close
సినిమా రివ్యూ
రివ్యూ: జోడి

చిత్రం: జోడి
న‌టీన‌టులు: ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేశ్‌, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ త‌దిత‌రులు. 
సంగీతం : ‘నీవే’ ఫేమ్‌ ఫణికళ్యాణ్
సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్ 
ఎడిటర్ : రవి మండ్ల 
ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ
మాటలు: త్యాగరాజు(త్యాగు) 
నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం 
దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల
సంస్థ‌: భావనా క్రియేషన్స్ 
విడుద‌ల‌: 06-09- 2019

ఆది సాయికుమార్‌ మంచి విజ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు కానీ.. ఆయ‌న ప్రయత్నాలేవీ ఫ‌లించ‌డం లేదు. ఇటీవ‌లే ‘బుర్రకథ‌’ చేసి ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. తాజాగా మ‌రో చిత్రం `జోడి`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాను ఎప్పట్నుంచో ఎదురు చూసిన రియ‌లిస్టిక్ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని ఆది ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. మ‌రి ఈ సినిమా ఎలాంటి క‌థ‌తో తెర‌కెక్కిందో తెలుసుకుందాం.. 

క‌థేంటంటే: క‌పిల్ (ఆది సాయికుమార్‌) ఐటీ కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా ప‌నిచేస్తుంటాడు. ఫ్రెంచి భాష నేర్పించే టీచ‌ర్ కాంచ‌న మాల (శ్రద్ధాశ్రీనాథ్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. కాంచ‌న‌మాల తండ్రి చ‌నిపోవ‌డంతో ఆమె తాత (గొల్లపూడి మారుతీరావు), బాబాయ్ (సిజ్జు) సంర‌క్షణ‌లో ఉంటుంది. క‌పిల్‌ని కాంచ‌న‌మాల కూడా ఇష్టప‌డ‌టంతో ఇద్దరూ వాళ్ల ఇంట్లోవాళ్లని ఒప్పించే ప్రయ‌త్నాల్లో ఉంటారు. అంత‌లోనే కాంచ‌న‌మాల తండ్రి చ‌నిపోవ‌డానికి కార‌ణం క‌పిల్ తండ్రి క‌మ‌లాక‌ర్ (న‌రేశ్‌) అనే విష‌యం బ‌య‌టికొస్తుంది. అదెలా? క్రికెట్ బెట్టింగ్‌కి బానిసైన క‌మ‌లాక‌ర్‌కీ, కాంచ‌న‌మాల తండ్రికీ సంబంధ‌మేమిటి? మరి కపిల్‌, కాంచ‌నమాల పెళ్లి జరిగిందా?.. లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: ప్రేమ‌, కుటుంబ అనుబంధాల నేప‌థ్యంలో సాగే చిత్రమిది. తొలి భాగం సినిమా అంతా నాయ‌కానాయిక‌ల ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. ద్వితీయార్థం కుటుంబ అనుబంధాల చుట్టూ సాగుతుంది. ఒక‌ట్రెండు పాత్రల్ని డిజైన్ చేసిన విధానంలో వైవిధ్యం క‌నిపిస్తుంది త‌ప్పా క‌థ‌, క‌థ‌నాల్లో ఏమాత్రం కొత్తద‌నం లేదు. ప్రేమ‌, కుటుంబ అనుబంధాలు ఎప్పుడూ ఒక‌లాగే ఉంటాయి. కానీ వాటిని తెర‌పై చూపించే విధానం కాలానికి త‌గ్గట్టుగా ఉన్నప్పుడే ప్రేక్షకుల‌కి న‌చ్చుతుంది. కానీ ద‌ర్శకుడు ఇందులో ప‌డిక‌ట్టు విధానం ప్రకార‌మే ప్రేమ‌క‌థ‌ని న‌డిపాడు. రెండు మ‌న‌సులు ప్రేమ‌లో ప‌డ‌టానికి బ‌ల‌మైన కార‌ణం కావాలి. ఎదుటివ్యక్తిలో ఏదో ఒక అంశం బ‌లంగా న‌చ్చాలి. కానీ ఇందులో అవేవీ లేకుండానే ఒక జంట ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ వెంట‌నే పాట.. ఇద్దరూ క‌లిసి మైసూర్ వెళ్లొస్తారు. వాళ్లిద్దరూ ఒక్కటి కావ‌డం చుట్టూనే మిగ‌తా క‌థ నడుస్తుంటుంది. ఇందులో కుటుంబ క‌థ కూడా అంతే పేలవంగా ఉంటుంది. బ‌ల‌మైన భావోద్వేగాల‌కీ, సంఘ‌ర్షణ‌లకీ ఆస్కారమున్నప్పటికీ  ద‌ర్శకుడు సాదాసీదాగా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు. దాంతో ఏ ఒక్క స‌న్నివేశం పండ‌లేదు. వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ఆది నేప‌థ్యంలో వ‌చ్చే రియ‌ల్ ఎస్టేట్‌కి సంబంధించిన స‌న్నివేశాలు కాసింత హాస్యాన్ని పంచుతాయంతే. ప‌తాక స‌న్నివేశాల్లో జూదం గురించి సందేశం చెప్పించారు. ప‌తాక స‌న్నివేశాలు సాదాసీదాగానే సాగుతాయి. 

ఎవ‌రెలా చేశారంటే: ఆది సాయికుమార్ ఎప్పట్లాగే తెర‌పై క‌నిపించారు. న‌ట‌న‌, హావ‌భావాల్లో కొత్తద‌న‌మేమీ క‌నిపించలేదు. పాత్రని డిజైన్ చేసిన విధాన‌మే అందుకు కార‌ణమ‌ని చెప్పొచ్చు. శ్రద్ధా శ్రీనాథ్‌లో ఎంత మంచి న‌టి చెప్పేందుకు ఇటీవల వచ్చిన `జెర్సీ`నే ఉదాహ‌ర‌ణ‌. కానీ ఇందులో ఏ మాత్రం ప్రభావం చూపించ‌ని పాత్రలో క‌నిపించారు. ఆమె పాత్ర నుంచి భావోద్వేగాలు పండించే ఆస్కార‌మున్నప్పటికీ.. ఆమెని అందంగా ముస్తాబు చేయించి, కెమెరా ముందు నిల‌బెట్టిన‌ట్టుగా అనిపిస్తాయి చాలా స‌న్నివేశాలు. సినిమా మొత్తం క‌నిపించినా ఆమెకి న‌టించే అవ‌కాశ‌మే రాలేదు. న‌రేశ్‌ క్రికెట్ బెట్టింగ్‌కి బానిసైన తండ్రి పాత్రలో క‌నిపించారు. ఆయ‌న న‌ట‌న‌లో కూడా స‌హ‌జ‌త్వం క‌నిపించ‌లేదు. గొల్లపూడి మారుతీరావు, సితార, సిజ్జు వంటి న‌టులున్నా వాళ్లని పెద్దగా ఉప‌యోగించుకోలేదు. వెన్నెల‌ కిషోర్‌, స‌త్య కామెడీని పండించే ప్రయ‌త్నం చేశారు. ప్రతినాయ‌కుడిగా న‌టించిన ప్రదీప్ ప‌ర్వాలేద‌నిపించారు. త్యాగరాజ్ మాట‌లు అక్కడ‌క్కడా బాగుంటాయి. ఫ‌ణి క‌ల్యాణ్ సంగీతం, విశ్వేశ్వర్ కెమెరా ప‌నిత‌నం మెప్పించేలా ఉంటుంది. ఎడిట‌ర్ ర‌వి మండ్ల క‌త్తెర‌కి మ‌రింత ప‌ని చెప్పాల్సింది. ద్వితీయార్థంలో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. ద‌ర్శకుడు విశ్వనాథ్ అరిగెల క‌థ‌కుడిగా, ద‌ర్శకుడిగా విఫ‌ల‌మ‌య్యారు. 

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ జూదంపై సందేశం 
+ ఆది, వెన్నెల‌కిషోర్, స‌త్యల కామెడీ
- క‌థ‌, క‌థ‌నాలు
- సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు

చివ‌రిగా:  కొత్తద‌నం లేని ‘జోడి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.