close
సినిమా రివ్యూ
రివ్యూ: ఇస్మార్ట్‌ శంకర్‌

నటీనటులు: రామ్‌, నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌, సత్యదేవ్‌, గెటప్‌ శ్రీను, షాయాజీ షిండే తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్‌: రాజ్‌ తోట
నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్‌
నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 18-07-2019

తెలుగు తెరపై హీరోయిజానికి ఓ కొత్త అర్థం చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. తన మ్యాజిక్‌తో సంచలన విజయాల్ని అందుకున్నారు. అయితే కొన్నాళ్ల నుంచి పూరి హిట్ రేసులో బాగా వెనుకబడిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, బాక్సాఫీసు దగ్గర తనదైన మార్క్‌ చూపించుకోలేకపోతున్నారు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ఉద్దేశంతో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ని రూపొందించారు. మాస్‌ ఇమేజ్‌ కోసం పరితపిస్తున్న రామ్‌ ఇందులో కథానాయకుడు. మరి పూరి - రామ్‌ కలిసి మ్యాజిక్‌ చేయగలిగారా? మాస్‌లో రామ్‌ రేంజ్‌ ఈ సినిమాతో పెరిగిందా?పూరి మళ్లీ ట్రాక్‌ ఎక్కగలిగారా?

కథేంటంటే: శంకర్‌ (రామ్‌) ఓ కిరాయి రౌడీ. భయం, భక్తి రెండూ లేవు. డబ్బు కోసం ఓ హత్య కూడా చేస్తాడు. అయితే ఆ హత్య తరవాత.. రామ్‌ని పోలీసులు వెంటాడడం మొదలెడతారు. ఈ పోరులో తన ప్రాణానికి ప్రాణమైన చాందిని (నభా నటేషా)ని కోల్పోతాడు. తన ప్రేయసి చావుకి కారణమైన వాళ్ల కోసం శంకర్‌ గాలించడం మొదలెడతాడు. అయితే శంకర్‌ కూడా ఓ ప్రమాదంలో గాయపడి, సీబీఐకి దొరికేస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఓ పోలీస్‌ అధికారి (సత్యదేవ్‌)కి చెందిన మెమొరీ కార్డుని శంకర్‌ మెదడులో నిక్షిప్తం చేయాల్సి వస్తుంది. అలా ఎందుకు?ఆ తరవాత ఏమైంది? అనేదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే: పూరిది ముందు నుంచీ మాస్‌ దారే. వాళ్లని మెప్పించడంపైనే దృష్టిపెడుతుంటారు. ఈసారి మెదళ్ల మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకున్నా, దాన్ని కూడా తనకు అలవాటైన దారిలోనే చెప్పాలని ప్రయత్నించారు. అసలు మెదళ్ల మార్పిడి సాధ్యమేనా? అనే విషయంపై ప్రేక్షకులకు ఎలాంటి అనుమానాలూ రాకుండా, టైటిల్స్‌ పడేటప్పుడే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రామ్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన బలం. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, దానికి కాస్త డోసు ఎక్కువ చేసి మరీ రామ్‌ పాత్రని రాసుకున్నారు. రామ్‌ మాటలు, చేష్టలూ మాస్‌కి నచ్చుతాయి. రామ్‌ కనిపించిన ప్రతి సన్నివేశం మాస్‌ కోసమే డిజైన్‌ చేశారు. దాంతో పాటు నభా నటేష్‌ పాత్ర కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు నడిపించుకుంటూ విశ్రాంతి ఘట్టం వరకూ తీసుకొచ్చేశారు. అక్కడ మెమొరీ మార్పిడి మొదలవుతుంది. ఒక్కడే ఇద్దరిలా ప్రవర్తిస్తుంటాడు. కథంతా దాని చుట్టూనే తిప్పుతూ, అందులోనే వినోదాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేశాడు. కాకపోతే... ప్రేక్షకుడు లాజిక్కుల్ని పూర్తిగా మర్చిపోయి సినిమా చూడాలి. పూరి కొత్త పాయింట్‌ తీసుకున్నా, మళ్లీ అరిగిపోయిన రివెంజ్‌ డ్రామా వైపే ఈ కథని తీసుకురావడం ఇబ్బంది కలిగిస్తుంది. కథని తన ఇష్టానికి మార్చుకుంటూ వెళ్లి, తనకు అనువుగా ఉండేలా సీన్లు రాసుకున్నారు. ఈ ప్రయాణంలో మాస్‌ని మెప్పించాడేమో గానీ, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ని తీర్చిదిద్దలేకపోయారు.

ఎవరెలా చేశారంటే: మాస్‌కి దగ్గరవ్వాలన్నది రామ్‌ ప్రయత్నం. ఈ కథని ఎంచుకోవడానికి కారణం అదే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో తన లక్ష్యం నెరవేరింది. రామ్‌లోని ఎనర్జీ మొత్తం ఈ పాత్రలో కనిపిస్తుంది. నటుడిగా తనకు పరిపూర్ణమైన సంతృప్తి లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తానొక్కడే ఈ సినిమా మొత్తాన్ని నడిపించగలిగాడు. కథానాయికల పాత్రలు రెండూ గ్లామర్‌ కోసమే అన్నట్లుగా ఉన్నాయి. నభా పాత్రకైతే డోసు ఇంకాస్త ఎక్కువైంది. సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపిస్తాడు. షాయాజీ షిండేతో సహా మిగిలిన పాత్రలన్నీ రొటీన్‌గానే సాగుతాయి. ప్రతినాయకుడి పాత్రని చివరి వరకూ దాచి పెట్టారు దర్శకుడు. దాంతో హీరోకి ఎదురే లేకుండా పోతుంది. అది కథలో కనిపించే ప్రధాన లోపం.

మణిశర్మ పాటలు మాస్‌కి బాగా నచ్చుతాయి. అందులో రామ్‌ వేసిన స్టెప్పులు కూడా నచ్చుతాయి. నేపథ్య సంగీతంలోనూ మణి తనదైన మార్క్‌ చూపించారు. పూరి డైలాగులు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. తెలంగాణ యాసలో రాసిన సంభాషణలు కిక్‌ ఇస్తాయి. కొన్ని డైలాగులు సెన్సార్‌ కత్తెరలో కొట్టుకుపోయాయి. కథలో ఏదో కొత్తదనం చూపించాలని ఈ కాన్సెప్ట్‌ ఎంచుకున్నారు పూరి. అయితే ఆ పాయింట్‌ని కూడా తనదైన పాత పద్ధతిలోనే ఆవిష్కరించారు. 

బలాలు బలహీనతలు
+ రామ్‌ నటన
+ సంభాషణలు
+ పాటలు

 
- లాజిక్‌ లేకపోవడం

చివరిగా: ఈ ‘శంకర్’ మాస్‌కు మాత్రమే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.