close
ఇంటర్వ్యూ
శివాత్మికలో నిజంగానే ‘దొరసాని’ ఉంది

నాకు ఐదేళ్ల వయసులో పుట్టిన ఊహే ఈ సినిమా: కేవీఆర్‌ మహేంద్ర

హైదరాబాద్‌: ‘దొరసాని’ సినిమాతో పరిచయం అవుతున్నారు దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర. రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక, విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ ఈ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మహేంద్ర పాల్గొన్నారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ గురించి చెప్పండి?
మహేంద్ర: మాది వరంగల్‌లోని జయగిరి ప్రాంతం. అక్కడ పుట్టి పెరిగి.. ఈరోజు ఓ దర్శకుడిగా మీ ముందు కూర్చున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ వద్ద సంబరాలు జరుగుతున్నాయి. దీనంతటికి కారణం ఎవరు?తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. ఇలాంటి కాన్సెప్ట్‌పై ఓ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలో నేను ‘నిశీధి’ అనే షార్ట్‌ ఫిలిం తీశాను. అది అంతర్జాతీయ స్థాయిలో తీశాం. 18 దేశాల నుంచి 39 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్‌ కూడా మెచ్చుకున్నారు. ‘నిశీధి’ లఘుచిత్రం తర్వాత మరో మంచి కథను రాయగలను అన్న నమ్మకం కలిగింది. అప్పటికే నేను రకరకాల సినిమాలకు పనిచేశాను. కానీ ‘నిశీధి’ తర్వాత నా వృత్తిని మరింత సీరియస్‌గా తీసుకోవాలని అనుకున్నాను. 
‘దొరసాని’ కథ ఎలా పుట్టింది?
మహేంద్ర: నా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లి వస్తుంటే పెద్ద గోడతో ఉన్న గడీ ఉండేది. ఇలాంటి గడీల్లో దొరసానులే ఉంటారు అని ఊహించుకునేవాడిని. నాకు ఐదేళ్లున్నప్పుడు కలిగిన ఆ ఊహే ఇప్పుడు సినిమా తీయడానికి ఉపయోగపడింది. ఆ ఊహ నుంచి పుట్టిందే ‘దొరసాని’. 1987లో జరిగిన కథ ఇది. కానీ నాకు ఊహ కలిగినప్పటికి నా వయసు ఐదేళ్లు. అప్పట్లో ప్రపంచం ఎలా ఉండేదో తెలీదు. అందుకోసం ఎనిమిది నెలల పాటు పుస్తకాలు చదివి అప్పట్లో ప్రపంచం ఎలా ఉండేదో తెలుసుకున్నాను. అలా ‘దొరసాని’ కథ రాయడానికి మూడేళ్లు పట్టింది. 42 వెర్షన్లు రాశాను. ఆ తర్వాత వెంకట్‌ అనే వ్యక్తి ద్వారా ఈ కథను సురేశ్‌బాబుకు చెప్పే అవకాశం వచ్చింది. ఆయనకు ఐదు గంటల పాటు కథను చెబితే అసలు ఏమీ మాట్లాడకుండా అలా చూస్తుండిపోయారు. నిజంగానే జరిగిందేమో అన్నట్లుగా సినిమాను ఎలా తీస్తావంటూ రెండు గంటల పాటు చర్చించారు.

సినిమాలో శివాత్మికనే ఎందుకు ఎంపికచేసుకోవాలనుకున్నారు?
మహేంద్ర: నేను ఊహించిన దొరసాని చూడటానికి ఎత్తుగా గంభీరంగా ఉంటుంది. తక్కువగా మాట్లాడుతుంటుంది. కళ్లతోనే హావభావాలు పలికిస్తుంటుంది. ఇవన్నీ శివాత్మికలో ఉన్నాయి. ఈ కథకు శివాత్మికే కరెక్ట్‌ అనిపించింది. నేను కథ చెప్పడానికి రాజశేఖర్‌ ఇంటికి వెళ్లినప్పుడు శివాత్మిక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. ఆ సమయంలో శివాత్మిక తలుపు తీసి బయటికి వస్తున్నారు. ఆమెను చూడగానే ఈమే దొరసాని అని ఫిక్సయిపోయా. శివాత్మిక లేకపోతే దొరసాని ఎలా ఉండేదో ఊహించలేను.
‘చంటి’లో మీన పాత్ర కూడా దొరసానిలా ఉంటుంది. ఆ కథకు, ఈ కథకు వ్యాత్యాసం ఉంటుందా?
మహేంద్ర: ‘చంటి’కి ‘దొరసాని’కి ఎలాంటి సంబంధం లేదు. పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయి అన్న కాన్సెప్ట్‌ ప్రతి సినిమాలో ఉండేదే. ‘దొరసాని’లోనూ ఈ కాన్సెప్ట్‌ ఉంది కానీ ఎన్నో కొత్త పాయింట్లు ఉన్నాయి. అవి మీకు సినిమా చూస్తే కానీ అర్థంకాదు.
ఆనంద్‌ పాత్ర ఎలా ఉంటుంది?
మహేంద్ర: సినిమాలో ఆనంద్‌ పాత్ర పేరు రాజు. పేద దంపతులు కుమారుడు. ఊళ్లో కాస్త చదువుకున్న వ్యక్తి అతనొక్కడే. ప్రపంచం అంటే ఏంటో తెలీని 20 ఏళ్ల ఆ యువకుడు దొరసానితో ప్రేమలో పడతాడు. మరో అమ్మాయిని ప్రేమించుంటే ఏమీ జరిగేది కాదు. కానీ దొరసానిని ప్రేమించడంతో అతని జీవితంలో చాలా జరుగుతాయి. అదే కథ.

సినిమాలో లిప్‌ కిస్‌ సన్నివేశం కూడా వాడినట్లున్నారు?
మహేంద్ర: అవును. ఓ దర్శకుడిగా చెప్పాలంటే.. దానిని లిప్‌ కిస్‌ అనరు. ఇద్దరు ప్రేమికులు స్వచ్ఛమైన ప్రేమలోపడితే ఒక విషయాన్ని ఒకరికొకరు ఎక్స్‌ప్రెస్‌ చేయాలనుకున్నప్పుడు వారు ఎంచుకున్న మార్గం ఆ ముద్దు అంటే బాగుంటుంది.
40 వెర్షన్లు రాశాను అన్నారు. ఈ వెర్షన్‌ మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటి?
మహేంద్ర: కథ రాస్తున్నప్పుడు మెరుగవుతూ వస్తోంది. దాంతో మార్చుకుని మరో వెర్షన్‌ రాయాల్సి వచ్చేది. 40వ వెర్షన్‌కు వచ్చేటప్పటికి అదే ఫైనలైజ్‌ చేయాలనిపించింది.
తర్వాతి సినిమా మీతోనేనని రాజశేఖర్‌ అన్నారు? మరి మీ తర్వాతి సినిమా ఆయనేతోనే అనుకోవచ్చా?
మహేంద్ర: నా తర్వాతి సినిమా తప్పకుండా మీతోనేనని రాజశేఖర్‌ నాతో చాలాసార్లు అన్నారు. ఆయన అలా అంటుంటారు. కానీ అది ఎప్పుడు అవుతుంది అన్నది తెలీదు.
ఆనంద్‌ దేవరకొండను ఎలా ఎంచుకున్నారు?
మహేంద్ర: నేను కథ సిద్ధం చేసుకున్నాక అభిప్రాయాల కోసం మరొకరి నా ఐడియాస్‌ను పంచుకుంటూ ఉంటాను. ఈ నేపథ్యంలో నేను ‘దొరసాని’ కథను తరుణ్‌ భాస్కర్‌తో చెప్పాను. ఆయన కథ వినగానే.. విజయ్‌, ఆనంద్‌ల తండ్రి వర్ధన్‌ దేవరకొండతో చెప్పారు. ‘నేను అద్భుతమైన కథను విన్నాను. రెండు రోజుల నుంచి అది నన్ను వెంటాడుతోంది. నాకు కథలో రాజు పాత్రలో ఆనంద్‌ గుర్తొచ్చాడు’ అని వర్ధన్‌తో చెప్పారు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్‌ అమెరికా నుంచి భారత్‌ వచ్చారు. అలా ఆనంద్‌తో నేను కథ గురించి చర్చించాను. ఇది కాకతాళీయంగా జరిగిపోయింది.
సినిమా మంచి ఫలితాన్నిస్తుందంటారా?
మహేంద్ర: రెగ్యులర్‌ సినిమాలను మించి ఈ కథ ఉంటుంది. అందమైన లవ్‌స్టోరీ. ఎక్కడా కలుషితం కాకుండా సినిమాను తీశాను. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.