Bhuj: The Pride of India Review; రివ్యూ: భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా - ajay devgn bhuj: the pride of india hindi movie review
close
Updated : 14/08/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bhuj: The Pride of India Review; రివ్యూ: భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా

చిత్రం: భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా; నటీనటులు: అజయ్‌ దేవ్‌గణ్‌, సంజయ్‌ దత్‌, శరద్ ఖేల్కర్‌, సోనాక్షి సిన్హా, అమ్మి వ్రిక్‌, ప్రణీత, నోరా ఫతేహి తదితరులు; సంగీతం: తనిష్‌ బాగ్చి(నేపథ్యం: అమర్‌ మోహిల్‌); ఎడిటింగ్‌: ధర్మేంద్ర శర్మ; సినిమాటోగ్రఫీ: అసీమ్‌ బజాజ్‌; రచన: అభిషేక్‌ దుదియా, రమణ్‌ కుమార్‌, రితేశ్‌షా, పూజా భవరియా; నిర్మాత: భూషణ్‌కుమార్‌, గిన్నీ కనూజా, కృష్ణన్‌కుమార్‌, కుమార్‌ మంగత్‌ పాఠక్‌, బన్నీ సంఘీ, వాజిష్‌సింగ్‌; దర్శకత్వం: అభిషేక్‌ దుదియా; విడుదల: డిస్నీ+ హాట్‌స్టార్‌

స్వాతంత్ర్యానికి ముందూ తర్వాత అఖండ భారతావని చరిత్రలో మరిచిపోలేని, నిత్య జీవనంలో స్ఫూర్తినింపే గాథలెన్నో ఉన్నాయి. తరచి చూస్తే, నేటి తరానికి, రాబోయే తరాలకు ఎప్పటికీ అవి విజయగాథలే. ఆ గాథలనే కథా వస్తువులుగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శక-నిర్మాతలు ఎందరో. ఆ కోవలోకి వచ్చేదే భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర కథ ఏంటి? సినిమా ఎలా ఉంది?

కథేంటంటే: తూర్పు పాకిస్థాన్‌(బంగ్లాదేశ్‌)లో పాక్‌ అరాచకాలను అంతం చేసేందుకు భారత్‌ తనవంతు సైనిక సాయం చేస్తుంది. ఇదే అదనుగా భావించిన పాకిస్థాన్‌ సైన్యం భారత సరిహద్దులో అతి తక్కువ బలగాలు ఉన్న ప్రాంతంపై దాడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందుకు గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ఉన్న ఎయిర్‌బేస్‌పై బాంబుల వర్షం కురిపించి నాశనం చేస్తుంది. భారత్‌ తిరిగి పుంజుకునేలోపు దాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. అప్పుడు బేస్‌కు స్క్వాడ్రన్‌ లీడర్‌ అయిన విజయ్‌ కార్నిక్‌(అజయ్‌ దేవగణ్‌) ఏం చేశాడు? సమీపంలో ఉన్న గ్రామవాసులతో కలిసి ఆ ఎయిర్‌బేస్‌ను ఎలా పునరుద్ధరించాడు? ఇందులో విక్రమ్‌ సింగ్‌(అమ్మి వ్రిక్‌), ఆర్కే నాయర్‌(శరద్ ఖేల్కర్‌), రంచోర్‌దాస్‌ పాగి(సంజయ్‌దత్‌), సుందర్‌బెన్‌(సోనాక్షి సిన్హా)ల పాత్ర ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: చరిత్ర పుటల్ని తిరిగేస్తే ఎన్నో గాథలు మనకు కళ్లముందు కదలాడతాయి. అవే కథా వస్తువులుగా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఒక సంఘటన, ఒక వ్యక్తి జీవితగాథ ఇలా కథా వస్తువు ఏదైనా అంతిమంగా ప్రేక్షకులను మెప్పించాలి. అప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది. పైగా చరిత్రను వక్రీకరించారన్న విమర్శలకు తావు ఇవ్వకుండా దాన్ని చూపించడం మరో సవాల్‌. ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’  విషయంలో దర్శకుడు అభిషేక్‌ దుదియా విజయం సాధించారు. భుజ్‌పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్న విషయాలను క్లుప్తంగా చెప్పడం ద్వారా నేరుగా కథలోని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ప్రథమార్ధంలో కాస్త ఎక్కువ సమయం పాత్రల పరిచయానికి తీసుకున్నాడు. పాక్‌ వైమానిక దళం భుజ్‌ ఎయిర్‌బేస్‌ సహా ఆ ప్రాంతంతో భారత భూభాగానికి ఉన్న వంతెనలను కూల్చివేయడం ద్వారా అక్కడ తన జెండా పాతాలనుకోవడం, మరోవైపు భారత్‌లో పాక్‌ గూఢచారులు, అక్కడ మన గూఢచారులు ఎలా పని చేస్తారన్న విషయాలను చూపించుకుంటూ వెళ్లారు. దీంతో సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగదీసినట్లు అనిపిస్తాయి.

ఎప్పుడైతే పాక్‌ ఆర్మీ భారత్‌పై దాడి చేయడానికి బయలుదేరిందో అప్పుడు కథ, కథనాల్లో వేగం పెరుగుతుంది. పాక్‌ సైన్యం భారత్‌కు ఎలా చేరుకుంటుంది? విజయ్‌కార్నిక్‌ ఎయిర్‌బేస్‌ను ఎలా పునరుద్ధరిస్తాడు? కేవలం 120మంది సైనికులతో ఆర్మీ ఆఫీసర్‌ ఆర్కే నాయర్‌, రాంచోర్‌దాస్‌ పాగిలు పాక్‌ సైన్యాన్ని ఎలా అడ్డుకుంటారన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలువుతుంది. అందుకు తగినట్లుగానే కథ, కథానాలను నడిపించాడు దర్శకుడు. అటు సైనికుల్లో, ఇటు గ్రామవాసుల్లో స్ఫూర్తి నింపే సమయంలో వచ్చే సంభాషణలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నా, ఆయా సన్నివేశాలన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి.

ఎవరెలా చేశారంటే: భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్రే. అయితే, ప్రధానంగా చెప్పుకోవాల్సింది అజయ్‌ దేవగణ్‌ స్క్వాడ్రాన్‌ లీడర్‌ విజయ్‌ కార్నిక్‌ పాత్రలో ఆయన అదరగొట్టేశారు. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన హైలైట్‌. ఇండియన్‌ ఆర్మీ స్కౌట్‌ రాంచోర్‌ దాస్‌పాగి పాత్రలో సంజయ్‌దత్‌, ఆర్మీ ఆఫీసర్‌ ఆర్కే నాయర్‌గా శరద్‌ ఖేల్కర్‌, ఫైట్‌ లెఫ్టినెంట్‌ విక్రమ్‌గా అమ్మి వ్రిక్‌ల నటన మెప్పిస్తుంది. నోరా ఫతేహి కనిపించేది కొద్దిసేపే అయినా, అదరగొట్టింది. సోనాక్షి, ప్రణీత తదితరుల పాత్ర పరిమితం. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అమర్‌ మొహిలి నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఐదు పాటలున్నా, సినిమా ఓటీటీకి రావడంతో వాటిలో కోత పెట్టారు. అసీమ్‌ బజాజ్‌ సినిమాటోగ్రఫీ సూపర్‌. వార్‌ సన్నివేశాలను చాలా బాగా చూపించారు. భావోద్వేగ సన్నివేశాలు మనసును కదలించేలా ఉంటాయి. నోరా ఫతేహి పాక్‌ అధికారిని చంపే సీన్‌ హైలైట్‌. అది ఎలా అన్నది స్క్రీన్‌పైనే చూడాలి. ధర్మేంద్ర శర్మ ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా ఉంది. సినిమా నిడివిని చాలా తగ్గించారు. థియేటర్‌లో విడుదలై ఉంటే సినిమా నిడివి ఇంకాస్త పెరిగేదేమో. ఓటీటీ కారణంగా కావాల్సిన మేరకే ఉంచారు. నిర్మాణ విలువలు ఓకే. వీఎఫ్‌ఎక్స్‌ పర్వాలేదు. గతంలో వచ్చిన ‘ఘాజీ’, ఇప్పుడు వచ్చిన ‘భుజ్‌’ ఇలా ప్రతిదీ ఒక సంఘటన చుట్టూ తిరిగే కథాంశం. రెండూ భావోద్వేగాల మిళితమే. అయితే వాటిని ఎంతవరకూ తెరపై అద్భుతంగా చూపించామన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. దర్శకుడు అభిషేక్‌ దుదియా ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. అయితే, తాను అనుకున్న కథను ఆవిష్కరించడంలో ఓకే అనిపించారు. అయితే, ద్వితీయార్ధంలో ఇంకొన్ని ఎమోషనల్ సన్నివేశాలు రాసుకుని ఉంటే, సినిమా మరోస్థాయిలో ఉండేది.

బలాలు

+ అజయ్‌ దేవగణ్‌, శరద్‌ ఖేల్కర్‌, అమ్మి వ్రిక్, సంజయ్‌దత్‌

+ వార్‌ సన్నివేశాలు

+ ద్వితీయార్ధం

బలహీనతలు

- ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: మీకు వార్‌ డ్రామా సినిమాలంటే ఇష్టమా..? ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ మిమ్మల్ని నిరాశపరచదు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని