close
ఇంటర్వ్యూ
వెంకీ మామతో నటన.. భయపడ్డా: చైతన్య

అందుకే సీనియర్లతో పనిచేస్తున్నా

హైదరాబాద్‌: తన మామయ్య విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించేందుకు తొలుత కష్టపడ్డానని, కాస్త భయం కూడా ఉండేదని కథానాయకుడు నాగచైతన్య చెప్పారు. వెంకీ, చైతూ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. డిసెంబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చైతన్య విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

అది వరం
‘సురేష్ మామ నుంచి కెమెరా వెనుక విష‌యాలు నేర్చుకున్నా. వెంకీ మామ నుంచి కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్చుకున్నా. సురేష్ మామకి సినిమాకి సంబంధించిన ప్రతి విష‌యంలోనూ మంచి ప‌రిజ్ఞానం ఉంది. ఆయ‌న్ని చూస్తూ చాలా విష‌యాలు నేర్చుకున్నా. వెంకీమామ నుంచి వ్యక్తిగా ఎలా ఉండాలో నేర్చుకున్నా. సెట్‌లో ఆయ‌న న‌డుచుకునే విధానం చాలా బాగుంటుంది. నిశ్శబ్దంగా, సంతోషంగా, పాజిటివిటీతో క‌నిపిస్తుంటారు. ఆయ‌న్ని ద్వేషించేవాళ్లు ఎవ్వరూ ఉండ‌రు. అదెందుకో ఈ సినిమా చేస్తూ ఇంకా బాగా తెలుసుకున్నా. ఇక న‌టుడిగా అంటారా? ఆయ‌న‌తో క‌లిసి కామెడీ చేయ‌డ‌మ‌నేది ఏ న‌టుడికైనా ఒక వ‌రం. భావోద్వేగాల ప‌రంగా కూడా ఆయ‌న్నుంచి చాలా నేర్చుకున్నా’.

వాళ్ల కోపం మంచిదే
‘ఈ సినిమా సెట్స్‌లో మామ‌య్య నాపై కోపం తెచ్చుకున్నారు. వాళ్లకి ఊరికే కోపం ఎప్పుడూ రాదు. సురేష్ మామైనా, వెంకీ మామైనా ప్లాన్‌ ప్రకారం పనులు జర‌గ‌క‌పోతే ఒప్పుకోరు. ఆ క్షణంలోనే వాళ్లకి కోపం వస్తుంది. ఆ కోపం కూడా మంచిదేనండీ. అంకిత భావ‌ం, సమ‌ర్థత నుంచే అలాంటి కోపం వ‌స్తుంటుంది’.

కష్టంగానే..
‘వెంకీ మామైనా, నేనైనా నిజ జీవితంలో చాలా రిజ‌ర్వ్‌గా ఉంటాం. ఎక్కువ‌గా మాట్లాడుకోం. మా నిశ్శబ్దంలోనే ఒక‌రిపై ఒక‌రికున్న ప్రేమ క‌నిపిస్తుంటుంది. సినిమాలో మాత్రం బోలెడ‌న్ని డైలాగులు చెప్పడంతోపాటు, ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపించాలి. అది కొత్తగా అనిపించింది. నాకైతే మామతో నటన ప‌ది రోజులు క‌ష్టంగానే అనిపించింది. 30 ఏళ్లు ఇంట్లో ఒక ర‌కంగా పెరిగాను. మామపై ఒక ప్రత్యేక‌మైన గౌర‌వంతో, చాలా క్రమ‌శిక్షణ‌తో మెలిగాను. సెట్స్‌పైకి వచ్చేస‌రికి అందుకు భిన్నంగా చేయాల్సి వ‌చ్చింది. పైగా ఆయ‌న ముందు త‌ప్పు చేయ‌కూడ‌దు, అంతా క‌రెక్ట్ చేయాల‌నే ఒక భ‌యం ఉంటుంది కాబ‌ట్టి స‌మ‌యం ప‌ట్టింది’.

కొత్తగా..
‘ఇందులో నేను ఓ కొత్త ర‌క‌మైన మాస్ పాత్రలో నటించా. మిల‌ట‌రీ ఆర్మీ ఎపిసోడ్‌ని నేనెప్పుడూ ఏ సినిమాలోనూ ట‌చ్ చేయ‌లేదు. కొత్త స్టైల్ హీరోయిజం, కొత్త స్టైల్ క‌మ‌ర్షియాలిటీ ఈ సినిమాలో ఉంటుంది. ఈ క‌థ‌లో నాకు అది బాగా న‌చ్చింది’. 

వారిని కలిశా..
‘సురేష్ ప్రొడక్షన్స్‌ నటీనటులకు ఎక్కువ సమయం ఇస్తుంది. ఈ చిత్రానికి సిద్ధం కావ‌డానికి నాకు ఏడాది స‌మ‌యం దొరికింది. ఆ క్రమంలో నిజ‌మైన ఆర్మీ అధికారుల్ని చాలా మందిని క‌లిశాం. క‌శ్మీర్‌కి వెళ్లి అక్కడి కంటోన్మెంట్ ఏరియాల్లో సినిమా చేశాం. అదొక మంచి అనుభూతి. నాకు చాలా విష‌యాలు తెలిశాయి. అక్కడ జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌ని నేను బాగా ఆస్వాదించా. చిత్ర బృందం మాత్రం చాలా క‌ష్టప‌డింది’.

ఎన్నో ఏళ్ల కల
‘నేను, మామయ్య కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. న‌టుడిగా ఇంకా అనుభ‌వం వ‌చ్చాక అదే సెట్ అవుతుంద‌ని అనుకున్నా. అందుకే మా చిత్రం గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌లేదు. సురేష్ ప్రొడ‌క్షన్స్‌లో సినిమా చేయాల‌ని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది క‌ల‌గానే ఉండిపోయింది. అయితే చివరికి ఈ రెండూ ఈ ఏడాదిలోనే క‌లిసొచ్చాయి. గ‌తేడాది ఒక‌సారి సురేష్ మామ ఫోన్ చేసి ఈ క‌థ చెప్పారు. అంత‌కుముందు ఆయ‌న ప‌ది, ఇవ‌రై క‌థ‌ల్ని నా ద‌గ్గరికి పంపించారు. కానీ ఏదీ సెట్ కాలేదు. చివ‌రికి ‘వెంకీ మామ’ రూపొందింది.

ఓ పాత్ర చేశానంతే..
‘ఈ సినిమాను నేను మల్టీస్టారర్‌గా భావించలేదు. వెంకీ మామ ప‌క్కన ఒక పాత్ర చేశానంతే. నేను ఆయ‌న అభిమానిని. ఆయ‌న‌పై గొప్ప గౌర‌వం ఉంది. ఈ సినిమా ప్రయాణంలో ఆయ‌న పక్కన ఒక పాత్ర చేశాననే ఫీలింగ్ క‌లిగింది. నా కెరీర్‌కి ఈ చిత్రం బలం అవుతుంది’.

అందుకే సీనియర్లతో..
‘సహజంగా ఉండే  క‌థ‌ల్నే నేను ఇష్టప‌డ‌తా. ఇటీవ‌ల కొత్త ద‌ర్శకుల కంటే కూడా అనుభ‌వ‌మున్న ద‌ర్శకుల‌తో సినిమాలు చేయ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నాను. కొత్తత‌రం మంచి క‌థ‌ల‌తో వ‌స్తున్నారు. నేను కూడా కొన్ని చేశాను, కానీ అవి స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వలేదు. అలాగ‌ని కొత్తవాళ్లపై న‌మ్మకం లేద‌ని కాదు. వాళ్లతో పోలిస్తే నేను సీనియ‌ర్‌గా క‌నిపిస్తుంటా. దాంతో వాళ్లు నాతో పనిచేసేట‌ప్పుడు మొహ‌మాటం కొద్దీ నాతో ప‌రిమితంగా ప‌నిచేయించుకుంటారు. దానివ‌ల్ల నాలోని ఉత్తమ నటన బయటికి రావ‌డం లేదు. నేను దర్శకుల నటుడిని. వాళ్లు ఎంత చెబితే అంతే చేస్తుంటా. అనుభ‌వ‌మున్న ద‌ర్శకులైతే మొహ‌మాటం లేకుండా నా నుంచి రాబ‌ట్టుకుంటారు కాబ‌ట్టి వాళ్లతోనే ప‌నిచేస్తున్నా. ప్రస్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శకత్వంలో సినిమా చేస్తున్నా. అదొక అంద‌మైన ప్రేమ‌క‌థ‌. తదుపరి సినిమాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు’.

 Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.