close
ఇంటర్వ్యూ
నా పాట విని కోలుకున్నారు

అన్నమయ్య సంకీర్తన ఆ తిరుమలేశుడికి అంకితం ఆమె గాత్రం ఆ వాగ్గేయకారుడి సంక్తీరనలకు సమర్పితం నలభై వసంతాలుగా తన కమ్మని గానంతో పదకవితలు వినిపిస్తున్న సంగీత విద్వాంసురాలు... శోభారాజ్‌. వేలమంది శిష్యగణాన్ని తీర్చిదిద్దుతూ అన్నమయ్య భావనా వాహినిని నిరంతరం కొనసాగించే క్రతువులో పాలుపంచుకుంటున్నారు. నాద చికిత్సతో అమృతాన్ని పంచుతున్న స్వరనిధి హృదయాంతరంగాలు.. 

పాటతోనే చికిత్స.... 
సంకీర్తనా ఔషధం, నాదచికిత్స నాకిష్టమైన వ్యాపకం. థెరాప్యుటిక్‌ మ్యూజిక్‌ సాయంతో బాధల్లో ఉన్నవారికి సంగీతంతో ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాను. మీరనుకోవచ్చు. మందులు, సర్జరీలు లేకుండా పాడితేనే వ్యాధి నయమవుతుందా? అని. సంగీతంతో చక్కని ఉపశమనం అందుతుంది.  ఓసారి అమెరికాలోని నాక్స్‌వెల్‌ వార్‌వెటరన్‌ ఆసుపత్రిలో రోగులకి ఈ నాద చికిత్స చేశాను.  అందులో కొందరు చేతులు కదల్చలేకుండా పక్షవాతంతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటివాళ్లు సైతం ‘తందనాన అహి... తందనాన పురే’ పాట పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టగలిగారంటే ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? అక్కడున్న డాక్టర్‌ ఈ సంఘటనని వీడియో తీశారు. మరొక సందర్భంలో... నా శిష్యుడి తల్లి ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎదుటివారిని గుర్తించలేని స్థితిలో ఉన్న ఆవిడ నా పాట విన్న తర్వాత తిరిగి కోలుకుని చాలా సంవత్సరాలు బతికారు. ‘మా నాన్నగారికి చివరి క్షణాలు. మీ పాటవింటే ఆయన ప్రశాంతంగా తనువు చాలిస్తారు. దయచేసి మా ఇంటికి వస్తారా’ అంటూ ఫోన్‌ చేశారు ఒకావిడ. ఆయన చివరి క్షణాల్లో సంగీతంతో ఉపశమనం పొందుతున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇవి సంకీర్తనా ఔషధం గొప్పదనం గురించి చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. 
వాళ్లవల్లే నాది భక్తిబాట... 
నేను పుట్టింది చిత్తూరు జిల్లా వాయల్పాడులో. నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకి భగవద్గీత మొత్తం కంఠస్థమే. అమ్మబాగా పాడుతుంది. జీవితంలో ప్రతి సందర్భలోనూ గీతను అనుసంధానం చేసేవారు నాన్న. అమ్మానాన్నలిద్దరిదీ ఆధ్యాత్మిక దారి కావడంవల్లనే నేనీ మార్గంలోకి వచ్చాను. మేం తొమ్మిదిమంది పిల్లలం. ఎవరైనా వస్తే బుద్ధిగా ఉండే మమ్మల్ని చూసి బయటవాళ్లు ‘నవరత్నాలు’ అని మెచ్చుకుంటే... అమ్మ చిరుకోపంతో కాదు ‘నవగ్రహాలు’ అనేది. 
నా గొలుసు వెనుక కథ... 
నేను పాడగా వచ్చిన పారితోషికంతోనే రాళ్లుగుట్టలు, అడవిలా ఉన్న ఈ నేలని అన్నమయ్యపురంగా మార్చాను. అన్నమయ్య, వేంకటేశ్వస్వామి ఒకే గర్భగుడిలో ఉన్న ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించాను. చాలామంది నా మెడలోని ఈ గొలుసు చూసి నేను కోటీశ్వరురాలిని అనుకుంటారు. అన్నమయ్య 600వ జయంతి వేడుకలు జరుగుతున్నప్పుడు మా అక్కచెల్లెళ్లు అందరూ కలిసి మెడలో ఈ గొలుసు వేశారు. ఆ వేడుకల్లో మా అక్కయ్య మాట్లాడుతూ ‘ఆమెకో గుణం ఉంది. అవసరం అయితే పాటలకోసం, స్వామి సేవ కోసం ఇదీ అమ్మేస్తుంది. కాస్త అమ్మకుండా చూడండి బాబు’ అంటూ మాట తీసుకుంది. అయినా సరే ఆ మధ్య అమెరికాలో ఉన్నప్పుడు ఈ గొలుసు అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. 
సినిమాల్లోకి వెళదానుకున్నప్పుడు ఏం జరిగిందంటే... 
పద్మావతి కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. కాలేజీలో చురుగ్గా పాడుతుంటే... తితిదే వారు నన్ను ప్రోత్సహిస్తూ అన్నమాచార్యుల వారి సంగీతం అధ్యయనం చేయడానికి ఉపకారవేతనం అందించారు. అదే సమయంలో పెండ్యాల, రాజేశ్వరరావు, రమేష్‌నాయుడు వంటి వారు ‘అవకాశం ఇస్తాం సినిమాల్లోకి రమ్మ’ంటూ ప్రోత్సహించారు. మా పెద్దన్నయ్య సాయంతో మద్రాసు వెళ్లడానికి సిద్ధం అవుతుండగా... తితిదే నుంచి ఆర్డరు వచ్చింది. మిమ్మల్ని అన్నమాచార్యుల కీర్తనల ప్రచారానికి నియమిస్తున్నాం అని. నేనా పనిని చేయగలనా? అని సందేహం కలిగింది. తిరుపతిలోని కపిలతీర్థంలో నమ్మాళ్వార్‌ గుడి ఉండేది. అది అప్పట్లో శిథిలావస్థలో ఉండేది. ఇలా ఎటూ నిర్ణయించుకోలేని సమయంలో అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేదాన్ని. అక్కడ అన్నమయ్య కీర్తనలే ప్రచారం చేస్తానని బలంగా సంకల్పించాను. ఆ సంకల్పంతోనే నలభై సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే బాటలో నడిచాను. అన్నమయ్యపురం, అన్నమయ్యగుడి ఇవన్నీ ఆ సంకల్పబలాలే. 
ఆయన ఉద్యోగం వదులుకున్నారు... 
మావారు డాక్టర్‌ నందకుమార్‌ కేంద్రప్రభుత్వ ఉద్యోగి. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకి డిప్యుటీ డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా చెన్నైలో ఉండేవారు. నేను ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చినప్పుడల్లా ఆయన చెన్నై నుంచి నాకు తోడుగా వచ్చేవారు. అదెంత ఇబ్బందో అప్పుడు నాకు తెలియదు. అమ్మ నామీద ఇష్టంతో తన బంగారమంతా నాకే ఇచ్చింది. ఆ బంగారమంతా పిల్లల(శిష్యులు)కి సంగీతం నేర్పడానికే అయిపోయింది. చేతికేది వస్తే ఆ వస్తువు తీసి అమ్మేసేదాన్ని. ఈ తీరు మావారిని బాగా బాధించింది. ఆయనెంత నచ్చజెప్పినా స్వామికి మాటిచ్చానని మొండిగా చెప్పేదాన్ని. మొదట్లో నొచ్చుకున్నా... ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం నాతో కలిసి అన్నమయ్య భావనా వాహిని, అన్నమయ్యపురం బాధ్యతలు తీసుకున్నారు. నా శిష్యులనే పిల్లలుగా భావించి పిల్లలు వద్దనుకున్నాం. 
మనసు నొచ్చుకుంది... 
రాత్రీపగలు కొత్తబాణీలు కట్టి, సంగీత రూపకాలు తయారుచేసి, అన్నమయ్య జయంతి వేడుకలు చేసిన నేను... కొన్ని సంఘటనల కారణంగా మనసు నొచ్చుకుని తితిదే నుంచి వచ్చేశాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత భద్రాచలం రామదాసు ప్రాజెక్టుని చేపట్టాను. 
20వేల మంది శిష్యులు 
‘అన్నమయ్య భావనా వాహిని పేరుతో ఇంతవరకూ 20,000 మంది శిష్యులని తీర్చిదిద్దాను. సంగీతంతో భావకాలుష్యాన్ని తరిమికొట్టడమే సంకీర్తనలు, సంగీతమే కాకుండా నా శిష్యులకు చిన్నతనం నుంచి వాళ్లకి మానవీయ విలువలని నేర్పిస్తున్నాను.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.