close
సినిమా రివ్యూ
రివ్యూ: తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌
సినిమా: తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్య కృష్ణ త‌దిత‌రులు
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్
కథ: టి.రాజసింహ
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహ‌ణం: సాయి శ్రీరామ్
కూర్పు: ఛోటా కె. ప్రసాద్
స్క్రీన్ ప్లే: రాజు, గోపాల కృష్ణ
బ్యానర్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్
విడుద‌ల‌: 15-11-2019

హాస్యం ప‌రంగా మంచి ప‌ట్టున్న ద‌ర్శకుడిగా జి. నాగేశ్వర‌ రెడ్డికి గుర్తింపు ఉంది. మ‌ధ్యలో ప‌రాజ‌యాల్ని చ‌విచూస్తూ వ‌స్తున్నా.. మంచి క‌థ కుదిరిన ప్రతిసారీ ఆయ‌న న‌వ్విస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. దాంతో నాగేశ్వర‌రెడ్డి నుంచి సినిమా వ‌స్తుందంటే ఇప్పటికీ ప్రేక్షకులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు. గ‌త మూడు సినిమాలుగా వ‌రుస‌గా ప‌రాజ‌యాల్ని చ‌విచూసిన ఆయ‌న ఇటీవ‌ల చేసిన మ‌రో ప్రయత్నమే ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌’. యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం, ప్రచార చిత్రాలు ఆక‌ట్టుకునేలా ఉండ‌టంతో నాగేశ్వర‌రెడ్డి మ‌ళ్లీ త‌న మార్క్‌ని చూపించాడేమో అనే అంచ‌నాలు ప్రేక్షకుల్లో క‌నిపించాయి. మ‌రి ఆ అంచ‌నాలను ఆయ‌న నిజం చేశారా? సందీప్‌ కిష‌న్ హాస్య ప్రధాన‌మైన క‌థ, పాత్రల్లో క‌నిపించి ఎలాంటి ప్రభావం చూపించారు?

క‌థేంటంటే: చెట్టు కింద ప్లీడ‌ర్ తెనాలి రామ‌కృష్ణ (సందీప్‌కిష‌న్‌). ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చినా త‌న ద‌గ్గరికి కేసులు రావు. త‌న తండ్రి మాత్రం కొడుకు ఒక పెద్ద కేసు వాదించి గెలిస్తే చూడాల‌ని ఆశ‌ప‌డుతుంటాడు. ఎంత‌కీ కేసులు రాక‌పోవ‌డంతో పెండింగ్ కేసుల గురించి తెలుసుకొని ఇరు వ‌ర్గాల్ని రాజీ చేస్తూ సొమ్ము చేసుకుంటుంటాడు. ఇంత‌లో పేరు మోసిన రాజ‌కీయ నాయ‌కురాలు వ‌ర‌ల‌క్ష్మి దేవి (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) కేసు త‌గులుతుంది. త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పే కేసు ఇదే అని స‌వాల్‌గా భావించి కోర్టులో వాదిస్తాడు, ఆమెను గెలిపిస్తాడు. కానీ ఆ కేసు గెలిచాక అందులో మ‌రో కోణం బ‌య‌టికొస్తుంది. ఆ కోణ‌మేమిటి? తెనాలికీ, వ‌ర‌ల‌క్ష్మి దేవికీ మ‌ధ్య సాగిన పోరాటంలో ఎవ‌రు గెలిచారు? రుక్మిణి (హ‌న్సిక‌)తో తెనాలి ప్రేమాయ‌ణం ఎక్కడిదాకా వెళ్లింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: క‌థ కంటే కూడా కామెడీనే ఎక్కువ న‌మ్ముకుంటారు ద‌ర్శకుడు జి. నాగేశ్వర‌రెడ్డి. ఇందులో మ‌రోసారి ఆయ‌న క‌థని విడిచిపెట్టి కామెడీ సాము చేశారు. అయితే ఆ కామెడీలోనూ ప‌స లేక‌పోవ‌డం, ద్వంద్వార్థాలతో కూడిన అసభ్యకర‌మైన సంభాష‌ణ‌ల మోతాదు ఎక్కువవ‌డం, క‌థనం ప‌రంగా కూడా ఏమాత్రం ఆస‌క్తి, ఉత్కంఠ రేకెత్తించ‌లేక‌పోవ‌డంతో సినిమా అతి సాధార‌ణంగా సాగిపోతుంది. తెనాలి రామ‌కృష్ణ అనే పేరు హీరోకి పెట్టారే కానీ.. ఆ పాత్రలో ఏమాత్రం తెలివి తేట‌లు కానీ, చ‌మ‌క్కులు కానీ క‌నిపించ‌వు. సివిల్ కేసులతో కోర్టుల చుట్టూ తిరిగే పార్టీల మ‌ధ్య రాజీ కుదిర్చే నేప‌థ్యం ఆస‌క్తిక‌ర‌మే. కానీ దాన్నుంచి ఆశించిన స్థాయిలో వినోదాన్ని రాబట్టలేక‌పోయారు ద‌ర్శకుడు. అక్కడ కూడా స్పూఫ్‌ల్ని న‌మ్ముకొని రొటీన్ కామెడీ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. సందీప్‌కిష‌న్‌, ర‌ఘుబాబుల మ‌ధ్య తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్‌ని చూపించాల‌ని ప్రయ‌త్నించినా.. అది కూడా పండ‌లేదు. దాంతో ప్రథ‌మార్ధం అంతా చప్పగా సాగుతుంది. విరామ స‌మ‌యంలో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర ప్రవేశంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ డ్రామా, మ‌లుపులు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెనాలి రామ‌కృష్ణ వ‌ర‌ల‌క్ష్మి కేసును గెలిచిన తీరు మెప్పిస్తుంది. కోర్టులో పండిన హాస్యం కూడా న‌వ్విస్తుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే మ‌లుపు నుంచి క‌థ‌లో డ్రామాని పండించాల్సి ఉండ‌గా, ఆ ప్రయ‌త్నం చేయ‌లేక‌పోయారు. దాంతో సినిమా మ‌ళ్లీ సాధార‌ణంగా మారిపోతుంది. చ‌మ్మక్ చంద్ర ఆడ‌వేషంతో చేసే హంగామా, సంభాష‌ణ‌లు అసభ్యకరంగా అనిపిస్తాయి. ప‌లు పేర‌డీలు చేసినా... హాస్యం మాత్రం పండించ‌లేక‌పోయారు ద‌ర్శకుడు. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఏమాత్రం మెప్పించ‌వు. ఇద్దరు శత్రువులు ఒక్కటై క‌థానాయ‌కుడిని అంతం చేయాల‌నుకున్నప్పుడు ఆ డ్రామా మ‌రింత శ‌క్తిమంతంగా సాగాలి. కానీ ఏమాత్రం పోరాటం లేకుండా ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడు వ‌చ్చి సాక్ష్యాల్ని ఎత్తుకెళ్లి కోర్టుకిస్తారు. త‌ర‌చూ కొత్త పాత్రలు తెర‌పైకొస్తుంటాయి కానీ ఆ ప్రభావం సినిమాపై పెద్దగా క‌నిపించ‌దు.

ఎవరెలా చేశారంటే: సందీప్‌కిష‌న్‌తో కామెడీ చేయించ‌డం కంటే కూడా, ఆయ‌న్నొక మాస్ క‌థానాయ‌కుడిగా చూపించాల‌నే ప్రయత్నమే ఎక్కువ‌గా క‌నిపించింది. ఆయ‌న పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు. హ‌న్సిక పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాట‌ల్లో మాత్రం అందంగా క‌నిపించింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. కానీ ఆమె పోషించిన విల‌న్ పాత్రని మ‌రింత శ‌క్తిమంతంగా తీర్చిదిద్దడంలో ద‌ర్శకుడు విఫ‌ల‌మ‌య్యారు. ప్రభాస్ శ్రీను, సప్తగిరి, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, వై.విజ‌య, ర‌ఘుబాబు, స‌త్యకృష్ణ‌, అనంత్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించి న‌వ్వించారు. సాంకేతిక విభాగం ప‌ర్వాలేద‌నిపించింది. సాయి కార్తీక్ సంగీతం, సాయి శ్రీరామ్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నివాస్‌, భ‌వానీ ప్రసాద్ సంభాష‌ణ‌లు అక్కడక్కడా మెప్పించినా ద్వంద్వార్థాలు ఎక్కువ‌గా వినిపిస్తాయి. ద‌ర్శకుడు నాగేశ్వర‌రెడ్డి అనుభ‌వం ప్రభావం సినిమాపై ఎక్కడా క‌నిపించ‌దు. క‌థ‌, క‌థ‌నం ప‌రంగా ఆయ‌న, ఆయ‌న బృందం చేసిన క‌స‌ర‌త్తులు ఏమాత్రం చాలలేదు.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ కొన్ని హాస్య స‌న్నివేశాలు - క‌థ, క‌థ‌నం
+ ద్వితీయార్ధంలో మ‌లుపు - ఆశించిన స్థాయిలో వినోదం లేక‌పోవ‌డం
  - ద్వంద్వార్థాల‌తో కూడిన సంభాష‌ణ‌లు

చివ‌రిగా.. తెనాలి రామ‌కృష్ణ బిఎ, బిఎల్‌... ఇత‌నిదో సెక్షన్‌
గమనిక: ఇది కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే.

 

 Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.