close
సినిమా రివ్యూ
రివ్యూ: రాజుగారిగ‌ది 3
సినిమా: రాజుగారి గ‌ది 3
న‌టీన‌టులు: అవికా గోర్‌, అశ్విన్ బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌,  ఊర్వశి త‌దిత‌రులు 
ద‌ర్శక‌త్వం: ఓంకార్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్రవ‌ర్తి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడక్షన్‌ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ్రీమ‌ణి
ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ
స్టంట్స్‌: వెంక‌ట్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల‌: 18-10-2019


హిందీలో ఫ్రాంచైజీ సినిమాల జోరు ఎక్కువ‌. విజ‌య‌వంత‌మైన చిత్రాలకి కొన‌సాగింపుగా వ‌రుస‌గా సినిమాలు రూపొందుతూ ప్రేక్షకుల్ని అల‌రిస్తుంటాయి. వాటిపై ప్రేక్షకుల్లో ప్రత్యేక‌మైన ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. అదే ద‌ర్శక‌ నిర్మాత‌ల‌కి వ‌రం. ఆ త‌ర‌హాలో తెలుగులో ‘రాజుగారి గ‌ది’ కొన‌సాగుతోంది. అందులో మూడో చిత్రంగా రూపొందిందే ‘రాజుగారి గ‌ది3’. హార‌ర్ థ్రిల్లర్ జోన‌ర్‌లో భ‌యం, హాస్యం మేళ‌వింపుగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? మూడో గది ఆకట్టుకుందా?
క‌థేంటంటే: మాయ (అవికా గోర్‌) వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమెని తాకాల‌ని ఎవ‌రు ప్రయ‌త్నించినా వాళ్లు మ‌ర‌ణం అంచుల‌దాకా వెళుతుంటారు. ఎవ‌రికీ క‌నిపించ‌ని ఒక ఆత్మ ఆమెకి క‌వ‌చంలా ఉంటూ కాప‌లా కాస్తుంటుంది. ఆటోడ్రైవ‌ర్ అయిన అశ్విన్ (అశ్విన్ బాబు) కాల‌నీలో ప్రశాంత‌త‌కి భంగం క‌లిగిస్తున్నాడ‌ని ఇరుగుపొరుగువాళ్లు అత‌న్ని మాయ ప్రేమ‌లో ప‌డేలా చేస్తారు. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డితే మాయ వెన‌కాల ఉన్న ఆత్మ అశ్విన్‌ని చంపేస్తుంద‌నేది వాళ్ల ఆలోచ‌న. మ‌రి అశ్విన్ మాయ‌ని ప్రేమించాక ఏం జ‌రిగింది? ఇంత‌కీ మాయ వెన‌కాల ఉన్న ఆ ఆత్మ ఎవ‌రు? మాయ‌కే ఎందుకు కాపలా కాస్తోంది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఆత్మల క‌థలు లాజిక్‌కి అంద‌వు. ఒక కాన్సెప్ట్ ప్రకారం సాగుతుంటాయంతే. లాజిక్ గురించి ఆలోచించే అవ‌కాశం ఇవ్వకుండా న‌వ్వించాల్సిన చోట న‌వ్విస్తూ, భ‌య‌పెట్టాల్సిన చోట భ‌య‌పెడుతూ సినిమా ముందుకు సాగిందంటే విజ‌య‌వంత‌మైన‌ట్టే. అదే కొల‌త‌ల ప్రకార‌మే తెర‌కెక్కిన `రాజుగారి గ‌ది3` ప‌ర్వాలేద‌నిపిస్తుంది. య‌క్షి అనే ఒక ఆత్మని కాన్సెప్ట్‌గా తీసుకొని ఈ క‌థ‌ని తీర్చిదిద్దారు ద‌ర్శకుడు. కాక‌పోతే ఆ కాన్సెప్ట్ మ‌రీ చిన్నది కావ‌డంతో తెర‌పైన ద్వితీయార్ధం వ‌ర‌కూ క‌థ ఊసే క‌నిపించ‌దు. ప్రథ‌మార్ధం మొత్తం క‌థ లేకుండా కేవ‌లం కాల‌క్షేపం కోస‌మే అన్నట్టుగా స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. నాయ‌కానాయిక‌లు ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి కేర‌ళ‌కి వెళ‌తారో అప్పట్నుంచి క‌థ ఊపందుకుంటుంది. గ‌రుడ‌పిళ్లైగా అజ‌య్ ఘోష్‌, జ‌గ‌న్మాత‌గా  ఊర్వశి చేసే సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. అంద‌రినీ భ‌య‌పెట్టే వాళ్లకి, రాజ‌మ‌హ‌ల్‌లో ఎదుర‌య్యే అనుభ‌వాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. య‌క్షి అనే ఆత్మకి సంబంధించిన తాళ‌ప‌త్ర గ్రంథాల కోసం అన్వేష‌ణ సాగుతున్నంత‌సేపూ న‌వ్వులు పండుతాయి. ఆత్మ వెన‌క క‌థ‌ని చెప్పిన విధానం, కాన్సెప్ట్ మెప్పిస్తాయి. ‘రాజుగారి గ‌ది2’ని మించి న‌వ్విస్తాన‌ని ద‌ర్శకుడు ఓంకార్ చెప్పినట్టుగానే ‘రాజుగారి గ‌ది3’లో న‌వ్వుల మోతాదుగా కొంచెం మెండుగానే ఉంది. కాక‌పోతే ప్రథ‌మార్ధంపై మ‌రికాస్త దృష్టిపెట్టుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రో స్థాయిలో ఉండేది.

ఎవ‌రెలా చేశారంటే: అశ్విన్‌, అలీ మామా అల్లుళ్లుగా క‌నిపిస్తూ సందడి చేస్తారు. ఇదివ‌ర‌క‌టి సినిమాల‌తో పోలిస్తే అశ్విన్ న‌ట‌న ప‌రంగా, డ్యాన్స్ ప‌రంగా మ‌రింత ప‌రిణ‌తి సాధించారు. అలీ త‌న మార్క్ హావ‌భావాలు, సంభాష‌ణ‌ల‌తో న‌వ్వించారు. అజ‌య్‌ఘోష్‌,  ఊర్వశి పాత్రలు ద్వితీయార్ధంలో క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. బురిడీ బాబాల్ని పోలిన వాళ్ల అవ‌తారం, దెయ్యాల్ని చూసి భ‌య‌ప‌డే తీరుతో న‌వ్వులు బాగా పండాయి. అవికా గోర్‌కి పెద్దగా న‌టించే అవ‌కాశం రాలేదు. ప‌తాక స‌న్నివేశాల్లో ఆమె దెయ్యంగా కాసేపు సంద‌డి చేస్తారు. ధ‌న్‌రాజ్‌, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, హ‌రితేజ, శివ‌శంక‌ర్ మాస్టర్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఛోటా కె.నాయుడు కెమెరా రాజుగారి గ‌దిని చాలా బాగా చూపించింది. భ‌య‌పెట్టడంలో ఆయ‌న లైటింగ్ కీల‌క పాత్ర పోషించింది. సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు బాగున్నాయి. ష‌బ్బీర్ నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. ద‌ర్శకుడు ఓంకార్ హార‌ర్ కామెడీ క‌థ‌ల‌పై మంచి ప‌ట్టు సంపాదించాడ‌ని కొన్ని స‌న్నివేశాలు రుజువు చేస్తాయి. అయితే క‌థ విష‌యంలోనే ఆయ‌న మ‌రింత దృష్టిపెట్టాలని చెబుతుందీ సినిమా.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ ద్వితీయార్ధంలో హాస్యం - ప్రథ‌మార్ధం 
+ అలీ.. అజ‌య్‌ఘోష్‌.. ఊర్వశిల న‌ట‌న - హార‌ర్‌, థ్రిల్లర్ అంశాలు కొర‌వ‌డ‌టం 
+ కాన్సెప్ట్‌  

చివ‌రిగా.. కొన్ని న‌వ్వులు పంచే మూడోగ‌ది
గమనిక: ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.