close
సినిమా రివ్యూ
రివ్యూ: నిను వీడ‌ని నీడ‌ను నేనే

నటీనటులు: సందీప్‌కిష‌న్‌, అన్యాసింగ్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. తమన్ 
ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ 
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ 
క‌ళ‌: విదేష్ 
నిర్మాతలు: దయా పన్నెం సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్‌,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ రాజు
విడుద‌ల‌: 12 జులై 2019

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ నిర్మిస్తూ నటించిన తొలి చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అద్దంలో చూసుకున్నప్పుడు మరొకరి ప్రతిబింబం కనిపించడమనే ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని ఈ సినిమాను తీశారు కార్తిక్‌ రాజు. వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం.

క‌థేంటంటే: అర్జున్ (సందీప్‌కిష‌న్‌), మాధ‌వి ( అన్యాసింగ్) ప్రేమికులు. క‌ళాశాల‌లోనే ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురుస్తుంది. పెద్దలు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో వాళ్లని కాద‌ని పెళ్లి చేసుకుంటారు. ఒక ఇంట్లో హాయిగా జీవితం గడిపేస్తుంటారు. ఇంత‌లో వీరు కారులో ప్రయాణం చేస్తుండ‌గా రోడ్డు ప్రమాదం జ‌రుగుతుంది. ఆ ఘటన శ్మశానానికి ద‌గ్గర్లోనే జ‌రుగుతుంది. అప్పట్నుంచి అర్జున్‌, మాధ‌విలలో మార్పు వ‌స్తుంది. అద్దంలో చూసుకుంటే వారి ప్రతిరూపానికి బ‌దులు మ‌రొక‌రు క‌నిపిస్తుంటారు. ఎందుకిలా అని డాక్టర్‌ని సంప్రదిస్తే.. ‘మీరు అర్జున్, మాధ‌వి కాదు. రిషి (వెన్నెల‌కిషోర్‌), ఆయ‌న భార్య దియా’ అని చెబుతారు. ఇంత‌కీ అర్జున్‌, మాధ‌విలు రిషి, దియాల దేహాల్లోకి ఎలా వ‌చ్చారు? ఎందుకు వ‌చ్చారు?  వాళ్లకి వీళ్లకి సంబంధ‌మేమిటి? ప్రమాదం త‌ర్వాత అర్జున్‌, మాధ‌విలకి ఏం జ‌రిగింది? అలా ఒక‌రి దేహాల్లో మ‌రొక‌రు ఎంత కాలం ఉన్నారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: మ‌రో కొత్త ర‌క‌మైన క‌థ‌తో తెర‌కెక్కిన చిత్రమిది. హార‌ర్‌, మిస్టరీ అంశాల మేళ‌వింపు ఆక‌ట్టుకుంటుంది. ఆరంభ స‌న్నివేశాలతో.. త‌రుచూ వ‌చ్చే సినిమాల్లాగే ఇది కూడా ఆత్మల క‌థే అనిపిస్తుంది. కానీ ఆ త‌ర్వాత క‌థాగ‌మ‌నం మారిపోతుంది. ఆత్మలని మించిన విష‌యాల్ని స్పృశిస్తూ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శకుడు. ఇదొక మిస్టరీ క‌థలా సాగుతుంది. ఒక ప్రమాదం త‌ర్వాత ఒక‌రి రూపాలకి బ‌దులు మ‌రొక‌రి రూపాలు క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఎందుకిలా జ‌రుగుతోందంటూ అర్జున్, మాధ‌విలే డాక్టర్లని సంప్రదిస్తుంటారు. అక్కడ్నుంచి క‌థలో ప‌లు మ‌లుపులు చోటు చేసుకుంటాయి. విరామం స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఆ త‌ర్వాత నుంచి వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. ఆ ఆత్మలు ఎవ‌రివి? వారిలో ఉన్న అస‌లు మ‌నుషులు ఎవ‌రు? అనే సందేహాలు త‌లెత్తుతాయి. వాటిని నివృత్తి చేయ‌డానికి కొన్ని స‌న్నివేశాల్ని తీసుకున్నారు ద‌ర్శకుడు. ద్వితీయార్ధంలో స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు సెంటిమెంట్ ప్రధానంగా సాగుతాయి. చివ‌ర్లో ఓ సందేశం కూడా ఉంది. ద‌ర్శకులు వి.ఐ.ఆనంద్‌, కార్తిక్ న‌రేన్, నటి మాళ‌వికా నాయ‌ర్ అతిథి పాత్రల్లో క‌నిపిస్తారు.  క‌థ‌, క‌థ‌నాలు కొత్తగా అనిపిస్తాయి. అయితే వాటిని మ‌రింత ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దడంలో ద‌ర్శకుడు విఫ‌ల‌మ‌య్యారు. ద్వితీయార్ధంలో క‌థ లేక‌పోవ‌డం, క‌థ‌నం ప‌ట్టు త‌ప్పడం సినిమాకి మైన‌స్‌గా మారింది. 

ఎవ‌రెలా చేశారంటే: సందీప్‌ కిష‌న్, అన్యాసింగ్ పాత్రలే కీల‌కం. వాళ్లిద్దరూ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. ముఖ్యంగా సందీప్‌ కిష‌న్ స్టైలిష్‌గా క‌నిపిస్తూనే, హార‌ర్ అంశాల్లో ఒదిగిపోయాడు. సెంటిమెంట్‌ని కూడా బాగా పండించాడు. అన్యాసింగ్ పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది.  వెన్నెల‌కిషోర్ ప్రథ‌మార్ధంలో అద్దంలో మాత్రమే క‌నిపిస్తుంటారు. కానీ ఆయ‌న క‌నిపించిన ప్రతిసారీ హాస్యం పండుతుంది. క‌థంతా కూడా ఆయ‌న పాత్ర చుట్టూనే సాగుతుంది. ద్వితీయార్ధంలో ఆయ‌న పాత్ర కూడా సెంటిమెంట్‌ని పండిస్తుంది. పోసాని కృష్ణముర‌ళి దెయ్యాలంటే భ‌య‌పడే పోలీసు అధికారిగా న‌వ్విస్తారు. ముర‌ళీశ‌ర్మ‌, ప్రగ‌తి, పూర్ణిమా భాగ్యరాజ్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం, ప్రమోద్ వ‌ర్మ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. కార్తీక్ రాజు కొత్త అంశాన్ని స్పృశించాడు. సందీప్‌ కిష‌న్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కింది. సినిమా స్థాయికి త‌గ్గట్టుగా నిర్మాణ విలువ‌లున్నాయి. 

బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థాంశం - ద్వితీయార్ధం
+ న‌టీన‌టులు  
+ ప‌తాక స‌న్నివేశాల్లో భావోద్వేగాలు  

చివ‌రిగా: ఆత్మల కథే... కాస్త భిన్నంగా!
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.