close
ఇంటర్వ్యూ


కర్త.. కర్మ.. క్రియ రామ్‌చరణే: బోయపాటి 

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్‌, యాక్షన్‌ చిత్రాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మనకు గుర్తొచ్చే అతి కొద్ది మంది దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన సినిమాల్లో కథానాయకుడు ధీరోదాత్తుడై ఉంటాడు. అందుకే ఆయన సినిమాలన్నీ కమర్షియల్‌ హిట్స్‌. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. కియారా అడ్వాణీ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బోయపాటి విలేకరులతో మాట్లాడారు..

కుటుంబానికి వినయ విధేయ రాముడు!
‘‘మా ‘వినయ విధేయ రామ’లో కథానాయకుడు తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. అన్నావదినలు, ప్రేమికురాలు.. ఇలా ఎవరైనా సరే తన వాళ్లు అనుకుంటే... దాన్ని సాధించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఏమైనా చేస్తాడు.’’

అదే నా ఫార్ములా!
‘‘నా ప్రతి కథకీ కుటుంబమే పునాది. సమాజం, అందులోని అంశాలు కనిపిస్తాయి. ‘వినయ విధేయ రామ’ కూడా కుటుంబ కథే. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ చరణ్‌ అన్నయ్యలుగా కనిపిస్తారు. వదిన పాత్రలూ బాగా వచ్చాయి. వాటిలో స్నేహ, హిమజ, ప్రవీణ నటించారు. సామాజిక స్పృహతో ఉన్న పాత్రని నటి హేమ పోషించింది. ప్రతినాయకుడుగా వివేక్‌ ఓబెరాయ్‌ని అనుకున్నాం. కానీ ఆయన అలాంటి పాత్రలు చేయడంలేదు. అయినా సరే.. ఓసారి కలిసి కథ వినిపించాను. బాగా నచ్చి.. వెంటనే కాల్షీట్లు సర్దుబాటు చేశారు.’’

కర్త.. కర్మ.. క్రియ అన్నీ చరణే!
‘‘యాక్షన్‌ దృశ్యాలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అజర్‌బైజాన్‌లోని తెరకెక్కించిన పోరాట ఘట్టం అభిమానుల్ని మైమరిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్‌తో నేను చేసిన ఐదు చిత్రాలు హిట్లే. ఈ సినిమాలోనూ మంచి సంగీతం అందించాడు. సంభాషణలు ఆకట్టుకుంటాయి. రామ్‌ చరణ్‌ పాత్రకు తగినట్టు తన దేహధారుడ్యాన్ని మార్చుకున్నారు. తెరపై చరణ్‌ ఐరన్‌మాన్‌లా కనిపిస్తారు. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ రామ్‌ చరణ్‌.’’

ఈ సినిమాకూ చిరు సూచనలు!
‘‘ప్రతి కథనీ సెట్‌కి వెళ్లే ముందు చిరంజీవి గారికి వినిపిస్తాను. ఆయన విలువైన సలహాలిస్తారు. ‘సరైనోడు’ కథ విన్నాక కొన్ని సూచనలు చేశారు. ‘వినయ విధేయ రామ’ కథ ఆయనకు చెప్పాను. ప్రతీ సన్నివేశం జాగ్రత్తగా విన్నారు. అంతా అయిపోయాక ‘బాగా సిద్ధం చేశావు. మార్పులు చెప్పేందుకు అవకాశమే లేదు’ అని మెచ్చుకున్నారు. కొన్ని కథల గురించి చిరంజీవిగారితో మాట్లాడుతున్నాను. ఇప్పుడాయన ‘సైరా’ పనిలో నిమగ్నమయ్యారు. ఆయన స్థాయిలో సరైన కథ పక్కాగా ఖరారైన తర్వాతే అది పట్టాలెక్కుతుంది.’’

అందుకే చిన్న సినిమాల జోలికి వెళ్లను!
‘‘నేను ఏ సినిమా చేసినా, ఎవరితో చేసినా ప్రేక్షకులు ఆ సినిమాని వాళ్ల గుండెల్లో పెట్టుకుంటున్నారు. చిన్న సినిమాలు చేసినా అవీ ఇలాగే ఉండాలి. హంగూ, ఆర్భాటాలూ లేకుండా చిన్న సినిమాలు తీసి ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడం సాధ్యమా? అని నేను ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే వస్తోంది.. అందువల్లే చిన్న సినిమాలు చేయను. నా వల్లకాదు. బయోపిక్‌ సినిమాలు చేయాలని నాకూ ఉంది. ఒక దమ్మున్న కథలైతేనే బయోపిక్స్‌ చేయాలి. అవి దొరికినప్పుడే చేస్తా. అన్ని జోనర్లూ చేసేందుకు అన్నీ కుదరాలి.

 

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.