close
ఇంటర్వ్యూ

హాస్య చతురత ఉంటే చాలండీ

వారానికి రెండు మూడు సినిమాలు వస్తుంటే.. 
నెల రోజులకు ఓ స్టార్‌ సందడి చేస్తుంటే.. 
మూడు నెలలకోసారి బ్లాక్‌ బస్టర్‌ మాట వింటుంటే.. 
మధ్య మధ్యలో ‘వంద కోట్లు’ అనే అంకెలు కనిపిస్తుంటే.. 
ఆహా.. సినీ అభిమానికి అంతకంటే ఏం కావాలి? 2018 క్యాలెండర్‌లో ఇలాంటివే కనిపించాయి. స్టార్లు బాక్సాఫీసు ముంగిట తలపడ్డారు. కుర్రాళ్లు ‘సై’ అన్నారు. చిన్న సినిమాలు ఆశ్చర్యపరిచాయి. ప్రయోగాలకు పదును పెరిగింది. కొత్త తరహా కథలు క్యూ కట్టాయి. వాటితో పాటు కొన్ని షాకులూ గట్టిగా తగిలాయి. మొత్తానికి 2018లో తెలుగు సినిమా కొంచెం తీపి.. ఇంకొంచెం కారం పంచింది. కమ్మని వినోదాలు వడ్డించింది. 12 నెలల్లో పదహారణాల నిండైన అనుభూతులు పంచింది. ఆ క్యాలెండర్‌ని ఒక్కసారి తిరగేస్తే.. 
 ఏడాది 228 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో 170 తెలుగు చిత్రాలు, 58 తమిళ అనువాదాలూ ఉన్నాయి. విజయాలు 10 శాతానికి లోపే ఉన్నాయి. కాకపోతే కథల్లో వైవిధ్యం కనిపించింది. అగ్ర కథానాయకులు తమ ఇమేజ్‌ని పక్కన పెట్టి కొత్త తరహా ప్రయత్నాలకు ఉత్సాహం చూపించారు. అందుకే ‘రంగస్థలం’ లాంటి వినూత్న కథల్ని తెరపై చూసే అవకాశం దక్కింది. యువ కథా నాయకుల సత్తా ఏపాటిదో ఈసారి మరింత బలంగా తెలిసొచ్చింది. కథలో విషయం ఉంటే యువ హీరోలు రూ.వంద కోట్ల మైలు రాయిని అందుకోగలరని ‘గీత గోవిందం’ లాంటి చిత్రాలు నిరూపించాయి. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడానికి కొత్తవాళ్లు మరింత ఉత్సాహం చూపించడంతో చిన్న చిత్రాలు విరివిగా వచ్చాయి.

జనవరి

‘శుభారంభం సగం విజయం’ అంటారు. తెలుగు సినిమా క్యాలెండర్‌ ‘సంక్రాంతి’తో మొదలవుతుంది. పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’, నందమూరి బాలకృష్ణ ‘జై సింహా’తో పాటు రాజ్‌తరుణ్‌ ‘రంగుల రాట్నం’ సంక్రాంతి బరిలో నిలిచాయి. ‘అజ్ఞాతవాసి’కి మంచి ఓపెనింగ్స్‌ వచ్చినా నిలబడలేక పోయింది. పవన్‌ చరిష్మా ఈ సినిమాని గట్టెక్కించలేదు. ‘జై సింహా’కి మంచి మార్కులు పడ్డాయి. ‘రంగుల రాట్నం’ తిరగలేదు. 26న వచ్చిన ‘భాగమతి’ మెప్పించింది. ఈ నెలలో 8 చిత్రాలు విడుదలైతే రెండే రాణించాయి.

ఫిబ్రవరి

రెండో నెలలో జోరు బాగా పెరిగింది. ఫిబ్రవరిలో 16 చిత్రాలు విడుదలయ్యాయి. ప్రతివారం రెండు మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. అయితే ‘ఛలో’, ‘తొలిప్రేమ’ మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. రెండూ ప్రేమకథలే. కొత్త దర్శకులు చేసిన తొలి ప్రయత్నాలే. రవితేజ ‘టచ్‌ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’  నిరాశ పరిచాయి. చాలా కాలం తరవాత సినిమా చేసిన తరుణ్‌ (ఇదీ నా లవ్‌ స్టోరీ)కి కూడా అదృష్టం కలసి రాలేదు. శ్రీకాంత్‌ తొలిసారి చేసిన హారర్‌ చిత్రం ‘రా..రా’ నిరాదరణకు గురైంది. 
 

మార్చి

సాధారణంగా ఫిబ్రవరి - మార్చి నెలల్లో కొత్త సినిమాల హడావుడి తగ్గుతుంది. పరీక్షల సీజన్‌ కాబట్టి నిర్మాతలు
సినిమాలు విడుదల చేయడానికి అంత సాహసం చేయరు. కానీ ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. ఈ నెలలో 13 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో అగ్ర కథానాయకులవీ ఉన్నాయి. 30న విడుదలై రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ బాక్సాఫీసు దగ్గర సంచలనాలు నమోదు చేసింది. చరణ్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. కల్యాణ్‌ రామ్‌ ‘ఎం.ఎల్‌.ఏ’గా ఆకట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలూ మినహాయిస్తే మిగిలినవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లాయి. నిఖిల్‌ ‘కిరాక్‌ పార్టీ’, విజయ్‌ దేవరకొండ ‘ఏం మంత్రం వేశావె’ నిరాశ పరిచాయి. శ్రీవిష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ విమర్శకుల్ని మెప్పించింది. 

ఏప్రిల్‌

ప్రిల్‌ - మేలలో వేసవి సెలవల సీజన్‌. కాబట్టి యువతరాన్ని థియేటర్లకు రప్పించడానికి సరైన సమయం. ఏప్రిల్‌లో 11 చిత్రాలు వచ్చాయి. విడుదలకు ముందు ఆశలు పెంచిన ‘ఛల్‌ మోహనరంగ’, ‘కృష్ణార్జున యుద్ధం’ బాక్సాఫీసు ముందు తేలిపోయాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’ నవ్వులు పండించలేదు. ‘కణం’ వైవిధ్య భరితమైన ప్రయత్నంగా కనిపించినా ఆదరణకు నోచుకోలేదు. ‘ఏప్రిల్‌లో ఓ మంచి సినిమా లేద’న్న లోటుని మహేష్‌బాబు తీర్చేశాడు. ‘భరత్‌ అనే నేను’ అంటూ మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిన తీరు అభిమానులకు తెగ నచ్చేసింది. దాంతో మహేష్‌ మరోసారి వంద కోట్ల వైపు పరుగులు పెట్టాడు. మహేష్‌  కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిందీ చిత్రం.

మే

మేలోనూ పెద్ద చిత్రాల హవా కనిపించింది. అంతకు ముందు విడుదలైన ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ ఇంకా థియేటర్లలో ఉండడంతో.. కొత్త సినిమాలకు మరీ ముఖ్యంగా చిన్న చిత్రాలకు అంతగా చోటు దక్కలేదు. అల్లు అర్జున్‌ నటించిన ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ మేలోనే వచ్చింది. కానీ అంచనాల మేరకు రాణించలేదు. రవితేజకు ఈ ఏడాది మరో పరాజయం ‘నేల టికెట్టు’ రూపంలో ఎదురైంది. పూరి తన తనయుడి కోసం చేసిన ప్రయత్నం ‘మెహబూబా’ కూడా ఆకట్టుకోలేదు. ఇన్ని పరాజయాల మధ్య ‘మహానటి’ మెరిసింది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి వసూళ్లే కాదు, విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ‘మహానటి’ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని బయోపిక్‌లు పట్టాలెక్కాయి.

జూన్‌

రో నెలలో కొత్త చిత్రాల జోరు మరింత ఎక్కువైంది. దాదాపు 15 చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకుల తీర్పు కోరుతూ వచ్చాయి. వారానికి రెండు లేదా మూడు చిత్రాలు విడుదల కావడం ఆనవాయితీగా కనిపించింది. నాగార్జున - రాంగోపాల్‌ వర్మ ‘ఆఫీసర్‌’ ఈనెలలోనే విడుదలైంది. వర్మ వరుస పరాజయాలతో ఉన్నా, ఈ సినిమాపై ఎందుకనో అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకోవడంలో ‘ఆఫీసర్‌’ పూర్తిగా విఫలమయ్యాడు. రాజ్‌తరుణ్‌ ‘రాజుగాడు’, కల్యాణ్‌రామ్‌ ‘నా నువ్వే’, శ్రీనివాసరెడ్డి ‘జంబలకిడి పంబ’ నిరాశ పరిచాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’ మెప్పించింది. 

జులై

కీలకమైన వేసవి సీజన్‌ ఈసారి జులై మాసంలోనూ కొనసాగింది. 18 తెలుగు సినిమాలు విడుదల కాగా, వాటిలో ‘ఆర్‌.ఎక్స్‌.100’ ఘన విజయం అందుకుంది. కొత్త దర్శకుడు అజయ్‌ భూపతి కథ చెప్పిన విధానం ఆకట్టుకుంది. గోపీచంద్‌ ‘పంతం’, సాయిధరమ్‌ తేజ్‌ ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’,  బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘సాక్ష్యం’, రాజ్‌ తరుణ్‌ ‘లవర్‌’ మెప్పించలేకపోయాయి. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా పరిచయమైన ‘విజేత’ ఈ నెలలోనే విడుదలైంది. లక్ష్మీప్రసన్న ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’, సుమంత్‌ అశ్విన్‌, నిహారికల ‘హ్యాపీ వెడ్డింగ్‌’, చంద్రసిద్ధార్థ్‌ ‘ఆటగదరా శివ’ మంచి కథలు అనిపించుకొన్నా ఆకట్టుకోలేదు. అనువాద చిత్రం కార్తీ ‘చినబాబు’ కథ పరంగా కొత్తదనాన్ని పంచినా వసూళ్లు దక్కలేదు. 

ఆగస్టు

సినిమాలకి సీజన్‌తో పనిలేదని చాటుతూ  ఆగస్టులో 23 చిత్రాలు బాక్సాఫీసు ముందుకొచ్చాయి. మంచి సినిమాలు ఎన్నొచ్చినా ప్రేక్షకులు చూస్తారనే మాటని మరోసారి నిజం చేసింది ఆగస్టు. అడవి శేష్‌ ‘గూఢచారి’, సుశాంత్‌ ‘చి.ల.సౌ’ చిత్రాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ‘గీత గోవిందం’ కూడా ఈ నెలలోనే విడుదలైంది. నితిన్‌ ‘శ్రీనివాసకళ్యాణం’, నారా రోహిత్‌, జగపతిబాబుల ‘ఆటగాళ్లు’, ఆది, తాప్సిల ‘నీవెవరో’, నాగశౌర్య ‘నర్తనశాల’ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ‘పేపర్‌బాయ్‌’, ‘అంతకుమించి’ ప్రచారచిత్రాలతో ఆసక్తి రేకెత్తించినా పరాజయాల్నే చవిచూడాల్సి వచ్చింది. కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం 2’ కూడా బాక్సాఫీసుపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

సెప్టెంబరు 

ల్లరి నరేష్‌ - సునీల్‌ ‘సిల్లీ ఫెలోస్‌’, నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్‌’, సుధీర్‌బాబు ‘నన్ను దోచుకుందువటే’, నాగార్జున - నానిల ‘దేవదాస్‌’లతో కలుపుకొని 23 సినిమాలు విడుదలయ్యాయి. ‘నన్ను దోచుకుందువటే’, ‘దేవదాస్‌’ చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. ‘యు టర్న్‌’ ఫర్వాలేదనిపించింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఆ చిత్రం వసూళ్లని రాబట్టింది. మిగిలిన సినిమాలకి పరాజయం తప్పలేదు. ‘మను’, ‘నాటకం’ తదితర సినిమాల ప్రచార చిత్రాలు ఆకట్టుకొన్నా థియేటర్లలో మెప్పించలేదు. అనువాద చిత్రాల్లో మణిరత్నం ‘నవాబ్‌’ ఆకట్టు కున్నా, విక్రమ్‌ ‘సామి-2’ పరాజయాన్నిచవిచూసింది. 

అక్టోబరు 

సరా పండగని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ చిత్రం ‘అరవింద సమేత’ విడుదలై విజయాన్ని సొంతం చేసుకొంది. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ తొలి కలయికగా రూపొందిన ఇది ప్రేక్షకుల్ని  అలరించింది. రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘హలో గురూ ప్రేమకోసమే’తో పాటు, విశాల్‌ ‘పందెంకోడి2’  కూడా పండగ సందర్భంగానే విడుదలయ్యాయి. ‘హలో గురు ప్రేమ కోసమే’ ఫర్వాలేదనిపించినా, ‘పందెంకోడి2’ మాత్రం మేజిక్‌ని పునరావృతం చేయలేకపోయింది. జోరు మీదున్న విజయ్‌ దేవరకొండ ‘నోటా’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైనా, ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించలేకపోయింది. నారా రోహిత్‌, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రియ నటించిన ‘వీరభోగ వసంతరాయలు’ కూడా పరాజయాన్ని చవిచూసింది. 

నవంబరు 

నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘సవ్యసాచి’తో ఈ నెలని మొదలుపెట్టింది తెలుగు చిత్రసీమ. రజనీకాంత్‌ ‘2.ఓ’, విజయ్‌ దేవరకొండ ‘టాక్సీవాలా’లు ప్రేక్షకుల్ని మెప్పించాయి. నాగచైతన్య ‘సవ్యసాచి’, రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాలపై మంచి అంచనాలు నెలకొన్నప్పటికీ నిరాశపరిచాయి. సుదీర్ఘకాలం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొన్న ‘అదుగో’తోపాటు, ‘24 కిస్సెస్‌’ కూడా పరాజయాన్ని చవిచూశాయి.

డిసెంబరు 

కొత్త ఏడాదిలో సంక్రాంతి సినిమాల సందడి ఉంటుంది కాబట్టి, చిత్రీకరణ పూర్తయిన చిత్రాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఒక్కో వారం మూడు నాలుగు చొప్పున 24 చిత్రాలు ఈ ఒక్క నెలలోనే అదృష్టాన్ని పరీక్షించుకొన్నాయి.  ‘ఆపరేషన్‌ 2019’, ‘సుబ్రమణ్యపురం’, ‘కవచం’, ‘పడి పడి లేచె మనసు’, ‘అంతరిక్షం’, ‘కె.జి.ఎఫ్‌’, ‘ఇదం జగత్‌’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘హుషారు’, ‘నెక్ట్స్‌ ఏంటి?’ తదితర చిత్రాలు ఈ నెలలో విడుదలైనవే. వీటిలో ‘కె.జి.ఎఫ్‌’, ‘హుషారు’ చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. సుమంత్‌ కథానాయకుడిగా నటించిన ‘సుబ్రమణ్యపురం’ పర్వాలేదనిపించినా... ‘ఓడియన్‌’, ‘మారి2’ తదితర అనువాద చిత్రాలకి విజయాలు దక్కలేదు.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.