close
ఇంటర్వ్యూ
భయం.. కోపం రెండూ వస్తున్నాయి!

ఆయన కామెడీ టైమింగ్‌ను అందుకోవడం కష్టం!

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో సాయి శిరీషా ప్రభావతిగా అలరించి వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రాశీఖన్నా. వెంకటేశ్‌-నాగచైతన్య కీలక పాత్రల్లో కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా పంచుకున్న విశేషాలివి..

చాలా సన్నబడినట్లు ఉన్నారు?
రాశీఖన్నా: ఈ ఫిజిక్‌ కోసం చాలా కష్టపడ్డాను. ఉదయం.. సాయంత్రం జిమ్‌లో కసరత్తులు చేశా. షూటింగ్‌.. జిమ్‌ ఇప్పుడు నా జీవితంలో ఈ రెండే ఉన్నాయి. కేవలం బరువు తగ్గడానికి, పాత్ర కోసం మాత్రమే జిమ్‌కు వెళ్లడం లేదు. మరింత దృఢంగా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్నా. అయితే, కాస్త బొద్దుగా కనిపించినా అవకాశాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, ఒక నటిగా నేను ఫిట్‌గా ఉండాలి కదా! 


 

‘వెంకీమామ’లో మీ పాత్ర ఏంటి?
రాశీఖన్నా: ఇందులో నేను హారిక అనే ఫిలిం మేకర్‌ పాత్రలో నటిస్తున్నా. ఒకరోజు సడెన్‌గా సురేష్‌బాబుగారి నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడు నేను ‘అయోగ్య’ షూటింగ్‌లో భాగంగా పుదుచ్చేరిలో ఉన్నా. ‘వెంకీమామ’లో నటించాలని అడిగారు. సంతోషంగా ఒప్పుకొన్నా. చైతూతో  ‘మనం’లో కలిసి నటించా. అది కేవలం ఒకరోజు షూటింగ్‌ మాత్రమే. చైతన్యతో కలిసి లవ్‌స్టోరీలో నటించాలని ఉండేది. కానీ, అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. ఇక బాబీతో ‘జై లవకుశ’ కోసం కలిసి పనిచేశా. ప్రథమార్ధంలో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. సెకండాఫ్‌లో మామ-అల్లుళ్ల ఎమోషన్‌ క్యారీ అవుతుంది. 

కథ వినకుండానే సినిమా ఒకే చేశారా?
రాశీఖన్నా: అలా ఏమీ లేదు. కథ విన్న తర్వాతే సినిమాకు ఒకే చెప్పా. సురేష్‌బాబుగారు నిర్మాత కావడం వల్ల ఈ సినిమా ఒప్పుకొన్నా. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. 

వెంకటేశ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
రాశీఖన్నా: ఆయన అద్భుతమైన నటుడు. హావభావాలు చాలా చక్కగా పలికిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. 

ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తుంటే, హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని మీరు అనుకుంటున్నారా?
రాశీఖన్నా: ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో కూడా నేను నటించా. ఏ పాత్రకు ఉండే ప్రాధాన్యం ఆ పాత్రకు ఉంటుంది. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు. మలయాళంలో కూడా చాలా సినిమాలు చేశా. హీరోయిన్‌ పాత్ర కాకపోయినా, అవి ప్రేక్షకులకు గుర్తిండిపోయాయి. ఒక నటిగా కేవలం హీరోయిన్‌గా గ్లామరస్‌ పాత్రలే చేస్తానంటే కుదరదు కదా! ఒక కేటగిరీకీ మాత్రమే పరిమితం కావాలని నేను ఎప్పుడూ అనుకోను. అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈ సినిమాలో నాకు మంచి పాత్రే దక్కింది. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బాబీ చాలా చక్కగా రాశారు. అలా వచ్చి వెళ్లిపోయే పాత్ర అస్సలు కాదు.

ఎప్పటి నుంచి మీరు వెంకటేశ్‌కు అభిమానిగా మారారు?
రాశీఖన్నా: నా చిన్నతనంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్‌ అయ్యేవి. ఆ సినిమాలు చూసేదాన్ని. ఆయనతో నటించడం నా అదృష్టం. ఆధ్యాత్మికంగా ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఇటీవల ఆయన నటించిన ‘ఎఫ్‌2’ చూశా. 

ఒక వారం విరామంతో మీరు నటించిన రెండు సినిమాలు వస్తున్నాయి కదా! ఒత్తిడిగా ఫీలవుతున్నారా?
రాశీఖన్నా: ఒత్తిడేమీ లేదు. గతంలోనూ వారం గ్యాప్‌తో  ‘టచ్‌ చేసి చూడు’, ‘తొలిప్రేమ’ చిత్రాలు వచ్చాయి. 

ఒకేసారి వేర్వేరు సినిమాల్లో నటించడం వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా?
రాశీఖన్నా: ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలకు ఇబ్బంది పడలేదు. కానీ, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. 

డబ్బింగ్‌ చెప్పటానికి సమయం ఉందా?
రాశీఖన్నా: ‘వెంకీమామ’కు నేనే డబ్బింగ్‌ చెబుదామనకున్నా. కానీ, వరుస షూటింగ్‌లు ఉండటంతో కుదరలేదు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’కు మాత్రం నేను డబ్బింగ్‌ చెబుతున్నా.

సింగర్‌గా ఏమైనా ప్రయత్నిస్తున్నారా?
రాశీఖన్నా: చిన్నప్పటి నుంచి సింగర్‌ కావాలన్నది నా కల. ఏడేళ్ల వయసులో సంగీతం కూడా నేర్చుకున్నా. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నా. అయితే, ఆ తర్వాత నా లక్ష్యాలు మారిపోయాయి. ఇప్పుడు ఒక సినిమాలో పాట పాడుతున్నా. అయితే, అది ఏ సినిమా.. ఏ పాట పాడుతున్నానో ఇప్పుడే చెప్పలేను. ఆ వివరాలు తర్వాత చెబుతా.

హిందీ నుంచి వచ్చిన మీరు మళ్లీ అటు ఎందుకు వెళ్లడం లేదు?
రాశీఖన్నా: ఇక్కడే చాలా బిజీగా ఉన్నా. వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌కు వెళ్లిపోవాలి.. సినిమాలు చేయాలన్న ఆతృత ఏమీ లేదు. దక్షిణాది చిత్రాల్లోనూ నాకు మంచి పేరు వస్తోంది. ఎక్కడ ఉన్నా, మంచి సినిమా చేశామా? లేదా? అన్నది మాత్రమే చూసుకుంటా. 

హీరోయిన్ల మధ్య పోటీని మీరెలా తీసుకుంటారు?
రాశీఖన్నా: ప్రతి రంగంలోనూ పోటీ అనేది ఉంటుంది. పోటీ అనేది ఉంటేనే మనం ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న వారిలో రకుల్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. ఒక రకంగా ‘వెంకీమామ’లో నేను చేసిన పాత్ర తను చేయాల్సి ఉంది. 

తెలుగులో మీరు అనుకున్న పాత్రలు వస్తున్నాయా?
రాశీఖన్నా: ఇప్పుడు చేస్తున్న పాత్రలన్నీ నాకు నచ్చినవే. అయితే, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలామందికి ‘తొలి ప్రేమ’లో నా పాత్ర నచ్చింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే, ఒక సినిమా ఫ్లాయినా, అందులో నా పాత్రను ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు. 

వెబ్‌ సిరీస్‌లో నటిస్తారా?
రాశీఖన్నా: మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. 

మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఏమైనా ప్రయత్నిస్తున్నారా?
రాశీఖన్నా: కొన్ని వచ్చాయి. ఆ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటేనే చేస్తా.

‘దిశ’ ఘటనలాంటివి చదివినప్పుడు భయమేస్తుందా? కోపం వస్తుందా?
రాశీఖన్నా: రెండూ వస్తాయి. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. నేరస్థులను నడిరోడ్డులో అందరి ముందూ నరికేయాలి. ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే, న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే సరైన నిర్ణయం తీసుకుంటాయి. చాలా కోపం ఉంది. అదే సమయంలో నిస్సహయ స్థితిలో ఉన్నా. ఎందుకంటే ఈ ఘటనపై నా అభిప్రాయం మాత్రమే చెప్పగలను. నిందితులను శిక్షించలేను కదా! నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతి నటుడూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు పెప్పర్‌ స్ప్రే తప్పకుండా తీసుకెళ్లండి. 

సినిమాల్లో అశ్లీలత పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే దానిపై మీ అభిప్రాయం?
రాశీఖన్నా: అదంతా మన ఆలోచనల బట్టి ఉంటుంది. ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఏది మంచో ఏది చెడో వాళ్లే నిర్ణయించుకోవాలి. 

మీ తర్వాతి సినిమాలు ఏంటి?
రాశీఖన్నా: ‘వెంకీమామ’ తర్వాత ‘ప్రతి రోజూ పండగే’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఒప్పుకొన్నా, ఈ రెండు సినిమాలకన్నా ముందే ప్రస్తుతం ఇది షూటింగ్‌ దశలో ఉంది. 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.