close
ఇంటర్వ్యూ
నా భార్య నా పాలిట లక్ష్మీదేవి: దేవదాస్‌ కనకాల

ఆ లోటు ఉండిపోయింది

హైదరాబాద్‌: గొప్ప నటుల్ని తీర్చిదిద్దడమే నటుడు, దర్శకుడు, నటనా శిక్షకుడు దేవదాస్‌ కనకాల లక్ష్యం. దీన్ని సాధించడానికే యాక్టింగ్‌ స్కూల్‌కు అంకితమైన గురువు ఆయన. ఎందరో గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఈ ప్రయాణంలో దేవదాస్‌ సతీమణి లక్ష్మీదేవి ఆయనకు వెన్నెముకలా నిలిచారు. కష్టసుఖాల్లో అండగా ఉన్నారు. ఈ విషయాన్ని  ఓ ఇంటర్వ్యూలో దేవదాస్‌ పంచుకున్నారు. తన కెరీర్‌ ఎలా మొదలైందో వివరించారు.

‘తూర్పుగోదావరి జిల్లా యానాం శివారు కనకాల పేట మా ఊరు. నాన్న పాపయ్య, అమ్మ మహాలక్ష్మి. కోలంక గ్రామంలో తొమ్మిదో తరగతి వరకు చదివా. యానాంలో పదో తరగతి, కాకినాడలో పిఠాపురం మహారాజా కాలేజీలో పీయూసీ చేశాను. విశాఖపట్నంలో బీఏ చదువుతూ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో యాక్టింగ్‌ కోర్స్‌ డిప్లొమాలో డిస్టింక్షన్‌లో పాసయ్యాను. తర్వాత పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లా. అక్కడ యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేసిన 1968 బ్యాచ్‌ విద్యార్థిని’.

తొలి వేషం
‘సాక్షి రంగారావు నా క్లాస్‌మేట్‌. పుణె నుంచి మద్రాసు వచ్చి ఆయన రూమ్‌లో ఉండేవాణ్ని. ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు వాశిరాజు ప్రకాశం నా మిత్రుడు. అందుకే సినిమా రంగంపై అవగాహన ఉండేది. ముళ్లపూడి వెంకట రమణ, బాపుగార్లు ‘బుద్ధి మంతుడు’ సినిమా సన్నాహాల్లో ఉన్న సమయంలో సాక్షి రంగారావు నన్ను వారికి పరిచయం చేశారు. ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి స్నేహితుడి వేషం ఇచ్చారు. అదే నా మొదటి చిత్రం. ‘టాటా వీడుకోలూ గుడ్‌బై ఇంక సెలవు..’ అంటూ ఘంటసాల పాట ఆ రోజుల్లో సూపర్‌హిట్‌. నేను, విజయ్‌చందర్‌, సుబ్బారావు నటించాం. దిల్లీ కేంద్ర కార్యాలయంగా హైదరాబాద్‌లో స్థాపించిన సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌కు మొట్టమొదట నేను, రాళ్లపల్లి, ఫిలిం డైరెక్టర్‌ సత్యనారాయణ రాజు, బుర్రకథ కళాకారుడు బెనర్జీ, లక్ష్మీదేవి, మీనా కుమారి (స్టేజ్‌ ఆర్టిస్టు) ఎంపికై, 1970-1973 ప్రాంతంలో అక్కడ పనిచేశాం’.

మలుపు తప్పిన సీత కథ..
‘వాశిరాజు ప్రకాశం గారి ఆహ్వానంతో నేను తిరిగి మద్రాసు చేరుకున్నాను. ఆయన ద్వారా నాకు విశ్వనాథ్‌ గారి పరిచయం ఏర్పడింది. ‘ఓ సీత కథ’ చిత్రంలో అవకాశం వచ్చింది. అందులో తాగుబోతు పాత్ర. నాకు అంతగా సంతృప్తి లేనప్పటికీ ఆ సినిమాలో నటన నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చిత్రంలో నా పాత్ర హైలైట్‌ అని ప్రకాశం గారు, విశ్వనాథ్‌ గారు ప్రశంసించారు. నీకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ మెచ్చుకోవడంతో నాలో పట్టుదల పెరిగింది. ‘ఓ సీత కథ’ విడుదలైన తర్వాత నా గురించి అనేక పత్రికల్లో గొప్పగా రాశారు. ఆ తర్వాత ‘సిరిసిరి మువ్వ’, ‘ప్రేమబంధం’, ‘సీతామహాలక్ష్మి’, ‘న్యాయంకోసం’, అడవి దివిటీలు’, ‘గోరింటాకు’, ‘మౌనం’ వంటి సినిమాల్లో నటించాను. అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి’.

దర్శకుడిగా..
‘‘నిజం’, ‘చలిచీమలు’ చిత్రాల ద్వారా మంచి దర్శకునిగా పేరు వచ్చింది. ‘చలి చీమలు’ చిత్రంలో నూటొక్క జిల్లాలకు అందగాడ్ని అనే డైలాగ్‌ నూతన ప్రసాద్‌ నట జీవితానికే టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. వర్మ నిర్మించిన ‘నాగమల్లి’, నవతాకృష్ణం రాజుగారి చిత్రం ‘ఓ ఇంటి భాగోతం’ నా దర్శకత్వంలో వచ్చినవే’.

సీరియల్‌కు ఐదు నందిఅవార్డులు
‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అనే దూరదర్శన్‌ సీరియల్‌కు కథ, కథనం, నిర్మాణం అన్నీ నావే. ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీనికి 5 నంది అవార్డులు రావడం నాకెంతో గర్వకారణం. వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రను బుల్లితెరకు అందించాను. విద్యార్థులు నా సీరియల్‌ చూసిన పరిజ్ఞానంతో ఆ సబ్జెక్టు పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. అదీ ఆ సీరియల్‌ గొప్పతనం’.

ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌..
మద్రాసులో దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య మండలిలో తమిళనాడు ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఉండేది. అక్కడ తమిళ నటులకే శిక్షణ ఇచ్చేవారు. కె. విశ్వనాథ్‌, కె. బాలచందర్‌, డి.వి.యస్‌ రాజు, బి.యన్‌.రెడ్డి, మధుసూదనరావు, కె.యస్‌.ప్రకాశరావు, సి.యస్‌. రావు, పి. పుల్లయ్య తదితర పెద్దలు అక్కడ విజిటింగ్‌ లెక్చరర్లు. తెలుగు వారికి కూడా ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఉండాలని వీళ్లంతా నిర్ణయించారు. రాజా రామదాసు గారు దానికి ప్రిన్సిపాల్‌. నాకున్న అర్హతల్ని బట్టి ఆయన కోరిక మేరకు నేను అక్కడ లెక్చరర్‌గా చేరాను’.

ఎందరో నటులయ్యారు!
మలయాళ చిత్రం ‘కన్నె వయసు’కి ఎస్‌.పి. ఆంజనేయులు గారు తెలుగులో నన్ను హీరోగా అనుకున్నారు. కానీ అది నాకు తగ్గ పాత్ర కాకపోవడంతో నా స్థానంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని సిఫార్సు చేశాను. అలా ఎందరినో పరిచయం చేశాను. ఎందరో విద్యార్థుల్ని నటులుగా తయారు చేసి యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేయించాను. వారిలో రజనీకాంత్‌, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్‌, అంకినీడు ప్రసాద్‌ కూడా ఉన్నారు. ఈ కృషిలో నా భార్య లక్ష్మీదేవి కూడా తోడుగా ఉండేది’.

నో రికమెండేషన్‌
‘రికమెండేషన్‌ అభ్యర్థుల్ని తీసుకోకూడదనే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ బోర్డు సభ్యుల నిర్ణయానికి విరుద్ధంగా డివీఎస్‌ రాజు పేర్లకి చుక్కలుపెట్టి పంపేవారు. ఈ సారికి కానిచ్చేయండి అని ఆయన సర్ది చెప్పారు. దీంతో నేను 1975లో లెక్చరర్‌ పదవికి రాజీనామా చేశా’.

ఆత్మ సంతృప్తి దక్కింది
‘1984లో మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చా. దీంతో సినిమాల్లో నటించడానికి సమయం సరిపోలేదు. ఆహుతి ప్రసాద్‌, అచ్యుత్‌, శివాజీరాజా, రామ్‌చరణ్‌, కామేశ్వరి నా దగ్గర శిక్షణ పొందినవారే. 1985లో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆంధ్రప్రదేశ్‌ను స్థాపించాం. అనిల్‌, సునీల్‌, కాళకేయ ప్రభాకర్‌, సమీర్‌, అల్లరి నరేష్‌, మంచు మనోజ్‌ ఇలా ఎందరికో ఈ సంస్థలో మెళకువలు నేర్పి, తీర్చిదిద్దాం. ఈ ప్రయాణంలో చిత్ర పరిశ్రమ నన్ను ఎప్పుడూ ప్రోత్సహించింది. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారానే ఏదైనా సాధించగలనని, నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగలనని నిరూపించి, శిక్షణా సంస్థ నిబంధనలకే కట్టుబడ్డాను. ఆ విధంగా నాకన్నా గొప్పగా చేయగల నటుల్ని, దర్శకుల్ని గుర్తించానన్న ఆత్మ సంతృప్తి నాకుంది’.

ఆ లోటు ఉండిపోయింది..
‘మహానటి సావిత్రి అంటే నాకు మహా అభిమానం. ఆమెతో కలిసి నటించలేకపోయాననే బాధ నాలో ఉంది. ఈ తరంలో సాలిడ్‌ దర్శకుడు ఎస్.ఎస్‌. రాజమౌళి. ఆయన్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి సన్నివేశాన్నీ అందంగా మలిచి, దానిలో ఎమోషన్‌ వ్యక్తీకరించే దర్శకుడు అతడు. నా అభిమాన దర్శకుడు రాజమౌళికి హాట్సాఫ్’.

నిజంగా ఆమె నా లక్ష్మీదేవి 
‘నేను సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌లో పనిచేస్తున్నప్పుడే 1971 నవంబరు 21న లక్ష్మీదేవితో నా వివాహం జరిగింది. బీఏ, బీఈడీ చదివి థియేటర్‌ ఆర్ట్స్‌లో డిప్లమో చేసిన నటి. అనేకసార్లు ఉత్తమ నటి అవార్డులు అందుకున్న స్టేజీ నటి. నాతోపాటే విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ నా వెన్నెముకలా నిలిచింది. నిజంగా ఆమె నా పాలిట లక్ష్మీదేవే. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి రాజీవ్‌ కనకాల. కోడలు సుమ. నా కుమార్తె శ్రీ లక్ష్మి. రాజీవ్‌ మంచి నటుడు. శ్రీ లక్ష్మి సీరియల్స్‌లో నటిస్తోంది. సుమ గురించి తెలియని వారే ఉండరు’.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.