రెండు ‘భూకైలాస్‌’లు... మధ్యలో ఓ నిర్మాత! - 63 years for nataratna ntr natasamrat anr mythological classic bhookailas
close
Published : 20/03/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు ‘భూకైలాస్‌’లు... మధ్యలో ఓ నిర్మాత!

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా నిర్మాణానికి కళాత్మకమైన భావాలు ఉంటే సరిపోదు. కాలం కలిసి రావాలి. ప్రముఖ నిర్మాత ఎ.వి.మెయ్యప్పన్‌ చెట్టియార్‌ కళల పట్ల ఆసక్తి, చిత్ర నిర్మాణం పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలతో పోటీ పడ్డారు. విజయాలు సాధించారు. అయితే చిత్ర నిర్మాణ రంగంలో అడుగు పెట్టిన తొలి రోజుల్లో అన్నీ అపజయాలే ఎదురయ్యాయి. కానీ, అధైర్యపడలేదు. పోయిన దగ్గరే వెతుక్కోవాలి అనే సిద్ధాంతం నమ్మారు. తమిళ సినిమాలు కలిసి రాలేదు. తెలుగు సినిమాలు కలిసి వస్తాయేమోనని 1940లో ‘భూకైలాస్‌’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. పంపిణీదారులు ముందుకు రాలేదు. వెంటనే ఒక సినిమా హాలు అద్దెకు తీసుకొని ఆ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేక్షకులు కనక వర్షం కురిపించారు. తనకు మార్గం చూపిన తెలుగు సినిమాను ఆ నిర్మాత మరిచి పోలేదు. కోడంబాక్కంలో అతిపెద్ద స్టూడియో నిర్మించి, గొప్ప నిర్మాతగా అవతారమెత్తినా అదే నిరాడంబరతను కొనసాగిస్తూ, మళ్లీ అదే ‘భూకైలాస్‌’ చిత్రాన్ని రెండోసారి 1958లో నిర్మించి మరొకసారి విజయాన్ని నమోదు చేశారు. ఆ చిత్రం అటు తమిళంలో ఇటు కన్నడంలో కూడా సూపర్‌ హిట్టయింది. ఎన్టీఆర్, ఏయన్నార్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై శనివారంతో 63ఏళ్లు పూర్తయ్యాయి.

ఏవీఎం బ్యానర్‌ మీద ఎ.వి.మెయ్యప్పన్‌ రెండోసారి ‘భూకైలాస్‌’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. కె.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుదర్శనం, గోవర్దనం సోదరులు సంగీత దర్శకత్వం నిర్వహించారు. సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటలు, మాధవ బుల్‌ బులే ఛాయాగ్రహణం అందించారు. 20 మార్చి 1958న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో నందమూరి తారక రామారావు రావణాసురుడుగా, అక్కినేని నాగేశ్వరరావు నారదుడుగా, జమున మండోదరిగా, ఎస్‌.వి.రంగారావు మయాసురుడుగా, నాగభూషణం పరమశివుడుగా, బి.సరోజాదేవి పార్వతిగా, హేమలత కైకసిగా, మహంకాళి వెంకయ్య కుంభకర్ణుడుగా నటించగా, గోపీకృష్ణ, హెలెన్‌లు న్యాట్య తారలుగా వ్యవహరించారు. కర్ణాటకలోని గోకర్ణక్షేత్ర స్థలపురాణం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు.

1959లో తమిళంలోకి ‘భక్త రావణ’ పేరుతో డబ్‌ చేశారు. సినిమా గొప్పగా ఆడింది. కన్నడంలో మాత్రం తెలుగు సినిమాతో సమాంతరంగా ఏవీఎం వారే ‘భూకైలాస’ పేరుతో నిర్మించారు. తెలుగు సినిమా కన్నా ముందుగా... అంటే 5 ఫిబ్రవరి 1958న ఈ సినిమా కర్ణాటకలో విడుదలైంది. ఇందులో రావణాసురుడుగా రాజకుమార్, నారదుడుగా కళ్యాణ్‌ కుమార్, మండోదరిగా జమున, పరమశివుడుగా అశ్వత్థ, పార్వతిగా బి.సరోజాదేవి, కైకసిగా హేమలత, మాయాసురుడుగా ఎస్‌.వి. రంగారావు, కుంభకర్ణుడుగా గురుసిద్ధయ్య, బాలగణపతిగా మాస్టర్‌ బాజీ నటించారు. కె.ఆర్‌. సీతారామశాస్త్రి మాటలు, పాటలు రాయగా, సుదర్శనం, గోవర్ధనం సోదరులు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నటి జమున వ్యవహారశైలి నచ్చక ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఆమెతో నటించడం బహిష్కరించి మూడున్నర ఏళ్ల తర్వాత నాగిరెడ్డి - చక్రపాణిల జోక్యంతో మళ్లీ ‘గుండమ్మ కథ’ సినిమాలో కలిసి నటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని