ఆ సీన్‌ రివీల్‌ చేయడంపై సుకుమార్‌ ఏమన్నారంటే! - aadi about chiranjeevi revela his death in ragastalam
close
Updated : 01/03/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సీన్‌ రివీల్‌ చేయడంపై సుకుమార్‌ ఏమన్నారంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా విడుదలయ్యే వరకూ కొన్ని విషయాలను దాచి పెడుతుంటారు దర్శకులు, నటులు. తమ పాత్ర, దాని తీరుతెన్నుల గురించి చెప్పినా, సినిమాకు ఆయువుపట్టు అనిపించే మలుపులను ఎవ్వరూ రివీల్‌ చేయరు. అలా తెలిసిపోతే థియేటర్‌లో ప్రేక్షకుడికి థ్రిల్‌ ఉండదు. కొన్నిసార్లు చేసినా, వెండితెరపై దాన్ని ఎలా చూపించారన్నది ఆసక్తికరంగా చూస్తారు. ఈ విషయంలో అగ్ర దర్శకులైతే నటీనటులకు కఠిన ఆంక్షలు విధిస్తారు. ఇంటర్వ్యూలో పొరపాటున నోరు జారకుండా ఉండాలని ముందుగానే హెచ్చరిస్తారు. అయితే, కొన్నిసార్లు కొన్ని విషయాలు అలా దొర్లిపోతుంటాయి. ‘రంగస్థలం’ విషయంలో ఇదే జరిగింది.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. చిట్టిబాబు చరణ్‌ నటన సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇక లక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్‌బాబుగా ఆదిల నటన అందరినీ మెప్పించింది. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ‘రంగస్థలం’లోని ఓ విషయాన్ని పొరపాటున రివీల్‌ చేశారు. ‘ఆది చనిపోయినప్పుడు రామ్‌చరణ్‌ నటన కన్నీళ్లు తెప్పించింది’ అని వేదికపై అనేసరికి, ఆది పాత్ర చనిపోతుందని అందరికీ తెలిసిపోయింది. ఈ మాటతో అక్కడున్న నటీనటులతో పాటు, దర్శకుడు సుకుమార్‌ కూడా ఒక్కసారిగా కంగుతిన్నారు.

కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ విషయమై సుకుమార్‌తో జరిగిన సంభాషణను ఆది ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అయిపోయిన తర్వాత నేనూ, సుకుమార్‌ గారు ఒకే కారులో బయలుదేరాం. ‘ఏంటి ఆది.. ఇప్పుడు ఏం చేద్దాం’ అని సుకుమార్‌ అడిగారు. ‘నాకు తెలిసి, ఈ చిన్న విషయం సినిమాపై ప్రభావం చూపదనుకుంటున్నానండీ’ అని సమాధానం ఇచ్చా. అప్పుడు వెంటనే సుకుమార్‌ ‘ఇది కూడా ఒకందుకు మంచిదే అయింది. కుమార్‌బాబు పాత్రను ఎప్పుడు చంపుతారా? అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందా? అన్న ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి’ అన్నారు. నాకూ అదే కరెక్ట్‌ అనిపించింది. ఇక కుమార్‌బాబు చనిపోయిన సన్నివేశం అంత బాగా రావడానికి నాకు యోగా ఎంతగానో ఉపయోగపడింది. చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నటించడం వల్ల ఆ సీన్‌ చాలా సహజంగా వచ్చింది’’ అని ఆది చెప్పుకొచ్చారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని