close
సినిమా రివ్యూ
రివ్యూ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌

న‌టీన‌టులు: న‌వీన్ పోలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు
స్క్రీన్‌ప్లే: న‌వీన్ పోలిశెట్టి 
సంగీతం: మార్క్ కె.రాబిన్‌ 
సాహిత్యం: కె.కె
ఛాయాగ్రహ‌ణం: స‌న్నీ కూర‌పాటి 
క‌ళ‌: క్రాంతి ప్రియం 
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా
క‌థ‌, మాట‌లు, ద‌ర్శక‌త్వం: స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె  
సంస్థ‌: స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 21-06-2019

తెలుగులో డిటెక్టివ్ సినిమాలు చాలా అరుదు. దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం వ‌చ్చిన ‘చంటబ్బాయ్‌’ త‌ర్వాత ఆ స్థాయి సినిమా మ‌ళ్లీ రాలేదు. చిక్కుముడుల‌తో కూడిన అంతు చిక్కని కేసుల్ని కూడా సుల‌భంగా ఛేదిస్తుంటారు డిటెక్టివ్‌లు. అలాంటి పాత్ర ఆద్యంతం వినోదాత్మకంగా సాగితే ఎలా ఉంటుందో ‘చంట‌బ్బాయ్‌’ చాటి చెప్పింది. అదే త‌ర‌హా పాత్రతో రూపొందిన సినిమానే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. మ‌రి ఇందులోని డిటెక్టివ్ ఏజెంట్ క‌థేమిటి? అత‌ను ఎలాంటి చిక్కుముడులు విప్పాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే. 

క‌థేంటంటే: నెల్లూరు కూర‌గాయల మార్కెట్‌ దగ్గర ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్) పేరుతో ఓ డిటెక్టివ్ సంస్థని నిర్వహిస్తుంటాడు శ్రీను అలియాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్‌ పోలిశెట్టి). చిల్లర కేసుల‌ని చ‌టుక్కున ఛేదిస్తూ డ‌బ్బు సంపాదిస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద కేసు రాక‌పోతుందా? అని ఆశ‌గా ఎదురు చూస్తుంటాడు. అత‌ని ద‌గ్గర అసిస్టెంట్‌గా స్నేహ ( శ్రుతి శ‌ర్మ) చేరుతుంది. చిన్న చిన్న కేసుల‌తోనే కాల‌క్షేపం చేసే వీళ్లకి అనుకోకుండా ఓ పెద్ద కేసు దొరుకుతుంది. ఆ సమయంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జైల్లో ఉంటాడు. అస‌లు ఆత్రేయ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వ‌స్తుంది? వీళ్లకి దొరికిన ఆ పెద్ద కేసు ఏమిటి? దాన్ని ఎలా ఛేదించాడు? ఆ క్రమంలో ఎలాంటి విష‌యాలు తెలిశాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: ప‌రిశోధ‌నాత్మక థ్రిల్లర్ క‌థా చిత్రమిది. ఒక నేరం చుట్టూ అల్లుకున్న చిక్కుముడుల‌ని ఒక్కొక్కటిగా విప్పుతూ వెళుతున్న క్రమంలో మ‌రెన్నో విష‌యాలు వెలుగులోకి వ‌స్తుంటాయి. ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. ఆ నేప‌థ్యంలో సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తూనే చ‌క్కటి వినోదాన్ని పంచుతాయి. మ‌రోప‌క్క ‘చంట‌బ్బాయ్’ త‌ర‌హా గ‌మ్మత్తైన డిటెక్టివ్ పాత్ర ఉండ‌నే ఉంటుంది. ఆద్యంతం హాస్యం పంచుతుంటుంది ఆ పాత్ర‌. దాంతో స‌న్నివేశాల‌న్నీ ప‌రుగులు పెడుతుంటాయి. తొలి స‌గ‌భాగం సినిమా పాత్రల ప‌రిచయానికి, అస‌లు కేసుని మొద‌లు పెట్టడానికి ఉప‌యోగించుకున్నాడు ద‌ర్శకుడు. అక్కడక్కడా కొన్ని స‌న్నివేశాలు చ‌ప్పగా అనిపించినా... ఏజెంట్ పాత్ర చేసే సంద‌డి మంచి కాలక్షేపాన్నిస్తుంది. అస‌లు కేసు ప‌రిశోధ‌న ఎప్పుడైతే మొద‌ల‌వుతుందో అప్పట్నుంచి క‌థ వేగం అందుకుంటుంది.

ద్వితీయార్ధంలో సాగే ప‌రిశోధ‌న అంతా కూడా థ్రిల్‌కి గురిచేస్తుంది. ప్రేక్షకుడి ఊహ‌కు అంద‌ని రీతిలో స‌న్నివేశాలు సాగుతుంటాయి. అయితే ఆ మ‌లుపుల మోతాదు మ‌రీ శ్రుతిమించాయి. దాంతో కొన్నిచోట్ల గంద‌రగోళంగా అనిపిస్తుంది. అంత‌లోపే ద‌ర్శకుడు మ‌ళ్లీ ప‌తాక స‌న్నివేశాల‌పై ప‌ట్టు బిగించాడు. కేసుని ఆశ్చర్యక‌ర‌మైన రీతిలో ముగించ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఇందులో సెంటిమెంట్‌కి, సందేశానికి కూడా చోటుంది. అది కూడా క‌థ‌లో భాగంగానే. హాస్యం, థ్రిల్లింగ్ అంశాల మేళ‌వింపుతో  ప్రేక్షకుల‌కు స‌రికొత్త వినోదాన్ని పంచే చిత్రమిది. దాదాపుగా అంద‌రూ కొత్త న‌టీన‌టులైనా, వాళ్ల పాత్రల్లో స‌హ‌జంగా ఇమిడిపోయిన విధానం ప్రేక్షకుల‌కు తాజాద‌నాన్ని పంచుతుంది. 

ఎవ‌రెలా చేశారంటే: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ పాత్రలో న‌టించిన న‌వీన్ పోలిశెట్టి త‌న న‌ట‌న‌తో పాత్రకి ప్రాణం పోశాడు. ఆ పాత్రలో మ‌రొక‌రిని ఊహించుకోలేం అన్నట్టుగా ఉంది ఆయ‌న అభిన‌యం. కామెడీ టైమింగ్‌లో, సెంటిమెంట్ పండించ‌డంలో ఎంతో ప‌రిణ‌తి ప్రద‌ర్శించాడు. ఆయ‌న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా స‌మ‌కూర్చడం విశేషం. అందులోనూ ఆయ‌న ప‌నిత‌నం అడుగ‌డుగునా మెప్పిస్తుంది. స్నేహ అనే అసిస్టెంట్  పాత్రలో శ్రుతి శ‌ర్మ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. ప్రధాన పాత్రతో పాటే సినిమా అంతా క‌నిపిస్తుంది. ఈ రెండు పాత్రలే సినిమాకి కీల‌కం. మిగిలిన పాత్రధారులు కూడా దాదాపుగా కొత్తవాళ్లే. కానీ వాళ్ల అభిన‌యంలో మాత్రం స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డింది.

సాంకేతిక విభాగం చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. మార్క్ కె.రాబిన్ సంగీతంతో పాటు, స‌న్నీ కూర‌పాటి కెమెరా ప‌నిత‌నం చాలా బాగుంది. నెల్లూరు నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ఆ వాతావ‌ర‌ణం ఉట్టి ప‌డిందంటే కార‌ణం కళా విభాగం ప‌నితీరే. ద‌ర్శకుడు స్వరూప్ రాసుకున్న క‌థ‌, ఆయ‌న చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. ఆయ‌న రాసిన మాట‌ల్లోనూ మెరుపులు క‌నిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. 
బ‌లాలు
+ క‌థ‌, క‌థ‌నం
+ వినోదం 
+ న‌వీన్ పోలిశెట్టి అభిన‌యం
+ సాంకేతిక‌త‌

బ‌లహీన‌త‌లు
- ద్వితీయార్ధంలో మ‌లుపులు
చివ‌రిగా: ఈ ఏజెంట్ అసాధ్యుడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.