నటుడిగా నా తొలిసీన్‌ అదే! - Nani about his first movie experience
close
Published : 23/07/2021 13:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటుడిగా నా తొలిసీన్‌ అదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి, నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నాని. అంతేకాదు అభిమానులతో ‘నేచురల్‌ స్టార్‌’ అని కూడా అనిపించుకున్నారు. మరి మీరు తొలిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారని అడిగితే, ఇదిగో ఇలా అంటూ చెప్పుకొచ్చారు. ‘‘తొలి సినిమా చేస్తున్నప్పుడు మనసులో సవాలక్ష సందేహాలొచ్చేవి. దర్శకుడు అనుకున్నట్టుగానే నటిస్తున్నానా? పాత్రకి న్యాయం చేస్తున్నానా? అనే భయాలు వెంటాడేవి. చాలా మంది తొలి సినిమా సమయంలో కెమెరా అనేసరికి భయపడుతుంటారు. నాకు ఆ సమస్య లేదు. సహాయ దర్శకుడిగా పని చేసినవాణ్ని, కెమెరా అసిస్టెంట్లు, తోటి సహాయ  దర్శకులతో కలిసి కూర్చుని భోజనాలు చేసినవాణ్ని. దాంతో యూనిట్‌, కెమెరాలు ఆ వాతావరణం నాకు అలవాటే. అందుకే ఎప్పుడైనా కెమెరా ముందుకి ఆత్మవిశ్వాసంతో వెళ్లేవాణ్ని. ఏమాత్రం స్పష్టత లేకుండా ‘అష్టాచమ్మా’ కోసం తొలి రోజు సెట్లోకి అడుగుపెట్టా’’ 

‘‘కాఫీ షాప్‌లో స్వాతిని కలవడానికి వెళ్లే సన్నివేశం కోసమే తొలిసారి నటుడిగా కెమెరా ముందుకు వెళ్లా. అవసరాల శ్రీనివాస్‌ కాఫీ షాప్‌లో నుంచి స్వాతికి నన్ను చూపించడంతో, హాయ్‌ చెబుతూ అక్కడికి వెళ్లే సన్నివేశం అది. పెద్దగా ఇబ్బంది లేకుండానే ఆ సన్నివేశాన్ని పూర్తి చేశా. అప్పటికి ఆ షాట్‌ దాటడమే నా ముందున్న గండం. ఈ  షాట్‌ తర్వాత ఏం చేయాలి, ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుందా... ఇలాంటి ఆలోచనలేవీ లేవు. తొలి మూడు నాలుగు సినిమాల వరకూ ‘ఈ సినిమా ఆడితే ఇంకొక సినిమా వస్తుందేమో’ అనుకుని చేయడమే తప్ప, ఇంత ఆదరణ, ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఊహించలేదు’’

‘‘ప్రేక్షకులతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిన తర్వాత మనదిక్కడ పూర్తిస్థాయి ప్రయాణమే అన్న  నమ్మకం ఏర్పడింది. తొలి సినిమా సమయంలో నేనెలా చేస్తున్నానో తెలియదు కానీ, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాత్రం ‘బాగుంది’ అంటూ మరో షాట్‌కి వెళ్లేవాళ్లు. ఆయన పక్కనున్నారంటే నటులకైనా, సాంకేతిక బృందానికైనా ఎన్ని సందేహాలున్నా ఇట్టే తొలగిపోతాయి. 120 శాతం ప్రతిభ కనబరిచేలా ఆయన అందరినీ ప్రోత్సహిస్తుంటారు.  ‘అష్టాచమ్మా’ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం’’.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని