
వెక్కిరించి తుర్రుమనే తుంటరి ఎలుక...
వెంటపడి వేధించే కొంటె పిల్లి...
రెండూ కలసి పరిగెడుతూనే ఉన్నాయి...
ఎన్నాళ్ల నుంచి అనుకుంటున్నారు?
80 ఏళ్ల నుంచి! అయినా ఎలుక అలసిపోదు... పిల్లి విసిగిపోదు...
అందుకనే ఇవి మళ్లీ వెండితెరపై కనువిందు చేయనున్నాయి!
మరి ఈ పిల్లీ ఎలుకల కథేంటో చూద్దామా?
‘టామ్ అండ్ జెర్రీ’... ఈ పేరు వినని వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉండరనడంలో సందేహం లేదు. ముత్తాతల తరం నుంచి మునిమనవల తరం వరకు వీటిని చూసి మురిసిపోని వారు లేరు. ఏనాటి టామ్? ఏనాటి జెర్రీ? ఎప్పుడో 1940ల నాటి మాట. కార్టూన్ పాత్రలు విపరీతంగా ఆకట్టుకుంటున్న రోజులవి. అప్పుడప్పుడే మొదలైన యానిమేషన్ సినిమాలను ప్రేక్షకులు విరగబడి చూస్తున్న కాలమది. అమెరికాలో విలియం హన్నా, జోసెఫ్ బార్బెరా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ప్రపంచంలోనే పురాతనమైన ఫిలింస్టూడియోస్ ‘ఎమ్జీఎమ్’ (మెట్రో గోల్డ్విన్ మేయర్ స్టూడియోస్) కంపెనీలో పనిచేసేవారు. కొత్త కార్టూన్ పాత్రలను సృష్టించాలనే కంపెనీ ప్రతిపాదనపై ఇద్దరూ కలిసి తొలిసారిగా ఈ పిల్లీ ఎలుకలకు రూపం ఇచ్చారు. వీటితో రూపొందించిన ఓ చిత్రాన్ని 1940 ఫిబ్రవరి 10న విడుదల చేశారు. తర్వాత వీటికి పేరు పెట్టాలని కోరుతూ పోటీ పెట్టారు. జాన్కార్ అనే యానిమేటర్ వీటికి టామ్, జెర్రీ అని పేరు పెట్టి 50 డాలర్ల బహుమతి పొందాడు. ఆ కొంటె పిల్లి టామ్ అయితే, ఆ తుంటరి ఎలుక జెర్రీ. ఇక అప్పట్నుంచి మొదలైంది వీటి పరుగు. ఆపై ఇవి రెండూ కలిసి సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.
* హన్నా, బార్బెరాలు 1940 నుంచి 1958 వరకు 114 టామ్ అండ్ జెర్రీ చిత్రాలు రూపొందించారు.
* టామ్, జెర్రీలు తమ సృష్టికర్తలకు 7 ఆస్కార్లు సంపాదించిపెట్టాయి.
* ఆ తర్వాత వేరే యానిమేటర్లు వీటితో మరో 50 సినిమాలు తీశారు.
* అత్యధిక వసూళ్లు సాధించిన షార్ట్ ఫిలిం సిరీస్‌గా ‘టామ్ అండ్ జెర్రీ’ రికార్డు సృష్టించింది.
కొత్త చిత్రం కథేంటి?
ఇన్నాళ్లూ ఇంట్లోని కలుగులో ఉంటూ ఎలుక, దాన్ని తరుముతూ పిల్లి చేసే గోలను భరించలేక, ఆ ఇంటి యజమాని వాటిని బయటకి తరిమేస్తాడు. దాంతో అవి న్యూయార్క్‌లో ఓ ఫ్యాన్సీ హోటల్‌కి చేరుకుంటాయి. అక్కడ నానా అల్లరీ చేస్తాయి. దాంతో ఆ హోటల్లో పని చేసే మారెజ్ ఉద్యోగం పోతుంది. టామ్ అండ్ జెర్రీలను తరిమేస్తేకానీ ఉద్యోగం నిలబడదు. ఆ పరిస్థితుల్లో చివరికి ఏం జరిగిందనేదే కథ. ఇందులో ఈ తుంటరి ఎలుక, కొంటె పిల్లి కలసి ఎలాంటి సందడి చేశాయో చూడాలంటే మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే.
కార్టూన్ నుంచి లైవ్ యాక్షన్ వరకు
టామ్, జెర్రీలు కార్టూన్ పాత్రల నుంచి మొదలై బుల్లి తెర మీదుగా యానిమేషన్ చిత్రాల వరకూ తమ అల్లరితో అలరించాయి. వెండితెరపై ఆమూల నుంచి ఈమూల వరకు పరుగులు పెట్టి థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేశాయి. తొలిసారిగా ‘టామ్ అండ్ జెర్రీ: ద మూవీ’ సినిమా 1992లో విడుదలై విజయవంతమైంది. మరో పదమూడు వీడియో మూవీలు నేరుగా విడుదలై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఓ కొత్త సినిమా వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి రానుంది. దీన్ని లైవ్ యాక్షన్, యానిమేషన్ కామెడీ చిత్రంగా రూపొందించనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. టిమ్ స్టోరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చోలే గ్రేస్ మారెజ్, మైకేల్ పెనా, కెన్ జియోంగ్ తదితరులు నటించనున్నారు. అలాగే భారతీయ తల్లిదండ్రులకు ఆస్ట్రేలియాలో పుట్టిన పల్లవి శార్డా ఇందులో నటిస్తోంది. మిస్ ఆస్ట్రేలియాగా గెలిచిన ఈమె బాలీవుడ్లో ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘బేషరమ్’, ‘హవాయి జాదా’, ‘బేగమ్ జాన్’ సినిమాల్లో నటించింది.