ ఝాన్సీకి చాలా కాలం తరవాత గుర్తుండిపోయే పాత్ర పడింది. మల్లేశం స్నేహితులుగా నటించిన ఇద్దరూ తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ఓ స్ఫూర్తివంతమైన కథని చెప్పాలనుకున్న దర్శక నిర్మాతల ప్రయత్నం చాలా గొప్పది. ఎలాంటి కమర్షియల్‌ సూత్రాలకూ లొంగిపోకుండా నిజాయతీగా కథని చెప్పే ప్రయత్నం చేశారు. సన్నివేశాల్లో కనిపించే సహజత్వం, నిజాయతీ ‘మల్లేశం’ జీవితంలా స్వచ్ఛంగా ఉన్నాయి. పాటల్లో, మాటల్లో ఆనాటి వాతావరణం తొణికిసలాడింది.

బలాలు
+ కథ, కథనం
+ నటీనటుల ప్రతిభ
బలహీనతలు
- డాక్యుమెంటరీని తలపించే ఘట్టాలు

చివరిగా: మల్లేశం... ఓ గొప్ప ప్రయత్నం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! 

 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.