close
ఇంటర్వ్యూ
వాళ్లకి తప్పకుండా శిక్ష పడుతుంది

అవును.. ‘మన్మథుడు2’ ఆ చిత్రానికి రీమేక్‌!

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు2’. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. లక్ష్మి, సమంత, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కథానాయకుడు నాగార్జున, దర్శకుడు రాహుల్‌ సమాధానం ఇచ్చారు. 

మన్మథుడు, మన్మథుడు2 ఈ రెండు చిత్రాల్లో మీరు బాగా ఎంజాయ్‌ చేసింది ఏది?
నాగార్జున: మొదటి సినిమా చేసి, 17ఏళ్లు అవుతోంది. రెండో సినిమా చేస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాం. చాలా హ్యాపీగా చేశాం. ‘మన్మథుడు’కూడా విజయభాస్కర్‌గారితో చాలా ఈజీగా హ్యాపీగా సాగిపోయింది. ఆ జోక్స్‌ అన్నీ పంచ్‌లు అని సినిమా హిట్టయిన తర్వాత తెలిసింది. ‘మన్మథుడు2’ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. 

సమంతతో పనిచేయడం ఎలా అనిపించింది?
నాగార్జున: తనతో గతంలో ‘మనం’, ‘రాజుగారిగది 2’ చేశా. ఇది మూడో సినిమా. తనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. కోడలు అయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది(నవ్వులు).

తొలి మన్మథుడికి ఇది సీక్వెల్‌ అనుకోవచ్చా?
నాగార్జున: కచ్చితంగా సీక్వెల్‌ అయితే కాదు. ఆ చిత్రంలోని పాత్రలేవీ ఇందులో ఉండవు. రొమాంటిక్‌ కామెడీ జోనర్‌ అంతే. అందులోనే నేనే లీడ్‌ రోల్‌ కాబట్టి ఇందులో దాన్ని వాడుకున్నాం. 

బాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే ఆధునిక పోకడలు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయనుకుంటా!
నాగార్జున: మన స్టాండర్ట్స్‌ ఏమీ తక్కువ లేవు. ‘గీతాంజలి’లో రెండున్నర నిమిషాల లిప్‌లాక్‌ ఉంటుంది. అది చూశారుగా. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ ప్రాక్టీస్‌ కూడా అయింది(నవ్వులు) 

ఈ టైటిల్‌ ముందుగానే అనుకున్నారా?
రాహుల్‌: ఈ కథకు ‘మన్మథుడు’ టైటిల్‌ సరిగ్గా సరిపోతుంది. మళ్లీ అదే టైటిల్‌ పెడితే బాగోదు. ప్రేక్షకులు తికమక పడతారు. అందుకే ‘మన్మథుడు2’ అని పెట్టాం. షూటింగ్‌ ప్రారంభించే ముందే టైటిల్‌ డిసైడ్‌ చేశాం. 

ఈ సినిమా కథ రీమేకా?
నాగార్జున: ఈ సినిమాను ఎక్కడి నుంచో కాపీ కొట్టామని కొందరు అంటున్నారు. ‘ఊపిరి’ అనే సినిమా ‘ఇన్‌టచ్‌బుల్స్‌’ అనే ఫ్రెంచ్‌ సినిమా. రైట్స్‌ కొనుగోలు చేసి ఆ చిత్రం చేశాం. అలాగే, ఇది కూడా ‘ప్రిటీ-మోయ్‌ తా మెయిన్‌’ అనే ఫ్రెంచ్‌ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్‌ను స్టూడియో కెనాల్‌ నుంచి కొనుగోలు చేసి, ఏడాది పాటు మనకు తగినట్లుగా కథ సిద్ధం చేశాం. ఇక రాహుల్‌ను డైరెక్టర్‌ అనుకున్న తర్వాత తను మమ్మల్ని కలిసినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న ‘మన దగ్గర రైట్స్‌ ఉన్నాయా’ అని. ‘నేను ఎవరో చేసిన క్రియేషన్‌ను కొట్టేసే రకం కాదు. ఇవిగో రైట్స్‌’ అని అన్నీ చూపిస్తే గానీ తను సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. రాహుల్‌ బాగా తీశాడు.

ఆ సినిమా యథాతథంగా ఉంటుందా?
రాహుల్‌: అస్సలు ఉండదు. స్క్రిప్ట్‌పై చాలా వర్క్‌ చేశాం. చాలా సన్నివేశాలు యాడ్‌ చేశాం. మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. 

ఈ కథ నేపథ్య ఏంటి?
నాగార్జున: ఈ సినిమా అంతా పోర్చుగల్‌లో జరుగుతుంది. మూడు దశాబ్దాలుగా అక్కడ సెటిల్‌ అయిన కుటుంబం నేపథ్యంగా సాగుతుంది. వాళ్లు తెలుగుతో పాటు పోర్చుగీస్‌ కూడా వాడతారు. పోర్చుగల్‌లో తీయడానికి కూడా ఒక కారణం ఉంది. ఒకసారి అనుమతి తీసుకుంటే, షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జనాభా తక్కువ. అక్కడ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. లండన్‌ వెళ్తే వర్షాలు పడతాయి, యూఎస్‌లో ఎండలు మండిపోతాయి. పోర్చుగల్‌ అయితే నేపథ్యం కొత్తగా ఉంటుందని ఇలా చేశాం. 

ఈ వయసులో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడంపై మీ అభిప్రాయం?
నాగార్జున: వయసు పెరిగే కొద్దీ కోరికలు పెరుగుతాయి కదండీ(నవ్వులు) 
రాహుల్‌: ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చాలా క్లాసీగా షూట్‌ చేశాం. అవన్నీ ఫన్నీగా, క్యూట్‌గా ఉంటాయి తప్ప ఇబ్బంది పెట్టేలా ఉండవు.

సమంతను తీసుకోవడానికి కారణం ఏంటి?
నాగార్జున: నాకు కూడా తెలియదు. అది రాహుల్‌ నిర్ణయమే. తనే సమంతకు కథ చెప్పి ఒప్పించాడు. 
రాహుల్‌: చిన్న అతిథి పాత్ర. తనని ఎందుకు తీసుకున్నానో ఆ సీన్‌ చూస్తే మీకే అర్థమైపోతుంది. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఆ పాత్రకు తను చక్కగా సరిపోతుంది. 

మీరు గతంలో పలు చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. ఈ చిత్రంలో పాత్ర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
నాగార్జున: ఇక్కడ రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌ రెండు వేర్వేరు విషయాలు. నేనెప్పుడూ రెండింటినీ కలపలేదు. ‘అన్నమయ్య’ చేశాను కదాని పూజలు చేస్తూ, దండాలు పెడుతూ కూర్చొలేదు. అదే విధంగా, ‘మన్మథుడు’లో ముద్దులు పెట్టాను కదాని అదే పనిలో ఉండను.
రాహుల్‌: నాగార్జునగారు చేసిన చిత్రాల్లో ‘నిర్ణయం’ నాకు బాగా ఇష్టం. మళ్లీ మీరు ఆ స్థాయి కామెడీని చూస్తారు. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ సమయంలో నేను బాగా ఎంజాయ్‌ చేశాను. 

మీ జర్నీ కేవలం అన్నపూర్ణా స్టూడియోస్‌తోనేనా, ఇతర సంస్థలతో కూడా కొనసాగిస్తారా?
వయకామ్‌ అజిత్‌: మేము కేవలం అన్నపూర్ణా స్టూడియోస్‌  సంస్థను మాత్రమే చూసి రాలేదు. కథ బాగా నచ్చడంతో ఇందులో భాగస్వామి అయ్యాం. ఫ్రెంచ్‌ చిత్రం నుంచి కేవలం స్క్రిప్ట్‌ మాత్రమే తీసుకుని, రాహుల్‌ చక్కగా తీశాడు. నాగార్జునకు సరిగ్గా సరిపోయే చిత్రం ఇది. 

బెస్ట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపుదారుగా అన్నపూర్ణా స్టూడియోస్‌కు అవార్డు రావడంపై మీరెలా స్పందిస్తారు!
నాగార్జున: ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించినందుకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి నాకు పురస్కారం అందజేయడం సంతోషంగా ఉంది. లీగల్‌గా కుదిరిన ట్యాక్స్‌ సేవింగ్స్‌ అన్ని చూసుకున్న తర్వాత ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాం. 

నాగార్జున పక్కన రకుల్‌ చాలా చిన్నదిగా అనిపించదా!
రాహుల్‌: హీరోకు కాస్త వయసు ఎక్కువని మేము, టీజర్‌, ట్రైలర్‌లోనే చెప్పేశాం కదా! దాన్ని చెప్పకుండా దాచిపెట్టి, సినిమా తీయలేదు. అదే స్టోరీ. కథకు ఆ డిమాండ్‌ ఉండి, సీనియర్‌ హీరోయిన్‌ను ఎందుకు తీసుకుంటాను. 

‘బిగ్‌బాస్‌’ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది? 
నాగార్జున: చాలా బాగుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేసినప్పుడు కాస్త బిగుసుకుపోయి కూర్చోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టేజ్‌పై ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ అంతా తిరగవచ్చు. ఒక వారమే కదా అయింది. ఆ హౌస్‌లో ఏం జరుగుతుందో నాకూ తెలియదు. అటువైపు వెళ్లినప్పుడల్లా పాపం ఏం చేస్తున్నారో అనుకుంటా(నవ్వులు). 

వివాదాలకు మీరు దూరంగా ఉంటారు. మరి ఇటీవల వివాదం అయిన ‘బిగ్‌బాస్‌’కు మీరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కదా!
నాగార్జున: ఇప్పుడు కూడా అలాగే దూరంగా ఉన్నా. చాలా దేశాల్లో ఈ షో నడుస్తోంది. హిందీలో 12 సీజన్లు, తమిళ్‌లో 3, కన్నడ 2, మలయాళం 4 సీజన్లు, మరాఠీ 2 సీజన్లు, తెలుగులో ఇది మూడో సీజన్‌. వివాదం అనేది గాల్లోంచి కూడా పుట్టించవచ్చు. అయితే ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు. హైకోర్టు, తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయాలన్నీ వాళ్లు చూసుకుంటారు. సరైన విచారణ జరుగుతుందని అనుకుంటున్నా. తప్పు చేసిన వాళ్లు తప్పకుండా శిక్షింపబడతారు. 

‘బిగ్‌బాస్‌’లో ఎవరెవరు పాల్గొంటున్నారో ముందే మీకు తెలుసా?
నాగార్జున: అది నిబంధనలకు విరుద్ధం కదా! నేను చెప్పే విషయం ఎవరూ నమ్మరు. మా ఇంట్లో కూడా నమ్మలేదు. నేను షోకు వచ్చే ఐదు నిమిషాల ముందు మాత్రమే ‘బిగ్‌బాస్‌’లో పాల్గొనే వారి జాబితా ఇచ్చారు. అప్పుడే వాళ్ల గురించి తెలుసుకున్నా. 

‘బంగార్రాజు’ను వచ్చే వేసవికి చూడవచ్చా?
నాగార్జున: ఇంకా షూటింగ్‌ మొదలు పెట్టలేదు. కల్యాణకృష్ణ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నాడు. దాదాపు అయిపోయింది. వేసవికి విడుదల చేసేలా ప్రయత్నిస్తున్నాం. 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.