రివ్యూ: డిస్కోరాజా
నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్, బాబీ సింహా, రాంకీ, సునీల్, నరేష్, సత్య, గిరిబాబు, అన్నపూర్ణమ్మ తదితరులు.
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: తమన్
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్
విడుదల: 24 జనవరి 2020
రవితేజ విజయాన్ని చూసి చాలా రోజులైంది. ఎప్పుడూ మాస్ కథలతోనే సినిమాలు చేసే ఆయన ఈసారి రూటు మార్చారు. సైంటిఫిక్ అంశాలతో కూడిన ఓ యాక్షన్ కథని ఎంచుకున్నారు. రవితేజ - వి.ఐ.ఆనంద్ కలయికలో సినిమా అనగానే ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన ఆసక్తి వ్యక్తమైంది. విభిన్నమైన కథలతో సినిమాలు చేసే దర్శకుడిగా వి.ఐ.ఆనంద్కి పేరుంది. మరి ఈ కొత్త కలయికలో వచ్చిన ‘డిస్కోరాజా’ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథేంటంటే: తీసుకున్న అప్పు కట్టే పనిలో ఉన్న వాసు (రవితేజ) కిడ్నాప్‌కి గురవుతాడు. ఇంతలోనే మంచు కొండల్లో గడ్డకట్టుకుపోయిన ఓ మృతదేహం లద్దాఖ్‌లో దొరుకుతుంది. దాన్ని సొంతం చేసుకున్న శాస్త్రవేత్తలు ప్రయోగం మొదలుపెడతారు. ఆ దేహానికి మళ్లీ ప్రాణం పోస్తారు. కానీ అతనెవరన్నది మాత్రం కనిపెట్టలేరు. అతడికి స్పృహ వచ్చినప్పటికీ గతాన్ని మరిచిపోతాడు. ఇంతలోనే డిస్కోరాజ్ తనయుడే వాసు అని భావించి అతన్ని అంతం చేయడానికి పూనుకుంటుంది బర్మాసేతు గ్యాంగ్. ఇంతకీ డిస్కోరాజ్ ఎవరు? అతనికీ వాసుకీ సంబంధమేమిటి? 1980ల్లో డిస్కోరాజ్కీ, బర్మాసేతుకీ మధ్య ఏం జరిగింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ఫ్లాష్ బ్యాక్‌లతో కూడిన డాన్ కథలు, ప్రతీకార నేపథ్యంతో కూడిన కథలు తెలుగు సినిమాకి కొత్త కాదు. కానీ అలాంటి కథని సైన్స్ ఫిక్షన్ అంశాలతో ముడిపెట్టడమే ఈ సినిమా ప్రత్యేకం. 1980వ దశకానికీ, వర్తమానానికీ ముడిపెట్టి కథని నడిపించిన తీరు కూడా మెప్పిస్తుంది. వి.ఐ.ఆనంద్ మార్క్ మలుపులు, థ్రిల్లింగ్ అంశాలతోనే కథ మొదలవుతుంది. వాసు కనిపించకపోవడం, అదే సమయంలో ల్యాబ్‌లో ప్రయోగాల్ని చూపెడుతూ కథలో లీనం చేశాడు దర్శకుడు. ప్రయోగాలు ఫలించాక మెమరీ లాస్ కావడం, ఆ నేపథ్యంలో పండే కామెడీ మంచి కాలక్షేపాన్నిస్తుంది. ఎప్పుడైతే సేతు తెరపైకొస్తాడో అప్పట్నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. విరామం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో మలుపు కూడా మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయిన కథలో మలుపులు, డ్రామా కూడా మెప్పిస్తుంది. డిస్కోరాజాకీ, హెలెన్కీ మధ్య ప్రేమ కథని నడిపిన తీరు.. డిస్కోరాజాకీ, సేతుకీ మధ్య జరిగిన పోరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. కానీ అప్పటిదాకా సైన్స్‌తో ముడిపడిన కథ కాస్త, సాధారణ ప్రతీకార కథగా మారిపోవడమే సినిమాకి మైనస్‌గా మారింది. సన్నివేశాలన్నీ కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగిపోతుంటాయి. పతాక సన్నివేశాల్లో మలుపు మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. రవితేజ కనిపించిన విధానం, ఆయన నటన, ఆ పాత్రలోని హుషారు ఆకట్టుకుంటుంది. రవితేజ - వెన్నెలకిషోర్ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శకుడు ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకుని, వీలైనన్ని మలుపులు జోడించినప్పటికీ.. కథనాన్ని ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే: రవితేజ వన్ మేన్ షో అని చెప్పొచ్చు. ఆయన పాత్రలో పలు కోణాలు కనిపిస్తాయి. వాటన్నింట్లోనూ చక్కగా ఒదిగిపోయాడు. డాన్‌గా, వాసు అనే ఒక సాధారణ యువకుడిగా చాలా బాగా నటించాడు. ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, తాన్య హోప్ తదితర కామెడీ గ్యాంగ్‌తో కలిసి బాగా నవ్వించాడు. ద్వితీయార్ధంలో డిస్కోరాజ్‌గా కనిపించిన విధానం ఇంకా బాగుంటుంది. బాబీ సింహా నటన చిత్రానికి ప్రధాన బలం. బర్మా సేతుగా ఆయన పాత్రకి ప్రాణం పోశాడు. విలనిజం బాగా పండింది. సునీల్ నటన, ఆయన పాత్రని తీర్చిదిద్దిన విధానం సినిమాకి ప్రధాన ఆకర్షణ. పాయల్ రాజ్‌పుత్ మాటలు కూడా లేకుండా హెలెన్‌గా చక్కటి అభినయం ప్రదర్శించింది. అందంతోనూ, పాతకాలంనాటి లుక్‌తోనూ కట్టిపడేస్తుందామె. నభా నటేష్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ తొలి పాటలో ఆమె అందంగా కనిపించింది. సాంకేతిక విభాగం మంచి పనితీరుని కనబరిచింది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను, లద్దాఖ్ నేపథ్యాన్ని చాలా బాగా చూపించారు. తమన్ సంగీతం సినిమాకి మరింత బలాన్నిచ్చింది. ఇతర విభాగాలు కూడా సమష్టిగా పనిచేశాయి. దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఒక కొత్త నేపథ్యంలో కథని రాసుకున్న విధానం బాగుంది కానీ, సినిమాపై సైన్స్ ఫిక్షన్ ప్రభావం తక్కువగా ఉండటంతో ఇదొక సాధారణ ప్రతీకార సినిమా అయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు | బలహీనతలు |
+రవితేజ నటన | -కథ |
+సైన్స్ ఫిక్షన్ నేపథ్యం | -ద్వితీయార్ధం |
+మలుపులు |
చివరిగా: డిస్కోరాజా.. రవితేజ వన్ మేన్ షో
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!
మరిన్ని
కొత్త సినిమాలు
-
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య
- తగిన జాగ్రత్తలతో..సెట్లోకి ‘సర్కారు..’
- రవితేజ కొత్త చిత్రం ప్రారంభం
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
-
బన్ని- కొరటాల కాంబో: స్పందించిన నిర్మాత
గుసగుసలు
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
- కవల నాయికలతో ఆటపాట?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
ఇంటర్వ్యూ
-
‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం