నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ! - alitho saradaga funny chat with krishna bhagwan and prudhvi raj
close
Updated : 04/02/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ!

తన ఫన్నీ క్యారెక్టర్స్‌తో, పేరడి కామెడీతో ఆడియన్స్‌కు కితకితలు పెట్టడంలో ఒకరిది 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అయితే, తనదైన టైమింగ్‌తో, పటాసుల్లాంటి పంచ్‌ డైలాగ్స్‌తో మనల్ని కడుపుబ్బా నవ్వించడంలో మరొకరిది 40 ఏళ్ల అనుభవం. తమ మార్క్‌ అభినయంతో  మనకు బిందాస్‌ కామెడీని ఇస్తున్న హాస్యపాత్రల స్పెషలిస్టులు పృథ్వీరాజ్‌, కృష్ణభగవాన్‌. వీరిద్దరూ తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. మరి వారి సినీ ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!


మూర్తి శేషు అలియాస్‌ పృథ్వీరాజ్‌.. ఎలా ఉన్నారు?

పృథ్వీరాజ్‌: నా అసలు పేరు మూర్తి శేషు అని ఎవరికీ తెలియదు. పాస్‌పోర్టులో కూడా అదే ఉంటుంది. ‘నమో వెంకటేశ’  షూటింగ్‌ నిమిత్తం మొదటిసారి యూరప్‌ వెళ్లా. ఎయిర్‌పోర్టులో ‘ప్యాసింజర్‌ మూర్తి శేషు’ అని పిలుస్తున్నారు. అప్పుడు నేను స్పందించలేదు. వెంకటేష్‌గారికి నా పేరు అదేనని తెలియక ‘ఎవడయ్యా వాడు.. పిలుస్తుంటే వెళ్లడు’ అన్నారు. అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చి ‘నేనే సార్‌’ అంటూ పరుగున వెళ్లా.

కృష్ణ భగవాన్‌: నా అసలు పేరు పాపారావు చౌదరి. విదేశాల్లో షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు పాస్‌పోర్టు చూసి ఆ పేరుతోనే పిలిచేవారు. అప్పుడే నా అసలు పేరు పాపారావు చౌదరి అని నాతో ఉన్నవాళ్లకు తెలిసింది.(నవ్వులు)

ఒక రైతు కుటుంబంలోని వ్యక్తి చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చారు?

కృష్ణభగవాన్‌: మాది చాలా పెద్ద కుటుంబం. నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మా పెద్దన్నయ్య ఎంబీబీఎస్‌ చేసి డాక్టర్‌గా ఉన్నారు. చిన్నన్నయ్య కాకినాడలో ఇంజనీరింగ్‌ చేసేటప్పుడు ఆయనతో పాటు నేనూ అక్కడే ఉండి డిగ్రీ చదివేవాడిని. మా పెద్దన్నయ్య అప్పట్లో గాయకుడు. నాటకాలు కూడా వేసేవారు. నేను మిమిక్రీ చేసేవాణ్ని.  అంటే అంత ప్రావీణ్యుడినేమీ కాదు. అప్పట్లో అదే గొప్ప. ఆ టైమ్‌లో కాకినాడలో మా అన్నవాళ్ల బృందం నాటకం వేస్తున్నారు. అందులో ఒక నటుడు ఏదో కారణంతో రాలేదు. దీంతో నన్ను నటించమన్నారు. నేను ఏ బెరుకూ లేకుండా నటించేశాను. ప్రేక్షకులంతా నా నటన చూసి ఎంతో మెచ్చుకున్నారు. అలా ఆ రోజు నాలో మొలకెత్తిన నటనా బీజం, ఈ రోజు ‘ఆలీతో సరదాగా’ షోలో కూర్చునే దాకా తీసుకొచ్చింది.(నవ్వులు)

అంత వెటకారం ఎక్కడి నుంచి వచ్చింది?

కృష్ణ భగవాన్‌: నీకు తెలియందేముంది ఆలీ! తూ.గో., ప.గో. జిల్లాల వాళ్లంటేనే వెటకారం ఎక్కువ. వెటకారం ముందు పుట్టి అక్కడి మనుషులు తర్వాత పుడతారని సామెత. కాటన్‌ దొర బ్యారేజీ కట్టడంతో సంవత్సరానికి రెండు పంటలు బాగా పండుతున్నాయి. దీంతో ఆకలి బాధలు లేవు. సరదాగా గడిచిపోయే కాలంతో పాటు, కాస్త వెటకారం వారికి తోడైంది. ఇదంతా కాటన్‌దొర పుణ్యమే(నవ్వులు)

చిత్ర పరిశ్రమలో మీకు ఆదిగురువు ఎవరు?

పృథ్వీరాజ్‌: అలనాటి నటుడు ప్రభాకర్‌ రెడ్డి గారు మా గురువు. నా తల్లిదండ్రులు జన్మనిస్తే, చిత్ర పరిశ్రమలో ఆయన నాకు పునర్జన్మనిచ్చారు. ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. చాలామంది ‘మీరు.. ప్రభాకర్‌రెడ్డిగారి అబ్బాయా’ అని అడిగేవారు. ఆయన మారుతి కారు కొన్న రోజుల్లో, ఆ కారిచ్చి మరీ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగమనేవారు. అవకాశాలు వచ్చాక కాల్షీట్ల విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని సూచించేవారు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన ఎప్పుడూ ఒకటి చెబుతూ ఉండేవారు.. ‘గమ్యస్థానానికి ఒకరు ముందు వెళ్లొచ్చు.. మరొకరు ఆలస్యంగా  వెళ్లొచ్చు. ముందు వెళ్లిన వారిపై ఈర్ష్య వద్దు. కృషి చేస్తే ఎప్పటికైనా మనం అనుకున్నది సాధిస్తాం’ అనేవారు.

ఇద్దరూ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లవుతుంది?

పృథ్వీరాజ్‌: ‘ఖడ్గం’ చిత్రం నాటికే నాకు ‘30 ఇయర్స్‌’ ఇండస్ట్రీ అనే పేరు ఉంది. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 18 ఏళ్లు అవుతుందనుకుంటా!  కానీ, నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 40 ఏళ్లే. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో ‘పుణ్యశ్రీ’ అనే సినిమా తీశారు. అప్పుడే నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. 

వంశీ ‘మహర్షి’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

కృష్ణ భగవాన్‌: ‘మహర్షి’ సినిమాలో సెకండ్‌ హీరోగా ఛాన్స్‌ వచ్చింది. మహర్షి రాఘవ ప్రధాన హీరో. వంశీగారు అప్పటికే ‘లేడీస్‌ టైలర్‌’ హిట్‌తో మంచి జోరుమీదున్నారు. స్రవంతి మూవీస్‌ సంస్థ వాళ్లందరూ కొత్తవాళ్లతో ‘మహర్షి’ సినిమాను ప్రారంభించారు. వైజాగ్‌లో షూటింగ్‌ అయితే అందరికీ హోటల్‌లో వసతి కల్పించారు. ‘మీతో షూటింగ్‌ ఉన్నప్పుడు చెబుతాం.. అప్పుడు రండి’ అని యూనిట్‌ మేనేజర్‌ అన్నారు. దాంతో హోటల్‌లోనే ఉండి ఎదురు చూసేవాళ్లం. ఒక్కోసారి మాకు అవకాశం రాదేమోనని అనిపించేది. నాతోపాటు హోటల్‌లో ఉన్న ఒక లేడీ ఆర్టిస్టు ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు నా దగ్గరకు వచ్చింది. ఆమె.. తన పేరు ‘దమయంతి’ అని చెబుతూ ‘మరి మీ పేరేంటి’ అని నన్నడిగింది. నేను ‘నలుడు’ అని చెప్పా. అంటే ‘నల దమయంతులు’ భార్యభర్తలని ఆమెకు తెలియదు. ఆ క్రమంలోనే డైరెక్టర్‌ వంశీగారితో ఆమె షూటింగ్‌ గురించి అడుగుతూ ‘మాకు రేపు కూడా షూటింగ్‌ లేదట కదండీ’ అంది. ఆయన ‘నీకెవరు చెప్పారు’ అని ప్రశ్నిస్తే ‘నలుడు గారు’ అంటూ ఆయనతో చెప్పింది. దీంతో ఆయన యూనిట్‌లో నలుడు పేరుతో ఎవరున్నారంటూ వాకబు చేశారు. ఒకరోజు షూటింగ్‌లో ఆ చిత్ర నిర్మాత నన్ను పలకరిస్తూ ‘ఏమయ్యా.. నలుడుగా పేరెప్పుడు మార్చుకున్నావ్‌’ అంటూ ఆటపట్టించారు. ‘అంటే ఆవిడ పేరు దమయంతి అంది. అందుకే నా పేరు నలుడు అని చెప్పానండీ’ అనగానే ..ఎవరు ఏ పేరు చెబితే ఆ పేరు చెప్పేస్తావా అంటూ నవ్వేశారు. అప్పటిదాకా నేను చాలా  సైలెంట్‌గా ఉంటానని అనుకున్నారు. దీంతో నాలో ఉన్న వెటకారమంతా వాళ్లు గమనించారు.  ఆ సినిమా సమయంలోనే నటించేటప్పుడు డైలాగ్‌ చెప్పటానికి ఎక్కువ టేకులు తీసుకున్నా. యూనిట్‌ వాళ్లు నన్ను ఉత్సాహపరచడానికి ‘కృష్ణబాబు మంచి స్టేజ్‌ ఆర్టిస్టు’ అనేవాళ్లు. స్వామి అనే మేనేజరు ఇదంతా గమనించి ‘ఇప్పుడు ఈయన డైలాగ్‌ చెప్పాలంటే ప్రతిసారీ స్టేజ్‌ ఎక్కడేస్తామండీ బాబు’ అంటూ చమత్కరించారు.(నవ్వులు)

కాలేజీ రోజుల్లో ఎవరో మీ గొంతును అనుకరించి ఒక అమ్మాయికి తరచూ ఫోన్‌ చేసేవాళ్లట?

కృష్ణ భగవాన్‌: అవును. నేను కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయి నా వంక చూస్తూ ఉండేది. నేనేమో రాజేష్‌ ఖన్నా లెవెల్లో ఊహించుకుని డ్యూయెట్లు పాడుకునేవాడిని. అప్పట్లో ల్యాండ్‌ లైన్‌ ఫోన్లు ఉండేవి. ఒక రోజు ఆ అమ్మాయి నన్ను పిలిచి, తేదీలతో సహా చెప్పి ‘నాకు ఫోన్‌ ఎందుకు చేశావ్‌’ అంటూ నిలదీసింది. నేనెప్పుడూ ఆమెకు ఫోన్‌ చేయలేదు. ఆవిడేమో ‘మా అన్నయ్య పోలీసాఫీసర్‌, నువ్విలా చేస్తే ఆయనతో చెప్తా’నంటూ హెచ్చరించేది. దానికి నేను ‘అమ్మా.. నా దగ్గర హీరోయిన్‌ జయప్రద ఫోన్‌ నెంబరు ఉంది. ఆవిడకే ఫోన్‌ చెయ్యను, ఇంకా నీకెలా చేస్తాను’ అని సర్దిచెప్పబోయాను. దాంతో ఆవిడ ‘నువ్వు ఓవరాక్షన్‌ చెయ్యకు, నీకు మిమిక్రీ కూడా వచ్చు.. అందుకే రకరకాలుగా మాట్లాడుతున్నావ్‌’ అంటూ గొడవపడింది.

ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు?

కృష్ణ భగవాన్‌: తెలుసు. కానీ, ఇప్పుడెందుకు అతని పేరు చెప్పడం. అతనికి 65 ఏళ్లు వచ్చేసి ఉంటాయి. మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత ఎప్పుడు ఆ వ్యక్తి నాకు కనిపించలేదు.(నవ్వులు)

మీరు మంచి క్రికెట్‌ ఆటగాడట కదా? అప్పుడు జరిగిన ఓ గొడవలో తప్పించుకోవటానికి చాలా వేగంగా పరిగెత్తారట?

పృథ్వీరాజ్‌: అవునండీ! యూనివర్సిటీ లెవెల్లో బాగా ఆడేవాడిని. అలాగే నేను తాడేపల్లిగూడెంలో ఉన్నప్పుడు అనేక టీమ్‌లు క్రికెట్ ఆడేవి. అందులో భాగంగా ఒక టోర్నమెంట్‌ జరిగినప్పుడు మా ప్రత్యర్థి టీమ్‌ ఓడిపోయింది. దాంతో మామూలుగానే కుర్రాళ్లు చేసే హడావుడి ఉంటుంది కదా! కాకుంటే మేము కొంచెం ఎక్కువ చేశాం. దాంతో వాళ్లు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి నేను వారికి అందకుండా పరిగెత్తడం మొదలు పెట్టా. అలా పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం వరకూ ఆగకుండా పరిగెత్తా. అప్పట్లో కొబ్బరితోట బ్యాచ్‌ అంటే అందరికీ హడల్! ఆ గ్రూపులోనే కృష్ణవంశీ, బ్రహ్మాజీ ఉండేవాళ్లు. ఇప్పుడందరం స్నేహితులుగా మారిపోయాం. అప్పుడు నన్ను పరిగెత్తించిన  బ్యాచ్‌ అంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒకసారి హైదరాబాద్‌లో కారులో ప్రయాణిస్తునప్పుడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. నన్ను కూడా ఆపి చెక్‌ చేశారు. కానిస్టేబుల్‌ నా దగ్గరకు వచ్చి ‘సార్‌ మీరు కొంచెం ఇటొస్తారా. దొరగారు రమ్మంటున్నారు’ అంటూ పక్కకు తీసుకెళ్లాడు. నాకేమో ఆందోళనగా ఉంది..ఏం జరిగిందోనని..అక్కడికి వెళ్తే సీఐ నన్ను ‘ఏరా మూర్తి శేషు ఎలా ఉన్నా’వంటూ పలకరించారు. తీరా చూస్తే నా స్నేహితుడే! అతనిప్పుడు డీఎస్పీ స్థాయిలో ఉన్నాడు.

దేవుడంటే నమ్మకం లేని భగవాన్‌, ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారట?

భగవాన్‌: ఈ లాక్‌డౌన్‌ కాలంలో షిర్డీ సాయిబాబా గురించి ఎక్కువ తెలుసుకున్నా. అంతకుముందు నాలో కొంచెం నాస్తికత్వం ఉండేది. కొబ్బరికాయ కొట్టి, కానుకలేస్తేనే దేవుడు కరుణిస్తాడా? అంటే దేవుడు లంచాలు తీసుకుంటాడా? అంటూ కొంచెం అజ్ఞానంతో మాట్లాడేవాడిని. అలాంటి నేను ఈ మధ్యకాలంలో రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, జిడ్డు కృష్ణమూర్తి, సాయి లీలలు వంటి కొన్ని పుస్తకాలు చదివా. కొన్ని నాకు అర్థం కాకుంటే మా అన్నయ్య వివరించి చెప్పేవాడు. అప్పుడు నేనొక ఆధ్యాత్మిక భావనలోకి వెళ్లిపోయా. నాతో పాటు నటించిన ఎమ్మెస్‌ నారాయణ, కొండవలస, ధర్మవరపు సుబ్రమణ్యం, శ్రీహరి వంటి నటులు ఇప్పుడు లేరు. అప్పట్లో మేమంతా నటించిన సీన్లు గుర్తొస్తే ఆశ్చర్యమేసేది. నేను కూడా అంతే కదా. అసలు నేనెవరు? అని తెలుసుకోవాలనే భావన మొదలైంది. ఈ జీవనచక్రంలో మరొకరి విషయాలపై దృష్టి పెట్టే కంటే ముందు మనమెవరో తెలుసుకోవాలనే సంకల్పం వచ్చింది. దాని ప్రభావమే అదంతా..!

మీరు శకుని డైలాగ్‌ చెబితే..ఒక లెజండరీ నటుడు మిమ్మల్ని మెచ్చుకున్నారట?

పృథ్వీరాజ్‌: అవును? ‘దాన వీర శూర కర్ణ’లోని శకుని డైలాగ్‌ చెప్తే బాలకృష్ణగారు ఎంతగానో మెచ్చుకున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పాతతరం నటుడు ధూళిపాళగారిని కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ ‘చూడబ్బాయ్‌! మామూలు డైలాగులు ఎవరైనా చెబుతారు. నీకంటూ ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీ, మాడ్యులేషన్‌ లేకుంటే ఎవ్వరూ అవకాశాలివ్వరు. నువ్వొక పనిచెయ్‌..‘దాన వీర శూర కర్ణ’ సినిమా డైలాగుల క్యాసెట్‌ కొనుక్కుని అవి వింటూ.. సాధన చెయ్’ అన్నారు.

అలాగే నా కెరీర్‌ మొదటి రోజుల్లో కృష్ణగారిని కలిస్తే నన్ను ప్రధాన పాత్రలో పెట్టి అన్నగారి మీద.. ‘గండిపేట రహస్యం’అనే సినిమా చేయించారు. దాంతో ఆయన పార్టీ వాళ్లు నామీద కోపంతో రగిలిపోయేవారు. సినిమా అయ్యాక కృష్ణగారిని కలిస్తే ‘నువ్వెళ్లి పెద్దాయన్ను కలువయ్యా.. ఆయన ఇటువంటివన్నీ క్షమించేస్తారు’ అంటూ నన్ను రామారావుగారి దగ్గరకు పంపారు. నేను వెళ్లటంతోనే ఆయన కాళ్లమీద పడ్డా. ఆయన చుట్టూ ఉన్న పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు నన్ను కొట్టేలా గుడ్లురుమి చూశారు. ఆ సందర్భంలో రామారావుగారు మాట్లాడుతూ ‘అతనికేమీ తెలియదు. మీరు ఊరుకోండి. ‘బ్రదర్‌.. ఇక నుంచి అటువంటి సినిమాలు చేయకండి. దేవుడు మంచి రూపాన్ని ఇచ్చాడు. కళామతల్లిని నమ్ముకుని మంచి సినిమాల్లో నటించండి’ అంటూ వెన్ను తట్టారు.  ఆయన నా వివరాలు అడగ్గానే.. నేను బల్‌రెడ్డి సుబ్బారావు కుమారుడినని చెప్పా. ఎందుకంటే అన్నగారితో కలిసి మా నాన్న  కొన్ని నాటకాలు వేశారు. ఆ విషయం చెప్పగానే ‘మీరు బల్‌రెడ్డి సుబ్బారావుగారి కొడుకా!’ అంటూ దగ్గరకు తీసుకున్నారు. వెంటనే ఒక డైలాగ్‌ చెప్పమని అడిగారు. నేను శకుని డైలాగ్‌ ఘంటాపథంగా చెప్పా. వెంటనే ఆయన నన్ను మెచ్చుకుని పది రూపాయల నోటు తీసి, దానిపై ఇలా రాసుకొచ్చారు ‘గౌరవనీయులైన పృథ్వీరాజ్‌ తమ్ముడిగారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశీర్వదించి ఇస్తున్న బహుమానం’ అంటూ నా చేతిలో పెట్టారు. నా భుజంపైన చేయి వేసి ఫొటో తీయించారు. ఇప్పటికీ ఆ ఫొటో దాని కింద పదిరూపాయల నోటును మా ఇంట్లో అపురూపంగా భద్రపరుచుకున్నాను. నా దృష్టిలో అది ఆస్కార్‌ అవార్డంత గొప్పది.

చెన్నైలో మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారు?

పృథ్వీరాజ్‌: చెన్నై కోడంబాకం సమీపంలో ఉన్న హాలీవుడ్‌ హోటల్‌లో మొదటిసారి కృష్ణభగవాన్‌ను చూశా. అప్పటికే ఆయన ‘మహర్షి’లో హీరోగా చేసున్నారు. అప్పుడీయన(కృష్ణ భగవాన్‌ను ఉద్దేశించి) ‘ఏ ఊరు బాబు మీది’ అంటూ పలకరించారు. అంతకుముందే పాండీ బజారులో రావుగోపాలరావుగారిని చూశా. మా ఊరికి చెందిన నటుడు రాజా.. దాసరిగారి సినిమాల్లో ఎక్కువగా నటించేవారు. ఆయన మా ఊరొస్తే ఊరేగింపు, హడావుడి భలే ఉండేది. సినీ నటుడు అయితే  ప్రజాభిమానం ఇలా ఉంటుందని అప్పుడే తెలుసుకున్నా. సీనియర్‌ నటుడు రేలంగిగారిది కూడా మా ఇంటి నుంచి మూడో వీధి. ఆయన్ను చూశాక కూడా అలాగే నటుడు అవ్వాలని అనిపించేది. తెలుగు సినీ పరిశ్రమలో బాలకృష్ణగారిలా.. కృష్ణభగవాన్‌గారూ కూడా నిరాడంబరంగా ఉంటారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరు. నటుడు రఘుబాబు కూడా అంతే.

కృష్ణభగవాన్‌ బలహీనత ఏమిటి?

కృష్ణభగవాన్‌: చాలా ఉన్నాయి! అయితే నా నోటి తొందర వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొన్న ఒక నటుడు  ‘నేను నిజ జీవితంలో అస్సలు నటించను’ అంటూ ఏదో చెబుతుండగా, దానికి నేను కౌంటర్‌గా ‘అది తెరమీద కూడా తెలుస్తుంద’న్నాను. ఇంకోసారి ఒక పెద్ద నటుడి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనెప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి సెట్లో మౌనంగా కూర్చున్నాడు. ‘ఏమైంది’ అని అడిగా. ఆయన దానికి సమాధానంగా ‘అయిదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే వెర్రోడి కింద చూస్తున్నారు’ అంటూ వాపోయాడు. వెంటనే నేను ‘ఏంటీ.. ఆ విషయం తెలుసుకోవడానికి వాళ్లకు అయిదు నిమిషాలు పడుతోందా’ అంటూ కౌంటర్‌ వేశాను. ఆయన నొచ్చుకున్నాడు. ఇలా చాలా సార్లు నోటి తొందర వల్ల చాలామంది నన్ను తిట్టుకున్నారు. నాకూ అనాలని ఉండదు. కానీ, ఆ సందర్భంలో అలా వచ్చేస్తున్నాయి.(నవ్వులు)

ఎంతో బిజీ ఆర్టిస్టుగా ఉండే కృష్ణభగవాన్‌ జోరు ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది?

కృష్ణభగవాన్‌: ఆ భగవంతుడే నాకు ఈ గ్యాప్‌ ఇచ్చాడనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నా కాలు కొంచెం ఇబ్బంది పెట్టింది. మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతున్నా. అందువల్ల ఎవ్వరూ నన్ను సంప్రదించటం లేదు కాబోలు. అయినా ఈ సమయాన్ని ఆధ్యాత్మిక మార్గంలో సద్వినియోగం చేసుకుంటున్నా. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. దాని ప్రకారం మనకు ఎంత దక్కాలో అంతే దక్కుతుంది.

మీకు రచయితగా కూడా అనుభవం ఉంది కదా? ‘ఏప్రిల్‌ 1 విడుదల’ సినిమాకు కూడా పనిచేసినట్టున్నారు?

కృష్ణభగవాన్‌: అసలు నేను చిత్రపరిశ్రమలోకి వచ్చింది నటుడు అవ్వాలనే. కానీ, ఎంతో కొంత రాయడంలో  అనుభవం ఉండటం వల్ల ‘ఏప్రిల్‌ 1 విడుదల’ చిత్రాన్ని 90 శాతం నేనే రాశా. అయితే ఆ చిత్రానికి రచయితగా టైటిల్‌ కార్డులో నా పేరు పడకపోయినా డైరెక్టర్‌ వంశీగారూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ స్క్రిప్టు చాలా వరకు భగవానే రాశాడని. ఈ మధ్యన కొన్ని స్క్రిప్టులు రాస్తున్నా. డైరెక్షన్‌ చేయాలనే ఆసక్తి కూడా ఉంది. చూడాలి ఏమవుతుందో!

ఒక డైరెక్టర్‌ మిమ్మల్ని ‘దున్నపోతులా తయారై రా’ అన్నారటగా? ఎవరా డైరెక్టర్‌?

పృథ్వీరాజ్‌: డైరెక్టర్‌ కృష్ణవంశీ గారు సరదాగా ఆ మాటన్నారు! అసలేం జరిగిందంటే.. ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో ఒక మాంత్రికుడి వేషానికి నన్ను ఎంచుకున్నారు. ఆ పాత్రకు తగ్గట్టు బాగా భీకరంగా ఉండాలి. అందువల్ల నేను బాగా లావుగా కనిపించాలని కృష్ణవంశీగారు నన్ను బాగా తిని ఒళ్లు చేయమని సూచించారు. అలా తయారై షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఒకసారి మంత్రాలు చదివే సీనులో నన్ను ఆవేశంగా నటించమన్నారు. అప్పటికే నా మేకప్‌ అంతా నల్లగా ఉండి గుడ్డముక్కలు కట్టారు. ఆ షాట్‌ అయ్యాక లైట్‌బాయ్‌ నన్ను చూసి అక్కడే కళ్లు తిరిగి పడిపోయాడు(నవ్వులు).

ఒక సీన్‌లో చెంపదెబ్బకు మీరిచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ చూసి నాగార్జున మెచ్చుకున్నారట?

పృథ్వీరాజ్‌: హో అదా!(నవ్వులు) అప్పుడు ‘చంద్రలేఖ’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ సీన్‌లో డైరెక్టర్‌ కృష్ణవంశీ నన్ను నాగార్జునగారి వెనకాలే వెళ్లి భుజం మీద చెయ్యి వెయ్యాలని చెప్పారు. కానీ, అసలు ఆ సీన్‌ పూర్తి వివరాలు నాకు తెలియదు. నేను అలాగే వెళ్లి చెయ్యి వేసే లోపు నాగార్జునగారు తప్పుకున్నారు. పక్కనే ఉన్న ఒక మహిళపై నా చెయ్యి పడింది. వెంటనే ఆమె నా చెంపపై ఒక్కటి పీకింది. నాకు విషయం అర్థమయ్యేలోపు కృష్ణవంశీగారు ఫ్రేమ్‌ పెట్టి ‘రిలాక్స్ అవ్వొద్దురా’ అంటూ సీన్‌ తీసేశారు. సహజంగా ఉండాలని అలా చేశారట!

మరి ‘మంచు దెబ్బ’ సంగతులేంటో చెప్పండి?

పృథ్వీరాజ్‌: అప్పుడు రాజోలులో షూటింగ్‌ జరుగుతోంది. ఊరి జనమంతా అక్కడే ఉన్నారు. అందరూ ‘మీ కామెడీ అద్భుతం’  అంటూ నా చుట్టూ చేరి పొగిడారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ ఆర్‌ఎంపీ డాక్టరు. ఇక సీన్‌లోకి వెళ్లగానే ఓ డైలాగులో ‘నువ్వు రత్తాలు కోడలివట కదా, ఇదిగో నీ అందానికి నా రేటు రూ.100’ అంటూ ఆ పాత్ర చేస్తున్న మంచు లక్ష్మిని తక్కువ చేసి మాట్లాడాలి. నా డైలాగ్‌ పూర్తవుతుండగానే మంచు లక్ష్మిగారు లాగిపెట్టి నా చెంపమీద ఒక్కటిచ్చారు. నా దిమ్మ తిరిగిపోయింది. మోహన్‌బాబుగారి ఫ్యామిలీలో ఎవరు కొట్టినా అంత ధాటిగా ఉండదు. కానీ, మంచు లక్షిగారు కొట్టిన ఆ దెబ్బను తట్టుకోలేకపోయా. అదంతా సీన్‌లో భాగమే అయినా, అక్కడి జనమంతా ‘అదేంటి ఆ అమ్మాయి అలా కొట్టేసింది’ అని ముచ్చటించుకున్నారు. అదే ‘మంచు దెబ్బ’ వెనుకున్న కథ.

ఎమ్మెస్‌ నారాయణతో మీకున్న అనుబంధం?

కృష్ణభగవాన్‌: ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. నిజంగా ఆయన మన మధ్యన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం మాది. ఆయన చాలా మేధావి. స్వతహాగా మంచి రచయిత. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఒకసారి ఇద్దరం కలిసి షూటింగ్‌ కోసం మలేషియా వెళ్లాం. అక్కడ అక్వేరియంలో చేపలు చూసిన ఆయన ‘ఏయ్‌ భగవాన్‌ చేపలు తింటే కళ్లకు మంచిది కదా’అని నాతో అన్నారు. నేను సమాధానంగా ‘తినకపోతే చేపలకు మంచిది’అంటూ కౌంటర్‌ వేశా. ఎంతో సరదాగా ఉండేవాళ్లం. ఆయన ప్రోత్సాహం కూడా మరువలేనిది.

‘ఆలీతో సరదాగా’ షో చూస్తుంటారా?

కృష్ణ భగవాన్‌: తప్పకుండా చూస్తా! ముందు యాంకర్‌గా నీకు(ఆలీని ఉద్దేశించి) వందకి వంద మార్కులు వేయాలి. ఎంతో బాగా చేస్తున్నావు. ఎంతో మంది మహానుభావులు ఈ షోకు అతిథులుగా వచ్చారు. ముఖ్యంగా యమునగారి ఇంటర్వ్యూ నన్ను బాగా భావోద్వేగానికి గురిచేసింది. అలాగే సాయికుమార్‌గారిదీ బాగా అనిపించింది.

పృథ్వీరాజ్‌: మీ షోలో ఎప్పటికే నిలిచిపోయే ఎపిసోడ్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యంగారితో చేసింది. నిజంగా అదొక మధుర జ్ఞాపకం.

కృష్ణభగవాన్‌: అవును. ఆ ఎపిసోడ్‌ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన పాటే అంత బాగుంటే.. మాట ఇంకా బాగుండేది. నాకు మొట్టమొదటి సినిమా అవకాశం కోసం సిఫారసు లేఖ ఇచ్చింది ఆయనే. ఒకసారి నా మైమ్‌ ప్రదర్శన చూసి ఎంతో మెచ్చుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు పాడతారు, డబ్బింగ్‌ చెబుతారు, నటిస్తారు. ఏ నటుడికైనా  తగ్గట్టు గొంతు మార్చి పాడేవారు. కరోనా కాలంలో ఏదైనా అత్యంత విలువైనది పోగొట్టుకున్నామంటే అది ఎస్పీ బాలుగారినే.

పృథ్వీరాజ్‌: నాకూ బాలుగారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ‘దేవుళ్లు’ చిత్రంలో నేను వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించాను. డబ్బింగ్‌ చెప్పాల్సి ఉండగా స్టూడియోకి వెళ్లా. ఆయన ఎదురుపడి ‘రేయ్‌ నీకో గిఫ్ట్‌ రా. నీ పాత్రకు డబ్బింగ్ నేనే చెప్పాన’న్నారు. నిజంగా నాకు చాలా సంతోషమేసింది. ఎంతో అదృష్టంగా భావించా. ఈ మధ్య కాలంలో చెన్నైలో ఒక తమిళ నటుడిని కలిశా. ఆయన మాట్లాడుతూ ‘బాలుగారి పేరిట ఒక స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఉండే ప్రతీ చెట్టు కొమ్మకూ బాలుగారి పాటను పేపరు మీద  రాసి  అమర్చుతాం. వచ్చే ఉగాదికి ప్రారంభం ఉండొచ్చు’అంటూ చెప్పారు. బాలుగారు పాడిన మొత్తం  పాటలను ఒక క్యాసెట్‌గా చేసి ఒక్కసారి వదిలితే సరాసరి మూడున్నరేళ్లు మోగుతూనే ఉంటాయట. అంత పెద్ద సంఖ్యలో పాటలు పాడారు.

ఇండస్ట్రీలో మీకు స్నేహితులు ఎవరు?

కృష్ణభగవాన్: అందరితోనూ స్నేహంగా ఉంటా. రఘుబాబు, ఆలీ, దర్శకులు శ్రీనివాసరెడ్డి.. వీరి ముగ్గురితో ఎక్కువగా ఉంటాను.

జూబ్లీహిల్స్‌ టూ తిరుమల హిల్స్‌ మీ ప్రయాణం ఎలా సాగింది?

పృథ్వీరాజ్‌: అదొక గొప్ప ప్రయాణం. అందరూ నేను తిరుమల కొండలపై ఉన్నాననుకున్నారు. కానీ, నా కార్యాలయం తిరుపతిలో ఉండేది. నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల అయిదు నెలలపాటు రోజూ రెండు మూడు గంటలు వెంకన్న సన్నిధిలోనే గడిపేవాడిని. ఈ మధ్యే కాలం చేసిన ప్రధాన పూజారి శ్రీనివాసాచారి ఎప్పుడూ నన్ను ఒక మాట అనేవారు. ‘మీరు విగ్రహం ఎదురుగా నిలబడుతున్నారు. వెంకన్న చాలా శక్తిమంతుడు. కాస్త పక్కన నిలబడి దణ్ణం పెట్టుకోవాలి. నీ జీవితంలో వచ్చే ఏడాదిన్నర పాటు ఇబ్బందులు ఎదుర్కొంటారు’ అంటూ ముందుగానే చెప్పేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని