close
ఇంటర్వ్యూ
అప్పుడు నిజమైన మహేశ్‌ని చూశాను

అందంతో అలరించినా... పెద్దల కథలను పండించినా... ఆమెదో ప్రత్యేకశైలి.  ‘భరత్‌ అను నేను’ చిత్రంతో తెలుగు ప్రజల మనసుపై చెరగని ముద్ర వేసిన కియారా అడ్వానీని ‘హాయ్‌’ అంటూ పలకరిస్తే...

‘‘ఫిట్నెస్‌ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. రోజుకి  ఒక్క గంటైనా మీ శరీరం కోసం కేటాయించండి. రోజూ జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కాలినడక కంటే గొప్ప వ్యాయామం లేదు. లేదంటే ఇష్టమైన పాటలు పెట్టుకుని డాన్స్‌ చేయండి. కాస్త దూరానికైనా బైకుల మీద ఆధారపడడం అలవాటైపోయింది. దాని బదులు నడవడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యంతో పాటు, పర్యావరణమూ బాగుపడుతుంది’’

‘‘ప్రేమపై నాకు చాలా గౌరవం ఉంది. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. వాళ్లని, వాళ్ల ప్రేమని చూస్తూ పెరిగినదాన్ని. వాళ్ల మధ్య అనుబంధం చూస్తుంటే ‘నేనూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి’ అనుకుంటుంటా. తప్పకుండా నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటా. అదెప్పుడన్నది నా చేతుల్లో లేదు. పదో తరగతి చదివేటప్పుడు ఓ అబ్బాయిని చూసి ఆకర్షితురాలినయ్యా. అయితే అది ఆకర్షణే అని నాకు తెలుసు. ఈ విషయం మా అమ్మకీ తెలుసు. ‘ముందు చదువుపై దృష్టి పెట్టు.. ఈ వయసులో ఇవన్నీ సహజమే’ అని చెప్పింది. ఆ తరువాత చదువు ధ్యాసలో పడి ఆ అబ్బాయిని మర్చిపోయా. నేను ప్రేమలో పడితే ఆ విషయం తప్పకుండా ఇంట్లో వాళ్లకు చెబుతా.’’

* చాలా తక్కువ సినిమాలతోనే పేరు తెచ్చుకున్నారు.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన లక్ష్యం నెరవేరినట్టేనా?
లక్ష్యాలెప్పుడూ మారుతూ ఉండాలి. లేదంటే మనం ఓ చోట ఆగిపోతుంటాం. సినిమా అవకాశాల కోసం నేను ఎన్ని ఆఫీసు మెట్లెక్కానో, ఎంతమంది చుట్టూ తిరిగానో నాకు తెలుసు. ఒక్క సినిమా వస్తే చాలు అనుకున్న సందర్భాలున్నాయి. అలా అనుకుంటే తొలి సినిమాకే నా లక్ష్యం నెరవేరిపోయి, ప్రయాణం ఆగిపోయి ఉండాలి. సినిమా సినిమాకీ ఎదగడమే నా ముందున్న లక్ష్యం.

* మీకూ సినిమా కష్టాలు తప్పలేదన్నమాట?
నాకు చిత్రపరిశ్రమ పూర్తిగా కొత్త. ఇక్కడెవరూ తెలిసినవాళ్లు లేరు. నా అవకాశాల్ని నేనే వెదుక్కున్నాను. నా కష్టం నేనే పడ్డాను. అయితే వాటినెప్పుడూ కష్టాలుగా భావించలేదు. ఆమాత్రం ఇబ్బందులు పడకపోతే, మనం ఎదిగినా, ఆ ఎదుగుదలకు ఓ అర్థం ఉండదు. నా తొలి సినిమా ‘ధోని’ అని అంతా అనుకుంటారు. అంతకు ముందే ఓ సినిమా చేశాను. అది సరిగా ఆడలేదు. ఆ సినిమా కోసం నేనెంతగా ఎదురుచూశానో నాకే తెలుసు. తొలి సినిమాతో జాతకం మొత్తం మారిపోతుందనుకున్నా. వర్కవుట్‌ అవ్వలేదు. రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నాను. ఆడిషన్స్‌ ఇస్తూనే ఉన్నాను. ప్రతిచోటా మొండిచేయే ఎదురయ్యేది. అవకాశం కోసం ఎంతో మందిని కలిసేదాన్ని. ఇక తిరగడం మానేద్దాం అనుకున్నప్పుడు ‘ధోని’లో అవకాశం వచ్చింది.

* ‘లస్ట్‌ స్టోరీస్‌’తో మీకు మరింత గుర్తింపు వచ్చింది. కాకపోతే విమర్శలూ ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ వెబ్‌ ఫిల్మ్‌ చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడైనా అనుకున్నారా?
ఒక్క క్షణం కూడా అనుకోలేదు. ‘లస్ట్‌ స్టోరీస్‌’ చేయకపోతే నేను చాలా కోల్పోయేదాన్ని. అందులో నా పాత్రని ఒకొక్కరూ ఒక్కో కోణంలో చూశారు. కొంతమందికి వినోదం కనిపించింది. ఇంకొంతమందికి ఓ వివాహిత ఎదుర్కొనే సమస్య కనిపించింది. ఇంకొంతమందికి శృంగారం కనిపించింది. నా వరకూ నాలో నటిని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఆ వెబ్‌ ఫిల్మ్‌ నిలిచింది. ‘ధోని’ సినిమా చేశాకా నేను చాలామందికి ఆడిషన్స్‌ ఇవ్వాల్సివచ్చింది. కానీ.. ‘లస్ట్‌ స్టోరీస్‌’ తరువాత ఆ అవసరం రాలేదు.

* మీ ఇంట్లోవాళ్లతో ‘లస్ట్‌ స్టోరీస్‌’ చూడడం ఇబ్బందిగా అనిపించలేదా?
మా బామ్మ, నేనూ కలిసి ఆ సిరీస్‌ చూశాం. తనతో చూస్తున్నప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తను ఎలా అర్థం చేసుకుంటుంది? అనే కంగారు వచ్చేసింది. బామ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు.

* మహేష్‌బాబు, రాంచరణ్‌ లాంటి స్టార్‌లతో పనిచేసే అవకాశం వచ్చింది. వాళ్లిద్దరిలోనూ మీరు గమనించిన ప్రత్యేకతలేంటి?
ఇద్దరూ పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చి నటులైనవాళ్లే. కాకపోతే.. ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడ్డారు. వాళ్ల కష్టంతో స్టార్లుగా ఎదిగారు. ‘..భరత్‌ అనే నేను’ సినిమాకి ముందు మహేష్‌ గురించి నాకు పెద్దగా తెలీదు. దక్షిణాదిన తనో పెద్ద స్టార్‌ అనే తెలుసు. తన సినిమాలు కొన్ని చూశాను. సెట్లో అడుగుపెట్టాక నిజమైన మహేష్‌ని చూశాను. తన సెన్సాఫ్‌ హ్యూమర్‌కి అభిమానిని అయిపోయా. చరణ్‌ కూడా అంతే. చాలా సింపుల్‌గా ఉంటాడు. తోటి నటీనటుల్ని గౌరవించే పద్ధతి నచ్చుతుంది.

* ‘చిత్రసీమలో పురుషాధిపత్యం ఎక్కువ’ అని చెబుతుంటారు. దీన్ని మీరు ఒప్పుకొంటారా?
ఈ రోజుల్లో పురుషాధిక్యత గురించి మాట్లాడుకోవడం నాకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆడ, మగ అనే తేడా లేదు. ప్రతి రంగంలోనూ సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. లేని చోట్ల పోరాడి సాధించుకుంటున్నారు. అయితే ఈ పోరాట స్ఫూర్తి ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ తమ బాధ్యతల్ని సమానంగా పంచుకోవాలి.

* జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొనే విషయంలో మీ దృక్పథం ఎలా ఉంటుంది?
ఫెయిల్యూర్స్‌ అంటే నాకు భయం లేదు. ఓ విధంగా మనల్ని సరిగా గైడ్‌ చేసేవి పరాజయాలే. నా తొలి సినిమా ఫ్లాప్‌. ఆ సినిమాతో నేను చాలా విషయాలు నేర్చుకోగలిగా. ఎవరి కష్టాల్ని వాళ్లే దిగమింగుకుని ముందడుగు వేయాలి. మన పరాజయాలకు మరొకర్ని నిందించడంలో అర్థం లేదు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.