close
ఇంటర్వ్యూ
అప్పట్నుంచే సినిమాలంటే మహా పిచ్చి

విక్రమ్‌ నటిస్తున్నాడు... అని ఎవ్వరూ అనరు... ఎందుకంటే అతను ప్రతి పాత్రలోనూ జీవిస్తాడంతే! ‘సేతు’లో పిచ్చివాడైనా... ‘శివపుత్రుడు’లో అమాయకుడైనా... ‘అపరిచితుడు’లా అదరగొట్టినా... అది విక్రమ్‌కే సాధ్యం. చిత్రాలతోనే కాదు.. శరీరంపైనా చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసి.. సినిమా, సినిమాకు దేహాకృతిని మార్చుకోగల సామర్థ్యం అతని సొంతం. అతనికి హీరో అయ్యేంత కొడుకున్నాడంటే చాలామంది నమ్మరు. అలా తన కొడుకే తనకు పోటీ అయ్యాడని చెప్పే విక్రమ్‌ ‘హాయ్‌’తో చాలా విషయాలు పంచుకున్నాడు. కుమారుడు ధృవ్‌ నటిస్తున్న ‘ఆదిత్య వర్మ’(అర్జున్‌రెడ్డి రీమేక్‌), తన ‘మిస్టర్‌ కేకే’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో... తన సినీ, జీవిత ప్రయాణంలోని కొన్ని సన్నివేశాలను వివరించాడు.

నా పేరు కెనెడీ

అమ్మా, నాన్న నాకు పెట్టిన పేరు కెనెడీ. ఇది నాకు నచ్చేది కాదు. తర్వాత పేరు మార్చుకోవాలని అనుకున్నా. నాన్న పేరులోంచి వీఐ, నా పేరులోని కే, అమ్మ పేరులో ఆర్‌ఏ... ఇలా అన్ని కలిపి విక్రమ్‌గా మార్చుకున్నా.

ఆమెకు నచ్చిన పాత్రలు

కాలేజీ రోజుల్లో నేను వేసే నాటకాలకు శైలజ అభిమాని. తర్వాత తనే భార్య శైలజగా మారింది. ఆమెకు ‘అపరిచితుడు’, ‘శివపుత్రుడు’.. సినిమాలంటే ఇష్టం. మణిరత్నం దర్శకత్వంలోని ‘విలన్‌’ చిత్రంలో ‘రావణ’ పాత్ర అంటే బాగా ఇష్టం.

* ఇప్పుడు ప్రతి సినిమాకు ప్రయోగాలు చేస్తున్నారు. మరి చిన్నతనంలో...?
వైవిధ్యంగా, భిన్నంగా, మరింత సహజంగా నటించాలన్న తపన ఇప్పటిది కాదు, చిన్నతనంలోనే చిగురించింది. అప్పట్లోనే నాటకాలంటే ఇష్టం. వాటిలోనే ప్రయోగాలు చేసేవాడిని. నేను మూడో తరగతి చదివేటప్పుడు... స్కూల్‌లో ఓ నాటకం వేశారు. అందులో ఒక బానిస అమ్మాయి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. డైలాగులేం ఉండవు. గుంపులో ఒకరిగా అలా నిల్చోవాలి అంతే! అలా అమ్మాయి వేషం నేను వేసిన మొదటి పాత్ర. అప్పట్నుంచే సినిమాలంటే మహా పిచ్చి. ఆ ఆలోచనలనే ఇప్పుడు ఆచరణలో పెడుతున్నా.

* ఒకానొక సందర్భంలో సినిమాల నుంచి వెళ్లిపోదామనుకున్నారట?
కెరీర్‌ ఆరంభంలో ప్రభుదేవా, అబ్బాస్‌, వినీత్‌లకు డబ్బింగ్‌ చెప్పా. నాకేమో నటనపై ఆసక్తి. ఎంత ప్రయత్నించినా అవకాశాలు వచ్చేవికావు. నేను హీరో అయ్యాకా కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. నా జీవితాన్ని ‘సేతు’కు ముందు.. ‘సేతు’ తర్వాత అని విభజించవచ్చు. పదేళ్లకుపైగా విజయం కోసం వేచిచూశా. ‘సేతు’లో నటించేటప్పుడు ఇదే నా చివరి సినిమా అని అనుకున్నా. ఇందులో గుండు గీయించుకుని నటిస్తున్నప్పుడు ‘నా జీవితం మారనుంది’ అని బలంగా విశ్వసించా. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటికీ పరుగులు తీస్తున్నా.

* మీ జీవితంలో మరిచిపోలేని వ్యక్తులెవరు?
దర్శకుడు బాలా పేరునే చెబుతా. ఎందుకంటే నన్ను ఓ ఆణిముత్యంలా మార్చిన వ్యక్తి ఆయన. ‘సేతు’ వంటి చిత్రాన్ని ఇచ్చి కెరీర్‌ని నిలబెట్టారు. అదేవిధంగా ‘శివపుత్రుడు’ (పితామగన్‌)తో మరో బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చారు. అందులో నేను మాట్లాడను. నా గురించి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో గొప్పగా మాట్లాడుకునేలా చేసిన వ్యక్తి బాలా. ఇక నన్ను చూసి బాలానే ఆశ్చర్యపోయేలా చేసిన వ్యక్తి దర్శకుడు శంకర్‌. ‘అపరిచితుడు’ చూసి ‘ఇంత యాక్టింగ్‌ స్కోప్‌ ఉందా. రియల్లీ గ్రేట్‌’ అని మెచ్చుకున్నారు. నటుడిగా నాలో మరో కోణాన్ని చూపించిన వ్యక్తి ఆయన. ‘ఐ’లాంటి సినిమాలో నేను నటించానంటే ఇప్పటికీ ఊహించుకోలేకపోతున్నా. ఇక మణిరత్నం నా కలల దర్శకుడు. త్వరలోనే ఆయన దర్శకత్వంలోనూ మళ్లీ నటించనున్నా. వచ్చేనెలలో చిత్రీకరణ మొదలుకానుంది.

* ప్రతి సినిమాకు శరీరాకృతిని మార్చుతున్నారు. ఎలా సాధ్యమవుతోంది?
తొలుత ‘సేతు’ సినిమాకు అలా చేశా. ఆ పాత్రకు సన్నబడాలని.. ఒక చపాతి, ఉడికించిన గుడ్డు, క్యారెట్‌ జ్యూస్‌ తీసుకునేవాడిని. షూటింగ్‌స్పాట్‌కు ఎనిమిది కిలోమీటర్లు నడిచేవాడిని. ఇదంతా కాకుండా రోజూ వ్యాయామం చేస్తా. ఇక ‘ఐ’ సమయంలో అయితే ఒక గుడ్డు, అరటిదూట జ్యూస్‌ తీసుకునేవాడిని. కెలొరీల గురించి పట్టించుకునే వాడిని కాదు. అయితే నా కుటుంబీకులు నన్ను చూసి చాలా భయపడిపోయారు. కొన్ని అనారోగ్య సమస్యలూ వచ్చాయి. సినిమాలో నటించడం కన్నా ఆ పాత్రగా మారాలన్నదే నా తపన. అందుకే అలా మారగలుగుతున్నా.

* మీ అబ్బాయి ధృవ్‌ తెరంగేట్రం ఎంతవరకు వచ్చింది?
‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’లో నటిస్తున్న విషయం మీకు తెలుసు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేయనున్నాం. బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగు నుంచి తమిళానికి కొన్ని మార్పులు చేశాం. ఆ సినిమాను ఆపేశామని అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో.. నటన పరమైన మార్పులు చేసి, తెలుగులో ఉన్నట్టుగానే రూపొందించాం. ఇక.. నేను వైవిధ్యమైన నటనకు ప్రాధాన్యమిచ్చే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా. ధృవ్‌ ఆలోచనలు అలాగే ఉన్నాయి.

* ఇంటా, బయట మీకు పోటీ మొదలైందా?
అవును. నాకు అసలైన పోటీ ఇప్పుడే మొదలైంది. ‘నాన్నా నీ సినిమా ట్రైలర్‌కు ఎన్ని వ్యూస్‌ వచ్చాయి.. 11 మిలియన్లా?.. నా సినిమాకు 12 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి’ అని పోటీపడుతున్నాడు ధృవ్‌. అంతేనా.. ఫొటోగ్రఫీ, జిమ్‌, స్విమ్మింగ్‌తో పాటు పెంపుడు జంతువులకు సమయం కేటాయించడం.. అన్నింట్లో నాకు పోటీనే. జిమ్‌లో అయితే.. ‘సర్‌ ఇప్పుడే ధృవ్‌ వచ్చివెళ్లారు. టు అవర్స్‌ వర్కవుట్‌ చేశారు. కిందకు వెళ్లి షటిల్‌ ఆడారు’.. అంతా మీలాగే ఉన్నారు సార్‌ అంటున్నారు. బహుశా దీన్నే హెల్దీ కాంపిటేషన్‌ అంటారేమో!

అదో పీడకల

నేను కాలేజీ చదివే రోజుల్లో... ఒక రోజు ఫ్రెండ్‌ బైక్‌పై వెళ్తున్నా. ఒక ట్రక్కు మమ్మల్ని ఢీకొంది. అంతే స్పృహ తప్పిపడిపోయా. ఫ్రెండ్‌ పక్కన పడిపోయాడు. కళ్లు తెరిచే సరికే ఆసుపత్రిలో ఉన్నా. ప్రమాదంలో నా కుడి కాలు బాగా దెబ్బతింది. కాలు తీసేయాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. నాలుగేళ్లు 23 శస్త్రచికిత్సలు.. భరించలేకపోయాను. నటుడు కావాలనే నా కోరిక ఇక తీరదనుకున్నా. నా మీద నాకున్న నమ్మకం... అమ్మ ప్రేమ... అన్నీ కలిసి మళ్లీ నన్ను నడిపించాయి. 

నాన్నను చూసే

నాన్న వినోద్‌రాజ్‌(విక్టర్‌) మంచి నటుడు. అమ్మ రాజేశ్వరి. వాళ్లది ప్రేమ వివాహం. నాన్న విలన్‌, తండ్రి పాత్రలు పోషించారు. విజయ్‌ నటించిన ‘గిల్లి’ (ఒక్కడు రీమేక్‌)లో త్రిషకు తండ్రిగా నటించారు. ఎక్కువగా పోలీసు పాత్రలు చేశారు. నిజానికి ఆయన్ను చూసే నాకు నటనపై చిన్నతనంలో ఆసక్తి పెరిగింది. పోలీసు అధికారిగా ఆయనకన్నా గొప్ప పాత్ర పోషించాలని ఎదురుచూశా. హరి దర్శకత్వంలో ‘సామి’తో (తెలుగులో ‘లక్ష్మీ నరసింహ’గా రీమేక్‌ అయ్యింది) ఆ ఛాలెంజ్‌ నెరవేరింది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.