
హైదరాబాద్: ఎందరో హీరోయిన్స్ సరసన నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో ‘మన్మథుడి’గా పేరుపొందిన నటుడు అక్కినేని నాగార్జున. ఆయన నటించబోయే కొత్త చిత్రంతో ఓ నూతన కథానాయిక వెండితెరకు పరిచయమవతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. ‘మన్మథుడు2’ చిత్రం తర్వాత నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్లో నటించాల్సి ఉంది. ‘బంగార్రాజు’ పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమా పలు కారణాల వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ‘బంగార్రాజు’ సినిమా ప్రారంభంకావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో నాగార్జున మరో సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే సాల్మన్ అనే నూతన దర్శకుడితో నాగార్జున ఓ సినిమా చేస్తున్నాడంటూ ప్రచారం సాగింది. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని, అయితే ఈ సినిమాలో కథానాయిక పాత్ర విభిన్నంగా ఉంటుందని, ఇందుకు ప్రేక్షకులకు పరిచయం లేని నటి అయితేనే బావుంటుందనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారట. అందుకే ఈ సినిమాతో ఓ నూతన కథానాయికను వెండితెరకు పరిచయం చేయనున్నారట. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఎంటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.