close
ఇంటర్వ్యూ
కుటుంబ ప్రేక్షకులే నా బలం:జయం రవి
ఆరంభంలో తెలుగు సినిమాల రీమేక్‌లతో గుర్తింపు తెచ్చుకున్న జయం రవి ఇప్పుడు తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ప్రతి సినిమాకు వైవిధ్యాన్ని కూడా కనబరుస్తున్నారు. తాజాగా ‘కోమాలి’ చిత్రంలో పలు రకాల గెటప్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా జయం రవి ముచ్చటించిన విశేషాలు ఆయన మాటల్లోనే..

అలాంటి చిత్రాలకే ప్రాధాన్యం..

చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16 సంవత్సరాలవుతోంది. ‘జయం’ ద్వారా కెరీర్‌ని ఆరంభించా. అప్పటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ నన్ను బాగా ఆదరిస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి నా సినిమాను అందరూ చూడటమే చాలా గర్వంగా భావిస్తున్నా. అదే నా బలం. ఇకపై కూడా అలాంటి చిత్రాలే చేస్తా.

17 కిలోల బరువు తగ్గా!

‘కోమాలి’ నా 24వ చిత్రం. పాఠశాల విద్యార్థి, వృద్ధుడు వంటి 9 ప్రత్యేక గెటప్‌లలో నటించా. ఇందులో 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిగా నటించడం సవాలుగా అనిపించింది. చాలా నెలల పాటు జిమ్‌లో కసరత్తులు చేసి బరువు తగ్గాను. కొన్ని నెలలు క్యారెట్‌, టమోటా వంటి మాత్రమే తినేవాణ్ని. సినిమాలో ఆ పాత్ర 17 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకోసం ఏకంగా 17 కిలోల బరువు తగ్గా.

అమ్మ చాలా భయపడ్డారు

పాఠశాల విద్యార్థి పాత్రలో నటించేటప్పుడు మా అమ్మానాన్న, భార్య, పిల్లలందరూ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. అయితే మా అమ్మ చాలా భయపడ్డారు. సరిగ్గా తినలేదన్న విషయం తెలిసి బాధపడ్డారు. సినిమాలోని ఆ పాత్రను చూసిన తర్వాత సంతోషించారు. ‘చివరకు మన అబ్బాయిలా అయిపోయారే’ అని నా భార్య కూడా చెప్పిందప్పుడు.

ఆసక్తికరం..

16 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి కోమా నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందన్నదే సినిమా అసలు కథ. 20 ఏళ్ల క్రితం నీరు విక్రయిస్తారు.. అని చెబితే నవ్వేవారు. కానీ ఇప్పుడది అక్షరాలా జరుగుతోంది. ఇలాంటి పలు ఆసక్తికరమైన, వినోదాత్మకమైన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. వినోదానికి ఏమాత్రం కొదవుండదు. దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ ఇందులో ముఖ్యమైన పాత్రలో నటించారు.

2020లో ‘తని ఒరువన్‌ 2’

నా 25వ చిత్రానికి లక్ష్మణన్‌ దర్శకత్వం వహించనున్నారు. కథ సిద్ధమైంది. త్వరలోనే చిత్రీకరణ కూడా ఆరంభించనున్నాం. ఆ తర్వాత అహ్మద్‌ దర్శకత్వంలో నటించనున్నా. ఇవి పూర్తయ్యాక 2020లో మా అన్న రాజా దర్శకత్వంలో ‘తని ఒరువన్‌ 2’లో నటిస్తా. ఈ సినిమా కోసం నా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను నటించిన చిత్రాల్లో ‘పేరాన్మై’, ‘ఆది భగవాన్‌’, ‘వనమగన్‌’ చిత్రాలంటే చాలా ఇష్టం. అలాంటి వైవిధ్యమైన కథలకు ఎప్పటిలాగే ప్రాధాన్యం ఇస్తా.

కాపీ కొట్టలేదు

చెన్నైలో ఇటీవల వచ్చిన వరద సన్నివేశాలు, మానవత్వాన్ని చాటుకున్న యువకులు.. వంటి అంశాలు కూడా ‘కోమాలి’లో ఉన్నాయి. నిజానికి ఈ సినిమాకు ‘కోమాలి’ అనే శీర్షిక బాగా నప్పుతుంది. కొందరు సినిమా కథకు సంబంధించి సమస్యలు సృష్టిస్తున్నారు. కానీ మేం ముందుగానే పద్ధతి ప్రకారం నమోదు చేసి సినిమాను తెరకెక్కిస్తున్నాం. మేం తప్పు చేయలేదు. కాపీ కొట్టలేదు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.