close
ఇంటర్వ్యూ
చెత్త హీరో కావాలని వెతుకుతున్న టైంలో..: సంపూ

స్టార్‌డమ్‌ వచ్చినా సొంతూరులో ఎందుకుంటున్నారు?

హైదరాబాద్‌: వినోదాత్మకమైన పాత్రలు, కథలతో ప్రేక్షకుల్ని కవ్విస్తున్నారు సంపూర్ణేష్‌బాబు. ఆయన చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సంపూ నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలై, మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో రూ.12 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు పేర్కొన్నారు. సంపూ ఓ స్టార్‌గా వెండితెరపై సందడి చేస్తున్నప్పటికీ ఓ సాధారణ వ్యక్తి జీవితాన్ని గడుపుతుంటారు. షూటింగ్‌ లేనప్పుడు తన సొంతం గ్రామం మిట్టపల్లిలో అందరితో కలిసి మెలిసి తిరుగుతుంటారు. తాజాగా ఆయన తన వృత్తి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ఇష్టాఇష్టాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి..

నర్సింహా చారి.. సంపూర్ణేష్‌బాబుగా ఎలా మారారు?

సంపూ: ‘హృదయకాలేయం’ సినిమా దర్శకుడు ఓ చెత్త హీరో కావాలని వెతుకుతున్నారు (నవ్వుతూ). నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. మా ఊరిలో ఇదే స్థలంలో నాటకాలు ఆడేవారు. వాటిని నేను పగలు చేసేవాడ్ని. ఇవాళ నటనపై ఆసక్తి ఉన్న లక్షల మందిలో నేను ఒకడిని. నాకు కన్నడ హీరో ఉపేంద్ర డ్రెస్సింగ్‌ ఇష్టం. ఆ జుట్టూ, దుస్తులు వేసుకుని ఆడేవాడ్ని. అలాంటి డ్రెస్‌లో ప్రసాద్‌ ల్యాబ్‌లో ఉండగా ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌ నన్ను తన సినిమా కోసం ఎంచుకున్నారు.

సినిమాల్లోకి రావడానికి ముందు ఏం చేసేవారు.ఈ రంగానికి ఎందుకు రావాలని అనిపించింది?
సంపూ: నేను గోల్డ్‌ వర్క్‌ చేసేవాడిని. చాలా సినిమాలకు ఆడిషన్స్‌ కూడా ఇచ్చా. ఎప్పుడూ హీరో కావాలని అనుకోలేదు. కానీ వెండితెరపై నన్ను నేను చూసేకోవాలనేది నా కోరిక.

ఎలాంటి కష్టాలుపడ్డారు?, మొదటి అవకాశం ఎలా వచ్చింది?
సంపూ: నేనెప్పుడూ కష్టం అని ఫీల్‌ అవలేదు. ఇష్టపడ్డాను కాబట్టి సక్సెస్‌ అయ్యాను. మొదటి నుంచి నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోలేదు. నాకు వయసు అయిపోయింది, నటనకు సరిపోను అనుకోలేదు. ప్రయత్నించడమే నా పని.. ప్రేక్షకులను మెప్పించగలిగితే విజయం సాధించినట్లే.

చిత్ర పరిశ్రమపై యూట్యూబ్‌ ప్రభావం ఉందా?
సంపూ: చాలా ఉంటుంది. యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన చాలా మందికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మన నైపుణ్యం చూపించుకోవడానికి ఓ ప్లాట్‌ఫాం ఉంది. ఇక్కడ విజయం సాధిస్తే.. సినిమా అవకాశాలు సులభంగా వస్తాయి.

ఫేమస్‌ నటుల డైలాగ్‌లను పేరడీలు చేశారు. వారి అభిమానుల నుంచి సమస్యలు రాలేదా?
సంపూ: ‘కొబ్బరిమట్ట’లో చాలా సినిమాల డైలాగ్స్‌ను పేరడీలు చేశాం. అవి సినిమాలోని డైలాగ్స్‌ మాత్రమే. ప్రేక్షకులకు మాత్రం.. ‘పాపారాయుడు’ అంటే రజనీకాంత్‌‌, ‘పెదరాయుడు’ అంటే మోహన్‌బాబే. వారి మనసులో అలా నిలిచిపోయారు.

మిమ్మల్ని చిత్ర పరిశ్రమలో బాగా ప్రోత్సహించిన వారు ఎవరు?
సంపూ: ‘హృదయ కాలేయం’ సమయంలో సందీప్‌ కిషన్‌, తమ్మారెడ్డి భరద్వాజ్‌, మారుతి తదితరులు సపోర్ట్‌ చేశారు. నేను ‘కొబ్బరిమట్ట’ కోసం తొలుత 1.30 నిమిషాల డైలాగ్‌ చెప్పినప్పుడు చిరంజీవి చూసి మెచ్చుకున్నారు. పూరీ సినిమాలో, మోహన్‌బాబు బ్యానర్‌లో, నాని సినిమాలో చేశా. వారి మద్దతు నాకుంటేనేగా నటిస్తా.

‘కొబ్బరి మట్ట’ను ఐదేళ్ల క్రితం ప్రకటించారు. విడుదలకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది?
సంపూ: 2014లో టైటిల్‌ ప్రకటించాం. ఆ తర్వాత వెంటనే మోహన్‌బాబు సినిమాలో అవకాశం వచ్చింది. ఆపై ‘వైరస్‌’ అనే సినిమాలో నటించా. ‘బిగ్‌బాస్‌’కు వెళ్లి, వచ్చా. షూటింగ్‌ మొదలైంది మాత్రం మూడేళ్ల క్రితం. బడ్జెట్‌, ఆర్టిస్టుల సమస్య వల్ల ఆలస్యమైంది. పెద్ద పెద్ద డైలాగ్స్‌ నేర్చుకోవడానికి 15 రోజులు కేటాయించాల్సి వచ్చింది. వాతావరణం కూడా అనుకూలించాలి కదా. ఇలా ఇవన్నీ దాటుకుని వచ్చినందుకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు.

‘కొబ్బరిమట్ట’ డైలాగ్‌ ఆలోచన ఎందుకు వచ్చింది?
సంపూ: నాకు ముందు 1.30 నిమిషాల డైలాగ్‌ ఇచ్చి చెప్పమన్నారు. నాలుగు రోజులు తీసుకుని.. సింగిల్ టేక్‌లో చెప్పా. దీంతో సంపూతో ఇంకేదైనా పెద్ద డైలాగ్‌ చెప్పించాలి అనుకున్నారు. సినిమాతోపాటు సంపూకు కూడా పేరు వస్తుందని ఆలోచించారు. డైలాగ్‌ ట్రైలర్‌ విడుదలైనప్పుడు ఒక్క రోజులో 50 లక్షల మంది చూశారు. మేమంతా చాలా సంతోషపడ్డాం. ఓ చిన్న సినిమా, ఓ చిన్న నటుడికి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చారు.. ఈ ఆనందాన్ని ఎలా అనుభవించాలో తెలియడం లేదు.

మీకు స్టార్‌డమ్‌ వచ్చింది. షూటింగ్‌ లేని సమయంలో సిద్ధిపేటలోని మిట్టపల్లిలోనే ఉంటున్నారు.. ఎందుకు?
సంపూ: నాకు కొన్ని విలువలు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతా. నేను పుట్టి, పెరిగింది ఇక్కడ. నేను కెమెరా ముందు సంపూర్ణేష్‌ బాబు. కెమెరా వెనుక నరసింహాచారిగా ఈ జీవితం నాకిష్టం.

కొత్తవారికి మీరు ఏ సలహా ఇస్తారు?
సంపూ: కలలు కనండి, సాకారం చేసుకోండి. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి.. వాటి కోసం ప్రయత్నించాలి.

తర్వాతి ప్రాజెక్టులు ఏంటి?
సంపూ: రెండు సినిమాలు ఖరారయ్యాయి. స్టీవెన్‌ శంకర్‌ మరో సినిమా కోసం పనిచేస్తున్నారు. అందులో నేను సోలో హీరో. సెప్టెంబరు రెండో వారంలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలని చూస్తున్నాం.

ఈనాడు-ఈటీవీ హరితహారంలో పాల్గొన్నారు, మొక్కలు నాటారు. ఇప్పటికీ మీరు అదే ఒరవడి కొనసాగిస్తున్నారా?
సంపూ: ఎవరో చెప్పారని చేయడం కాదండీ. మన పూర్వీకులు మనకు అద్భుతమైన ప్రకృతిని ఇచ్చారు.ఈ రోజు మనం దాన్ని వికృతి చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడం మన బాధ్యత.

 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.