close
సినిమా రివ్యూ
రివ్యూ: ప‌హిల్వాన్‌

చిత్రం: పహిల్వాన్‌
నటీనటులు: సుదీప్‌, ఆకాంక్ష సింగ్‌, సునీల్‌ శెట్టి, సుశాంత్‌ సింగ్‌, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అవినాష్‌ తదితరులు
సంగీతం: అర్జున్‌ జన్యా
సినిమాటోగ్రఫీ: కరుణాకర.ఎ
ఎడిటింగ్‌: రుబెన్‌
నిర్మాత: స్వప్నకృష్ణ
బ్యానర్‌: జీ స్టూడియోస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మోషన్‌ పిక్చర్స్‌, వారాహి చలన చిత్రం(తెలుగు)
దర్శకత్వం: ఎస్‌.కృష్ణ
విడుదల తేదీ: 12-09-2019

క‌న్న‌డ‌లో స్టార్ హోదా ద‌క్కించుకున్న న‌టుడు సుదీప్‌. తెలుగులోనూ సుదీప్‌కి మంచి పేరుంది. ముఖ్యంగా ‘ఈగ’లాంటి చిత్రాల‌తో ఇక్క‌డ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన కొన్ని సినిమాల్ని క‌న్న‌డ‌లో రీమేక్ చేసి అక్క‌డా మాస్‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. సుదీప్ ఇమేజ్‌కి త‌గిన క‌థ‌తో క‌న్న‌డ‌లో ‘పహిల్వాన్’ తెర‌కెక్కింది. అది తెలుగులోనూ విడుద‌ల అయ్యింది. మ‌రి సుదీప్ ‘ప‌హిల్వాన్’గా ఏ మేర‌కు మెప్పించాడు?  తెలుగులోనూ సుదీప్‌కి హిట్టు ద‌క్కిందా?

కథేంటంటే..: కృష్ణ (సుదీప్‌) ఓ అనాథ‌. అతనిని శంక‌ర్ (సునీల్ శెట్టి) అనే ఓ కుస్తీ వ‌స్తాదు చేర‌దీస్తాడు. అతనికీ కుస్తీలో కిటుకులు నేర్పుతాడు. త‌న గురువులానే కుస్తీలో కృష్ణ ప‌ట్టు సాధిస్తాడు. ఓ అమ్మాయి (ఆకాంక్ష సింగ్‌)  ప్రేమ‌లో ప‌డిన కృష్ణ కుస్తీని క్ర‌మంగా నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు. త‌న‌కు ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ‘నా వ‌ల్ల నీకు అబ్బిన కుస్తీ విద్య‌ని ఎప్పుడూ ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌కు’ అంటూ కృష్ణ‌ని ఆదేశిస్తాడు శంక‌ర్‌. గురువు ఆజ్ఞ మేర‌కు కుస్తీని వ‌దిలి దూరంగా వెళ్లిపోతాడు. అలాంటి కృష్ణ బాక్సింగ్ ఛాంపియ‌న్‌గా ఎలా అవ‌తారం ఎత్తాడు?  త‌న గురువుకి మ‌ళ్లీ ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు?  అనేదే ‘ప‌హిల్వాన్’ క‌థ‌.

ఎలా ఉందంటే..: ‘కేజీఎఫ్’ తర్వాత క‌న్న‌డ సినిమాల‌పై మ‌రింత గౌర‌వం పెర‌గింది. వాళ్ల బ‌డ్జెట్లూ పెరిగాయి. ‘ప‌హిల్వాన్’కీ చిత్ర‌బృందం భారీ స్థాయిలోనే ఖ‌ర్చు పెట్టింది. ప్ర‌తీ స‌న్నివేశం రిచ్‌గా క‌నిపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డింది. అయితే క‌థ విష‌యంలో మాత్రం అశ్ర‌ద్ధ చేసిన‌ట్టు అనిపిస్తోంది. ప‌హిల్వాన్ ఓ స్పోర్ట్స్ డ్రామా. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌న్నీ ఎలా సాగాయో.. ప‌హిల్వాన్ కూడా అలానే సాగుతుంది. తెలుగులో వ‌చ్చిన ‘భ‌ద్రాచ‌లం’, ‘అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి’, ‘త‌మ్ముడు’.. హిందీ చిత్రాలు ‘సుల్తాన్’‌, ‘దంగ‌ల్’ ఛాయ‌లు చాలా ఈ సినిమాలో క‌నిపిస్తాయి. స్పోర్ట్స్ డ్రామాలో ఎలాంటి మ‌లుపులు, ముగింపులూ ఉంటాయో.. ‘ప‌హిల్వాన్’`లోనూ అవే క‌నిపిస్తాయి. క‌థ ఎలా ఉన్నా ఎమోష‌న్ వ‌ర్క‌వుట్ అయితే,  సినిమా న‌డుస్తుంది. ఆ ఎమోష‌న్ పండించ‌డంలోనూ ద‌ర్శ‌కుడు తడబడ్డాడు. సినిమాలో సెంటిమెంట్ స‌న్నివేశాల డోసు ఎక్కువైంది. ద్వితీయార్ధం నీర‌సించ‌డానికి అదో కార‌ణంగా నిలిచింది.

సుదీప్ హీరోయిజాన్ని న‌మ్ముకుని తెర‌కెక్కించిన సినిమా ఇది. క‌న్న‌డ‌లో సుదీప్‌ కోస‌మైనా ఈ సినిమా చూస్తారేమో. తెలుగులో సుదీప్ హీరో కాదు. విల‌న్‌, క్యారెక్ట‌ర్ న‌టుడు మాత్ర‌మే. త‌న‌ని హీరోగా ఎంత వ‌ర‌కూ స్వీక‌రిస్తార‌న్న‌ది ప్ర‌ధాన‌మైన స‌మస్య‌. స్పోర్ట్స్ నేప‌థ్యంలోని స‌న్నివేశాల్ని చాలా బాగా తెర‌కెక్కించారు. మాస్‌ని  ఆక‌ట్టుకునే కొన్ని స‌న్నివేశాలు ఉన్నాయి. యాక్ష‌న్ స‌రే స‌రి. ఇవ‌న్నీ... ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌కుండా మెప్పిస్తాయి. అయితే అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చే అంశాలు ‘ప‌హిల్వాన్‌’లో క‌నిపించ‌వు.

కొన్ని ఎపిసోడ్లు ఆక‌ట్టుకున్నా  అవి క‌థ‌కు ఏమాత్రం బ‌లాన్ని తీసుకురాలేక‌పోయాయి.  తండ్రీ-కూతుళ్ల ఎపిసోడ్ ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేదే. కాక‌పోతే దాని నిడివి మ‌రీ ఎక్కువై విసిగిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలన్నీ బాక్సింగ్ నేప‌థ్యంలో సాగేవే. హీరో ఈ పోరులో గెలుస్తాడ‌ని ఎలాగూ ప్రేక్ష‌కులు ఊహిస్తారు. అదెలా అనే విష‌యంలో చివరి వ‌ర‌కూ ఆస‌క్తిని కొన‌సాగించ‌లేక‌పోయాడు. దాంతో  భారీ హంగుల‌తో వ‌చ్చిన ప‌హిల్వాన్ ఓ రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా నిలిచిపోవాల్సివ‌చ్చింది.

ఎవ‌రెలా చేశారంటే..: సుదీప్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశారీ సినిమాలో. దానికి త‌గ్గ‌ట్టు సుదీప్ కూడా ఈ పాత్ర‌లో రెచ్చిపోయాడు. త‌న బాడీ లాంగ్వేజ్ చాలా కొత్త‌గా క‌నిపిస్తుంది. మేకొవ‌ర్ కూడా న‌చ్చుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మ‌రింత ఈజ్ చూపించాడు. గురువుగా సునీల్ శెట్టిని తీసుకోవ‌డం క‌లిసొచ్చింది. ఆ పాత్ర‌లో ఓ కొత్త న‌టుడ్నిచూసే అవ‌కాశం ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ద‌క్కింది. ఆకాంక్ష సింగ్ పాత్ర మ‌రీ అంత ప్ర‌భావ‌వంతంగా ఏమీ తీర్చిదిద్ద‌లేదు. క‌బీర్ విల‌నిజం రొటీన్‌గా సాగిపోయింది. 
 

నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. మ‌రీ ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో బాగా ప‌నికొచ్చింది. పాట‌లు ఈ సినిమాకి మైన‌స్ అని చెప్పుకోవాలి. కెమెరా ప‌నిత‌నం, సెట్స్ ఆక‌ట్టుకుంటాయి. సాంకేతికంగా ఉన్న‌త స్థాయిలో ఉంది. కొన్ని సంభాష‌ణ‌లు ప్రేర‌ణ క‌లిగిస్తాయి. ఇంత భారీ బ‌డ్జెట్, హంగామా ఉంచుకుని ద‌ర్శ‌కుడు సాధార‌ణ క‌థ‌ని ఎంచుకోవ‌డం నిరాశ ప‌రుస్తుంది.

బ‌లాలు
+ సుదీప్‌
+ యాక్ష‌న్ స‌న్నివేశాలు
+సాంకేతిక విలువ‌లు

బ‌ల‌హీన‌తలు
- రొటీన్ క‌థ‌, క‌థ‌నం
- భారంగా సాగే ద్వితీయార్ధం

 

చివ‌రిగా: ‘ప‌హిల్వాన్’ ఇంకాస్త బలంగా ఉండాల్సింది!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.