
హైదరాబాద్: వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరించే యువ కథానాయకుడు నాని. ఒక సినిమా పూర్తవుతుందనగానే, మరో సినిమాకు పచ్చ జెండా ఊపేస్తారు. ఇప్పటికే ఈ ఏడాది ‘గ్యాంగ్‌లీడర్’తో బాక్సాఫీస్ వద్ద అలరించిన ఆయన ప్రస్తుతం ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణలో ఉండగానే తన కొత్త సినిమాను ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘టక్ జగదీష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు.
నాని వెనక్కి తిరిగి టక్ సరి చేసుకుంటున్న స్టిల్ అభిమానులను అలరిస్తోంది. ‘షైన్ స్క్రీన్స్’ పతాకంపై హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఫీల్‌గుడ్ ఫిలింగా అలరించిన సంగతి తెలిసిందే.