close
అప్పటి ముచ్చట్లు
ఫైట్‌ లేకుండా క్లైమాక్స్‌: ఆయనతోనే సాధ్యం!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ సినిమా ‘అత్తారింటికి దారేది’. సెప్టెంబరు 27, 2013లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 6 సంవత్సరాలు అయ్యింది. పవన్‌-త్రివిక్రమ్‌లకు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఓ మంచి హిట్‌ను ఇచ్చింది. ఇందులో పవన్‌ పంచ్‌ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోవైపు సమంత చలాకీతనం, నదియా హుందాతనం ప్రేక్షకులను కట్టిపడేశాయి.  పాటలు, ఫైట్‌లు, పంచ్‌లు అన్ని ఒక ఎత్తు అయితే క్లైమాక్స్‌ మాత్రమే ఒక ఎత్తుగా చెప్పవచ్చు.

తాత కోరిక మేరకు అత్తను పుట్టింటికి తీసుకువెళ్లడానికి వచ్చి.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆయన కోరిక తీరుస్తాడు పవన్‌కల్యాణ్ (గౌతమ్‌నంద)‌. సినిమా క్లైమాక్స్‌లో పవన్‌, నదియాల మధ్య చిత్రీకరించిన సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలిచిందనే చెప్పవచ్చు. రావు రమేష్‌, పవన్‌కల్యాణ్‌ని ‘ఎవర్రా నువ్వు’ అని అడగగా..  ‘ఎవరు చేయిపట్టుకుని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారో ఆవిడ మేనల్లుడ్ని.. ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్లుగా ఒకాయన కాలిపోతున్నాడో ఆయన కొడుకుని.. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవడిని.. కొన్ని వేల కోట్లు.. పది దేశాల్లో ఫ్యాక్టరీలు.. లక్షమంది కార్మికులు.. ఏవేమి తృప్తినివ్వని పేదవాడిని.. నందానికి వారసుడిని’ అని పవన్‌ చెప్పే డైలాగ్‌లో సినిమాలోని ఆయన పాత్రను తెలియచేస్తుంది. క్లైమాక్స్‌లో నదియా, పవన్‌కల్యాణ్‌ల మధ్య మాటలు మాత్రమే ఉంటాయి. ‘పవన్‌కల్యాణ్‌ చాలా సింపుల్‌గా ఉంటారు. ప్రేక్షకులు చాలా త్వరగా ఆయనకు కనెక్ట్‌ అవుతారు. అందుకే ఆయనకు అంతమంది ఫ్యాన్స్. అగ్రకథానాయకుడితో ఎలాంటి ఫైట్‌లు లేకుండా ఈ విధంగా క్లైమాక్స్‌ను చిత్రీకరించడానికి ఏ దర్శకుడైనా, నిర్మాతైనా భయపడతారు. కానీ పవన్‌కల్యాణ్‌ ప్రోత్సాహంతోనే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాం.’ అని త్రివిక్రమ్‌ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అదే విధంగా ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్‌ను పెడదామన్న విషయం పవన్‌కు చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకొన్నారని త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చారు.

‘‘నేను ఏ సినిమాలో నటించినా సన్నివేశానికి ముందు డైలాగులు చూసుకుని కెమెరా ముందు నటించేవాడిని. కానీ ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌కు మాత్రం డైలాగులు అన్ని చదువుకుని, త్రివిక్రమ్‌ ఎదురుగా చెప్పాను. అనంతరం కెమెరా ముందుకు వెళ్లగానే డైలాగ్‌ మొత్తం చెప్పగలిగాను కానీ, ఫీల్‌ రాలేదు. నిజం చెప్పాలంటే.. క్లైమాక్స్‌ చిత్రీకరించినప్పుడు మొదటిరోజే నేను ఫెయిల్‌ అయ్యాను. అందుకే ఆ రోజు నా ఆఫీసుకు వెళ్లిపోయాను. ఎవరిని కలవాలనిపించలేదు. నేనే ఆయన్ని అలాంటి క్లైమాక్స్‌ కావాలని అడిగాను. ఇప్పుడు నేనే చేయలేకపోయాను. ఒకవేళ నిజ జీవితంలో నాకే ఇలాంటి సంఘటన ఎదురైతే.. నేను ఇలాగే చెబుతానా అని ఆలోచించాను. ఆ తర్వాత రోజు ఉదయాన్నే లోకేషన్‌కు వెళ్లి.. గంటలోనే అనుకున్న విధంగా క్లైమాక్స్‌ పూర్తి చేయగలిగాను. అది నా మనసును కదిలించిన సందర్భం.’ అని పవన్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

 

 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.