close
సినిమా రివ్యూ
రివ్యూ: జబరియా జోడీ

శుక్రవారం విడుదలైన ‘జబరియా జోడీ’ కథ ఇదే

ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం...  పెళ్లిలో రకాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఇవే. కానీ, బిహార్‌ వెళ్తే అక్కడ ఇంకో రకం వివాహం కూడా ఉంటుంది. అదే అపహరణ వివాహం (కిడ్నాప్‌ పెళ్లి). ఇది గాంధర్వ వివాహానికి దగ్గరగా ఉంటుంది. గాంధర్వంలో పెళ్లి కూతురును పెళ్లి కొడుకు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ కిడ్నాప్‌ పెళ్లిలో వధువు కుటుంబ సభ్యులు వరుడిని అపహరిస్తారు. ఇదేదో సరదాకి అనుకునేరు. అలా అని దీని వెనుక ఆచారమూ లేదు... కేవలం పేదరికం మాత్రమే ఉంది. సరదాగా అనిపిస్తున్న ఈ పెళ్లి స్టైల్‌ వెనుక ఉన్నకష్టం ఇదీ..!

‘నా కూతురు పెళ్లి చేసుకుంటావా... లేక చస్తావా’ బిహార్‌లో ఈ డైలాగ్‌ అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. ఆ మధ్య వచ్చిన ‘అహ నా పెళ్లంట’లో అల్లరి నరేశ్‌ని శ్రీహరి అడిగినట్లు అన్నమాట. బిహార్‌లో ఈ శైలి ఎలా ఉంటుందంటే వరుడి తలకు తుపాకి గురిపెట్టి వధువు మెడలో తాళి కట్టిస్తారు. ఒక్కోసారి పెళ్లి విషయం వధువుకి కూడా తెలియదట. కట్నం అడిగినా, కట్నం కారణంగా వివాహం ఆగిపోయే పరిస్థితి వచ్చినా బిహార్‌లోని ఓ ప్రాంతంలో క్రిమినల్‌ గ్యాంగ్స్‌ పెళ్లి కొడుకును అపహరిస్తారు. ఆ తర్వాత ముందుగా అనుకున్న అమ్మాయితో వివాహం జరిపిస్తారు.  

కిడ్నాప్‌ వివాహం ఏ రేంజ్‌లో సాగుతోందంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బిహార్‌లో 1612 వరకు కేసులు నమోదయ్యాయని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ సర్వేలో తేలింది. 2017లో ఈ లెక్క 3,400కుపైగా ఉంది. 2016లో 3,070 మంది, 2015లో మూడు వేలమంది, 2014లో 2,526 మందికి బిహార్‌లో ఈ తరహా వివాహాలు జరిగాయట. ఈ క్రైమ్‌ నేపథ్యంలో ఈ రోజు ‘జబరియా జోడీ’ అనే హిందీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిందో చదివేయండి. 

నటీనటులు & సాంకేతిక బృందం

తారాగణం: సిద్ధార్థ్‌ మల్హోత్రా, పరిణీతి చోప్రా, జావేద్‌ జాఫ్రీ సంజయ్‌ మిశ్రా..
కథ: సంజీవ్‌. కె. ఝా
సంగీతం: తనిష్క్‌ బగ్చి, విశాల్‌ మిశ్రా, జోయెల్‌ క్రాస్టో
సినిమాటోగ్రఫీ: విశాల్‌ సిన్హా
నిర్మాణం: బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏఎల్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: ప్రశాంత్‌ సింగ్‌

కథేంటంటే..
బిహార్‌లోని మాధోపుర్‌లో అభయ్‌ సింగ్‌ (సిద్ధార్థ్‌ మల్హోత్రా) ఒక గ్యాంగ్‌స్టర్‌. రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. అక్కడ కట్నం ఇచ్చి వివాహం జరిపించలేని ఆడపిల్లల కుటుంబాలు వరుడిని అపహరించి బలవంతంగా వివాహం జరిపించే ఘటనలు తరుచుగా జరుగుతుంటాయి. ఇలా వరుడిని అపహరించి పేదింటి అమ్మాయిలకు వివాహం జరిపిస్తే ప్రజలకు చేరువ కావచ్చని దీనినే వృత్తిగా మార్చుకుంటాడు అభయ్‌ సింగ్‌. ఈ క్రమంలో అభయ్‌కి తన చిన్ననాటి స్నేహితురాలు తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ సమయానికి అభయ్‌కి ప్రేమ.. కెరీర్‌ ఏదో ఒకటే తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అభయ్‌ దేన్ని ఎంచుకున్నాడు? ప్రేమలో గెలిచాడా? అనుకున్న లక్ష్యం సాధించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే..
సామాజిక దురాచారాన్ని వినోదాత్మకంగా తెరెక్కించిన విధానం బాగుంది. దర్శకుడు సీరియస్‌ అంశంలో కొన్నిపాళ్ల వినోదం కలగలిపి చక్కగా కథ సిద్ధం చేసుకున్నాడు. సమాజంలో చాలా కాలంగా ఉన్న ఓ సమస్యను ఎలా చూపిస్తారో అని అందరూ ఎదురు చూస్తుండగా వన్‌ లైన్‌ పంచ్‌లతో ఎవరినీ నొప్పించకుండా అలా అని కథ ట్రాక్‌ తప్పకుండా దర్శకుడు నడిపించాడు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రధాన పాత్రల మీద సహాయ పాత్రల డామినేషన్‌ ఎక్కువైనట్లు అనిపించింది. ఇది సినిమా మొత్తంగా చూస్తే పంటికింది రాయిలా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే..
సినిమాలో నాయకానాయికల కంటే ఇతర పాత్రలకే తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎక్కువగా కలిగింది. సిద్ధార్థ మల్హోత్రా తనదైన శైలిలో డ్రామా సన్నివేశాల్లో మెప్పించాడు. పరిణీతి చోప్రా నటించడానికి పెద్దగా అవకాశం దక్కలేదు. చాలా సన్నివేశాల్లో కనిపించడానికి పరమితమైపోయింది. సహాయ నటుల్లో సంజయ్‌ మిశ్రా అదరగొట్టేశాడు. అతనితోపాటు జావెద్‌ జాఫ్రీ, అపరశక్తి ఖురానా మెప్పించారు. 

చివరిగా: సీరియస్‌ కథలో... వన్‌ లైనర్లతో తెగ నవ్వించారు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘జబరియా జోడీ’కి ముందు కూడా కిడ్నాప్‌ పెళ్లి నేపథ్యంలో ఓ సినిమా వచ్చింది. 2010లో ‘అంతర్‌ ద్వంద్‌’ పేరుతో సుశీల్‌ రాజ్‌పాల్‌ తెరకెక్కించాడు. ఈ సినిమాకు జాతీయ పురస్కారాల్లో పురస్కారం కూడా దక్కింది. ‘సామాజిక అంశాల మీద తీసిన ఉత్తమ చిత్రం’గా ‘అంతర్‌ ద్వంద్‌’కు 2009లో పురస్కారం లభించింది. 

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.