close
అప్పటి ముచ్చట్లు
‘జూన్‌ 21’ చిరంజీవికి ప్రత్యేకం ఈ తేదీ!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆయన సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులకు అదో పండగ. ఆయన వెండితెరపై కనిపిస్తే అభిమానుల్లో అంతులేని ఉత్సాహం. ఆయన డ్యాన్స్‌కు చిన్నా పెద్దా, ఆడా, మగా తేడా లేదు అందరూ ఫిదా కావాల్సిందే. తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర కథానాయకుల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి. మాస్‌ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్న ఆయన తొలిసారి కెమెరా ముందు నటించిన చిత్రం ‘పునాదిరాళ్ళు’ విడుదలై నేటికి సరిగ్గా 40ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, చిరు నటించిన రెండో చిత్రం ‘ప్రాణం ఖరీదు’ మొదట విడుదల కావడం గమనార్హం. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

సుధాకర్‌ చేయాల్సిన పాత్ర!
చదువు పూర్తయిన తర్వాత శివ శంకర్‌ వరప్రసాద్‌ మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడి నుంచి వరుస అవకాశాల కోసం సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగడం ప్రారంభించారు. ఇదే సమయంలో చిరు, నటుడు సుధాకర్‌, హరిప్రసాద్‌లు కలిసి ఒకే రూమ్‌లో ఉండి తమ ప్రయత్నాలు కొనసాగించారు. సుధాకర్‌కు తమిళంలో వరుసగా అవకాశాలు రాగా, చిరు పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘పునాదిరాళ్ళు’ సినిమా ప్రారంభం కాగా, చిరంజీవి చేసిన పాత్రకు తొలుత నటుడు సుధాకర్‌ను అనుకున్నారు. అయితే ఆయన తమిళంలో వరుస చిత్రాలు చేస్తుండటంతో పాటు, భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకోవడంతో చిరంజీవిని తీసుకున్నారు. 

చిరంజీవిగా మారిన శివశంకర్‌ వరప్రసాద్‌
‘పునాదిరాళ్ళు’ చిత్రంతోనే శివ శంకర్‌ వరప్రసాద్‌ చిరంజీవిగా మారారు. ఈ సందర్భంగా పలు పేర్లను సైతం పరిశీలించారు. శంకర్‌, శంకర్‌బాబు అని.. అయితే చిరంజీవి పేరు పెట్టడం దైవికంగా జరిగిందని చెబుతుంటారు చిరు. ‘‘ఒకరోజు కలలో నేను రాములవారి ఆలయంలో నమస్కారం చేసుకుంటున్నాను. అప్పుడు వెనుక నుంచి ఎవరో ‘చిరంజీవి’ రా వెళ్దాం అని పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. ఆంజనేయస్వామికి మరో పేరు చిరంజీవి. ‘ఈ పేరునే నువ్వు సినిమాల కోసం పెట్టుకోవచ్చు కదా! ’ అని అమ్మ సూచించడంతో చిరంజీవి పేరు సినిమాల కోసం పెట్టుకున్నా’’ అని ఓ సందర్భంలో చెప్పారు చిరు.

నటించింది పునాదిరాళ్ళు.. విడుదలైంది ప్రాణం ఖరీదు
చిరంజీవి కెమెరా ముందు నటించిన చిత్రం ‘పునాదిరాళ్ళు’. అయితే, దీని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’సినిమా ముందు విడుదలైంది. దీంతో చిరంజీవి వెండితెరపై మొదటి సారి కనిపించిన రికార్డు ‘ప్రాణం ఖరీదు’కు దక్కింది.

ఆమె వందో సినిమా చిరుకు మొదటి చిత్రం..
ప్రముఖ నటి రోజారమణి(హీరో తరుణ్ తల్లి) 100వ చిత్రం.. చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లు కావడం విశేషం. ‘భక్తప్రహ్లాద’లో బాలనటిగా అందరి హృదయాలను గెలుచుకున్న రోజారమణి తెలుగు, తమిళ భాషల్లో అప్పటికే 99 సినిమాలు చేశారు. ‘పునాదిరాళ్ళు’తో సెంచరీ కొట్టారు. 

‘సైరా’ సిద్ధం!
ఇప్పటికే నటుడిగా చిరంజీవి 150 సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా’లో నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో ట్రైలర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.