close
అప్పటి ముచ్చట్లు
కాంతారావుకు మాటిచ్చిన ఎన్టీఆర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చలన చిత్ర పితామహులుగా కీర్తించే హెచ్‌.ఎం.రెడ్డి చేతుల మీదుగా చలనచిత్ర రంగప్రవేశం చేసి, స్వయం కృషితో జానపద, పౌరాణిక, సాంఘిక, క్రైమ్‌ చిత్రాలలో హీరోగా, క్యారక్టర్‌ నటుడుగా తనదైన శైలిలో రాణించిన నటుడు కాంతారావు. నారదుడి పాత్ర అంటే ఆయనే గుర్తొస్తారు. ఆ స్థాయి నటనతో అలరించారు. అంతేకాదు, కత్తి, కర్ర ఫైట్‌లు చేయడంలో ఆయన చేయి తిరిగిన మొనగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా విఠలాచార్య జానపద చిత్రాల్లో ఆయన నటన ఎవర్‌గ్రీన్‌. కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అందుకున్న ఆయన సినిమా నిర్మాణం చేపట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆ దెబ్బతో ఆర్థికంగా చివరి వరకూ ఒడిదొడుకులు ఎదుర్కొనాల్సి వచ్చింది.  శనివారం (నవంబరు 16) ఆయన జయంతి. ఈ సందర్భంగా కాంతారావు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

విజయగోపాల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాతలు జెట్టి చంద్రశేఖరరెడ్డి, ముంగమూరు బ్రదర్స్‌ 1958లో ‘గంగా గౌరీ సంవాదం’ సినిమా నిర్మిస్తూ కాంతారావుకు నారదుడు పాత్రను ఇచ్చారు. ఛాయాగ్రాహకుడు వి.ఎన్‌.రెడ్డి (హిందీలో ‘మయూర్‌ పంఖ్‌’, ‘పూరబ్‌ అవుర్‌ పశ్చిమ్’ వంటి అద్భుతమైన సినిమాలకు చాయాగ్రాహకుడుగా పనిచేశారు) దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ సినిమాలో శివుడుగా సీహెచ్‌.నారాయణరావు, గౌరిగా జానకి, గంగగా కృష్ణకుమారి నటించారు. అశ్వరాజ్‌ పిక్చర్స్‌ నిర్మాత కె. గోపాలరావు రజనీకాంత్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో ‘దీపావళి’ సినిమా నిర్మించారు. అందులో ఎన్‌.టి.ఆర్‌ కృష్ణుడుగా, ఎస్‌.వి.ఆర్‌ నరకాసురుడుగా, సావిత్రి సత్యభామగా నటించగా నారదుని పాత్ర కాంతారావు పోషించారు. నారదుడి పాత్ర పోషణ గమనించిన రామారావు ముగ్ధుడైపోతూ ‘కాంతారావు గారూ నేను రాముడు, కృష్ణుడు, శివుడు వంటి పాత్రలన్నీ ధరిస్తాను. కానీ, నారదుడి పాత్రను జీవితంలో ధరించను. ఆ పాత్ర ఎప్పటికీ మీకోసమే రిజర్వు అయి ఉంటుంది’ అన్నారు. అన్నమాట ప్రకారం రామారావు ఎన్నడూ నారదుని పాత్రను పోషించలేదు. తరువాత కాంతారావు నారదుడుగా ‘తారాశశాంకం’ (1969) వంటి అనేక సినిమాలలో రాణించిన విషయం తెలిసిందే.

చేతులు కాల్చిన సొంత సినిమాలు...
వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో కాంతారావు 1969లో హైమా ఫిలిమ్స్‌ సంస్థను స్థాపించి, ‘సప్తస్వరాలు’ సినిమా నిర్మించారు. ఇందులో కొంత పౌరాణికం, కొంత జానపదం సమ్మిళితమై ఉంటాయి. సినిమా నిర్మాణ వ్యయం ఆరు లక్షలు దాటింది. అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. సినీరాజకీయ కారణంతో భావనారాయణ ‘లవ్‌ ఇన్‌ ఆంధ్రా’ తీసి కాంతారావు సినిమాకి పోటీగా విడుదల చేశారు. దాంతో ప్రాంతీయ భావాలు పెచ్చురిల్లి రెండు సినిమాలూ ఘోరంగా దెబ్బతిన్నాయి. కాంతారావు మరో చిత్రాన్ని నిర్మించి నష్టాలు పూడ్చుకో వచ్చని కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ దర్శకత్వంలో ‘గండర గండడు’ అనే చిత్రాన్ని నిర్మించారు. సినిమా విజయవంతమైంది. కానీ ‘సప్త స్వరాలు’ మిగిల్చిన నష్టం పూడలేదు. అందుకోసం 1971లో కె.ఎస్‌. ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో క్రైస్తవుల ఇతివృత్తం గల ‘ప్రేమజీవులు’ అనే సాంఘిక చిత్రాన్ని కృష్ణ హీరోగా, రాజశ్రీ హీరోయిన్‌గా నిర్మించారు. అందులో కాంతారావుది నటనకు అవకాశమున్న గ్లామర్‌ లేని పాత్ర. గుమ్మడి ఈ సినిమాను తీయవద్దని వారిస్తున్నా కాంతారావు ఆ సలహాను తేలికగా తీసుకున్నారు. చిత్రం ఘోరంగా విఫలమైంది.

ఇంత నష్టం వాటిల్లినా, ఆ తర్వాత పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి ‘గుండెలు తీసిన మొనగాడు’ (1974) చిత్రాన్ని కలర్‌లో నిర్మించారు. చక్రవర్తి దర్శకుడు. ఆ సినిమా కాంతారావును అన్నివిధాలా  నష్ట పరిచి ఏకంగారూ.16 లక్షల అప్పును మిగిల్చింది. అపురూపంగా కట్టుకున్న ఇల్లు అమ్మి అప్పు తీర్చాల్సి వచ్చింది. అయినా, వెనక్కి తగ్గని కాంతారావు 1989 లో ‘స్వాతిచినుకులు’ సినిమా నిర్మించి అన్ని ఆస్తులు, నగలు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అప్పుల ఊబిలో కూరుపోయారు. ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటిస్తూ, క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ 22 మార్చి 2009న హైదరాబాదులో మరణించారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.