close
సినిమా రివ్యూ
రివ్యూ: వెంకీ మామ‌

చిత్రం: వెంకీ మామ
న‌టీన‌టులు: వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, ప్రకాశ్‌రాజ్‌, రావు ర‌మేశ్‌, హైప‌ర్ ఆది, చ‌మ్మక్ చంద్ర, త‌దిత‌రులు
ద‌ర్శక‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌
సంగీతం: త‌మ‌న్‌
ఛాయాగ్రహ‌ణం: ప్రసాద్ మూరెళ్ల
కూర్పు: ప‌్రవీణ్ పూడి
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుద‌ల‌: 13 డిసెంబ‌రు 2019

మామా అల్లుళ్ల క‌ల‌యిక‌లో సినిమాగా.. మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా.. ప్రారంభ‌మైన రోజు నుంచే అంచ‌నాలు రేకెత్తించిన చిత్రం ‘వెంకీమామ‌’. త‌న కుటుంబ క‌థానాయ‌కుల్ని క‌లిపి సినిమా తీయాల‌నేది అగ్ర నిర్మాత రామానాయుడు క‌ల‌. అది చాలా రోజుల త‌ర్వాత ‘వెంకీమామ‌’తో సాకార‌మైంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లయిన వెంకీ, నాగ‌చైత‌న్య తెర‌పై కూడా అదే పాత్రల్లో సంద‌డి చేశారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందంటే..

క‌థేంటంటే: వెంక‌ట‌ర‌త్నం నాయుడు అలియాస్ మిల‌ట్రీ నాయుడు (వెంక‌టేష్‌) అంటే ఆ ఊళ్లో  ప్రత్యేక‌మైన గౌర‌వం. ఆయ‌నకి మేన‌ల్లుడు కార్తీక్(నాగ‌చైత‌న్య‌) అంటే ప్రాణం. అమ్మానాన్నలు చిన్నప్పుడే చ‌నిపోవ‌డంతో కార్తీక్‌కి అన్నీ తానై పెంచుతాడు మామ వెంక‌ట‌ర‌త్నం నాయుడు. నాయుడు తండ్రి రామనారాయ‌ణ(నాజ‌ర్‌) జాత‌కాల్లో ఆరితేరిన‌వాడు. కార్తీక్ జాతకం వ‌ల్ల నాయుడు ప్రాణాల‌కి ముప్పు ఉంద‌ని గ్రహిస్తాడు. కార్తీక్ నీడ కూడా మ‌న ఇంటి మీద ప‌డ‌కూడ‌దంటాడు రామ నారాయ‌ణ‌. కానీ అవేవీ ప‌ట్టించుకోకుండా త‌న మేన‌ల్లుడికి అండ‌గా నిలుస్తాడు నాయుడు. ఎప్పుడూ త‌న మామ‌తో పాటే ఉండే కార్తీక్ ఆయ‌న‌కి చెప్పకుండా వెళ్లిపోతాడు. మిల‌ట‌రీలోకి వెళ్లాడ‌ని తెలుసుకున్న వెంక‌ట‌ర‌త్నం.. త‌న అల్లుడిని వెదుక్కుంటూ వెళ‌తాడు. ఆ క్రమంలో క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో ఆయ‌న‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. కార్తీక్ ఎందుకు మిల‌ట‌రీలోకి వెళ్లాల్సి వ‌చ్చింది?  వెన్నెల(పాయ‌ల్ రాజ్‌ఫుత్‌), హారిక(రాశీఖ‌న్నా) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: మామా అల్లుళ్ల బంధం, వారి మ‌ధ్య అనుబంధాలే ప్రధానంగా తెర‌కెక్కిన చిత్రమిది. వాటికి ఆర్మీ నేప‌థ్యాన్ని, జాత‌కాల్ని ముడిపెట్టిన విధానం చిత్రాన్ని ఆస‌క్తిక‌రంగా మార్చేసింది. జాత‌కాల ప్రభావం, ఆర్మీ ఎపిసోడ్‌తోనే క‌థ‌ని మొద‌లు పెట్టారు. అక్కడ్నుంచి క‌థ ప‌ల్లెటూరికి మ‌ళ్లాక‌, మామా అల్లుడు క‌లిశాక సంద‌డి మొద‌ల‌వుతుంది. ఒకరిపై మ‌రొక‌రు చూపించుకునే ప్రేమ‌, మామకి త‌గిన జోడీని వెదికి పెట్టాల‌ని అల్లుడు ప్రయ‌త్నించ‌డం, అల్లుడి ప్రేమ‌క‌థ‌ని కంచికి చేర్చాల‌ని మామ చేసే హంగామాతో న‌వ్వులు పండుతాయి. రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌ల పాత్రలు వ‌చ్చీ రావ‌డంతోనే క‌థ‌లో జోష్ వ‌స్తుంది. వాళ్ల పాత్రల సాయంతో మంచి హాస్యం పండించే ప్రయ‌త్నం చేశారు.

ముఖ్యంగా వెంక‌టేష్ శైలి వినోదం ఇందులో పుష్కలంగా ఉంది. త‌న‌కి త‌గ్గ పాత్ర కావ‌డంతో వెంక‌టేష్ మ‌రింత ఉత్సాహంగా న‌టించారు. ఆయ‌న‌కి అల్లుడిగా నిజ జీవిత పాత్రలోనే నాగ‌చైత‌న్య న‌టించ‌డం సినిమాకి క‌లిసొచ్చింది. వాళ్లిద్దరి మ‌ధ్య పండిన భావోద్వేగాలు, హాస్యంతో ప్రథ‌మార్ధం మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో మిల‌ట‌రీ నేప‌థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. భావోద్వేగాలు పండాయి కానీ.. ప్రథ‌మార్ధం త‌ర‌హా హాస్యం లేక‌పోవ‌డం, ఆర్మీ ఎపిసోడ్‌లోనూ కొత్తద‌నం లేక‌పోవ‌డం, కొన్ని స‌న్నివేశాలు మ‌రీ నాట‌కీయంగా అనిపించ‌డంతో అప్పటిదాకా ఉన్న ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఊరి రాజ‌కీయం, ఎమ్మెల్యే పాత్రలో రావు ర‌మేష్ విల‌నిజం పెద్దగా ప్రభావం చూపించ‌వు. పాట‌లు, వాటి చిత్రీక‌ర‌ణ మెప్పిస్తాయి. క‌థ‌లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో కొత్తద‌నం లేక‌పోయినా, పాత బంధాల్ని, భావోద్వేగాల్ని స‌రికొత్తగా ఆవిష్కరించే ప్రయ‌త్నం చిత్రంలో క‌నిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: వెంక‌టేష్ మామ పాత్రలో ఒదిగిపోయారు. ఆయ‌న నట‌న‌, పాత్రే సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచింది. హాస్యం, భావోద్వేగాల్ని పండించ‌డంలో మ‌రోసారి తన ప్రత్యేక‌త‌ని ప్రద‌ర్శించారు. నాగ‌చైత‌న్య అల్లుడిగా భిన్న పార్శ్వాలున్న పాత్రను చేశాడు. ఆర్మీ మేజ‌ర్‌గా, ప‌ల్లెటూరిలో మామ చాటు అల్లుడిగా హుషారుగా క‌నిపించాడు. మామ‌తో క‌లిసి న‌వ్వుల్ని పండించిన విధానం కూడా మెప్పిస్తుంది. రాశీఖ‌న్నా ఎమ్మెల్యే కూతురిగా అందమైన పాత్రలో క‌నిపిస్తుంది. ఆమెతోపాటు, స్కూల్ టీచ‌ర్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా అందంగా క‌నిపించింది. ఇద్దరు కూడా పాత్రల ప‌రిధి మేర‌కు చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. హైప‌ర్ ఆది, చ‌మ్మక్ చంద్ర‌, విద్యుల్లేఖ రామ‌న్ త‌దిత‌రులు వినోదం పండించడంలో త‌మ వంతు పాత్రని పోషించారు. రావు ర‌మేష్‌, ప్రకాష్‌రాజ్‌, నాజ‌ర్‌, గీత‌, దాస‌రి అరుణ్ కుమార్ త‌దిత‌రుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ, ప‌రిధి మేర‌కు మెప్పించే ప్రయ‌త్నం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా ప‌ల్లెటూరి నేప‌థ్యాన్ని ఎంత బాగా చూపించిందో, మిల‌ట‌రీ నేప‌థ్యంలో వ‌చ్చే క‌శ్మీర్ అందాల్ని, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ ఎపిసోడ్‌ని అంత బాగా చూపించింది. త‌మ‌న్ సంగీతం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ద‌ర్శకుడు బాబీ క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా చెప్పడంలో విజ‌య‌వంత‌మ‌య్యారు. ప‌తాక స‌న్నివేశాల విష‌యంలో ఆయ‌న మ‌రిన్ని క‌స‌ర‌త్తులు చేయాల్సింది.  
బ‌లాలు
క‌థ‌నం
ప్రథ‌మార్ధంలో వినోదం, భావోద్వేగాలు  
+ మామా అల్లుళ్ల పాత్రలు
బ‌ల‌హీన‌త‌లు
-
ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా: న‌మ్మకాల కంటే ప్రేమ గొప్పద‌ని చెప్పే ‘వెంకీ మామ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

 

 Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.