Chandrabose: 21 అవమానాల తర్వాత అవకాశం - alitho saradaga latest interview with lyrisist chandrabose
close
Updated : 22/09/2021 08:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chandrabose: 21 అవమానాల తర్వాత అవకాశం

ఆయన అక్షరాలు తెలుగు పాటకు జరిగే పట్టాభిషేకాలు, ఆయన భావాలు బాణీలోని గొప్పదనానికి జరిగే పూలాభిషేకాలు. అలాంటి వేల బాణీలకు తన అక్షరాలతో ప్రాణం పోసిన టాలీవుడ్‌ పాటల రచయిత చంద్రబోస్‌.  ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని ఆయన సాగించిన పాటల ప్రయాణాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ఎలా ఉన్నారు?
చంద్రబోస్‌: చాలా సంతోషంగా ఉన్నాను ఆలీ అన్న. 
మనం మొదటిసారి ఎక్కడ కలుసుకున్నామో గుర్తుందా?
చంద్రబోస్‌: మీ ఇంట్లోనే. శ్రీనాథ్‌ అన్నయ్య మిమ్మల్ని కలిసేందుకు తీసుకొచ్చారు. సాధారణంగా ఎవరి దగ్గరికెళ్లినా పండో, ఫలమో తీసుకెళ్తారు. నేను మాత్రం పాట తీసుకెళ్లేవాడిని. అలా మీ దగ్గరకి ఓ పాటతో వచ్చాను. మీ మీద ఒక పాట కూడా రాశాను. అప్పుడెందుకో పాడలేకపోయాను. 
అక్కడ నువ్వు  పాడిన పాట విని, రామానాయుడు దగ్గరకు వెళ్లమని సూచించాను. 
చంద్రబోస్‌: రామానాయుడి గారిది అమృత హస్తం. ఎందరో టాప్‌ డైరెక్టర్లు, రచయితలు ఆయన కాంపౌండ్‌ నుంచే వచ్చారు.

అతి చిన్న వయసులో ఎక్కువ పేరు సంపాదించిన రచయితవి నువ్వే అనుకుంటా కదా?
చంద్రబోస్‌: నేను 22 ఏళ్ల వయసులో పరిశ్రమలోకి వచ్చాను. ‘తాజ్‌మహల్‌’ 1995లో వచ్చింది.  శ్రీనాథ్‌ అన్నయ్య, మీరు, ముప్పలనేని శివ, రామనాయుడు ప్రోత్సాహంతో టాలీవుడ్‌లో నా తొలి అడుగు పడింది. 
నేను రాసిన మొదటి గీతాన్ని బాలు, చిత్ర పాడటం అదృష్టం.
ఎన్ని వేల పాటలు రాశావు?
చంద్రబోస్‌: 860కి పైగా చిత్రాల్లో దాదాపు 3600 గీతాలు రాశాను. 26 ఏళ్లుగా నా ప్రయాణం సాగుతోంది. 
ఏం చదివావు?
చంద్రబోస్‌: జేఎన్‌టీయూలో బీటెక్‌ చేశాను. దానికన్నా ముందు డిప్లొమా చేశాను. బీటెక్‌ పార్ట్‌టైం కాబట్టి, సాయంత్రం మాత్రమే కాలేజ్‌ ఉండేది. దీంతో పగలంతా ఖాళీగా ఉండాల్సి వచ్చేది. ఇలా ఖాళీగా ఉండటం ఇష్టం లేక చిత్ర పరిశ్రమలో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను.  ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరానికి వచ్చేసరికి శ్రీకాంత్‌ నటించిన ‘తాజ్‌ మహల్‌’లో అవకాశం దక్కింది. పరీక్షలు కూడా అదే సమయంలో రాశాను. పాట కూడా మంచి విజయం సాధించింది. ఇంజనీరింగ్‌ పట్టా చేతికొచ్చింది. డిగ్రీ పట్టా, హిట్టైన పాట చేతిలో ఉన్నాయి. తరువాత ఎటెళ్లాలో అర్థం కాని పరిస్థితి.  అమ్మానాన్నలేమో నేను ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉండాలని ఆశపడుతున్నారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం, సంగీతం, సినిమాలంటే నాకు విపరీమైన వ్యామోహం. అందుకే ఇన్నేళ్ల చదువును పక్కనపెట్టి నా కల నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగాను.  ఓ సంవత్సరం  సినిమా రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుని,  ఫలితం అనుకూలంగా లేకుంటే తిరిగి వెనక్కి వద్దాం అనుకున్నాను. ఏడాది గడిచాక ఆ నిర్ణయాన్ని కూడా మరిచిపోయేంత బిజీగా మారిపోయాను. 

మీ నాన్న ఏం చేసేవారు?
చంద్రబోస్‌: మా నాన్న ప్రైమరీ స్కూల్‌ టీచర్‌. మా నాన్నని బాపు అని పిలుస్తుంటాం. మేం నలుగురం పిల్లలం. మా బాపుకు జీతం తక్కువ వస్తుండటంతో మా అమ్మే కూలీ పనులకు వెళ్లి మా కుటుంబాన్ని పోషించడంలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేది. మా ఇంటిపక్క గుళ్లో మైక్‌లో పాటలు విని.. సంగీతం, సాహిత్యం మీద ఇష్టం పెంచుకున్నాను. 1985లో ఇళయరాజా గారి ‘నథింగ్‌ బట్‌ విండ్‌’ అనే అల్బమ్‌ విన్నాను. అందులో ‘సాంగ్‌ ఆఫ్‌ సోల్‌’ అనే బాణీ విపరీతంగా నచ్చింది. అది పదాలు లేని బాణీ మాత్రమే. ఆ ట్రాక్‌కి ‘నిండేనే నా కళ్లలో ఆరని నీ రూపమే’ అనే పాటను రాసుకున్నాను.  సినిమా రంగంలోకి వచ్చిన 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత నా స్పూర్తిదాత ఇళయరాజాను కలుసుకునే అవకాశం దక్కింది. ‘గుండెల్లో గోదారి’ సినిమాకు పాట రాయడానికి ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. ఇళయరాజాను చూడగానే గుండెల్లో గోదారి కాదు, కళ్లల్లో గోదారి పొంగింది.
12 ఏళ్ల వయసులో సొంతంగా వార్తలు రాసేవాడివంట?
చంద్రబోస్‌: చిన్నప్పటి నుంచి కొత్తగా అలోచించే అలవాటు ఉండేది.  మా అమ్మాబాపులు సాయంత్రం పొలం వద్ద, ఊర్లో జరిగిన విషయాలు మాట్లాడుకునేవారు. వాళ్లు చెప్పే విషయాలనే వార్తలుగా రాసి మా ఊరి గ్రంథాలయంలో ఓ పత్రికను నడిపాను. మా ఊరి సర్పంచ్‌, పోలీసు పటేల్‌ అది చదివి మెచ్చుకునేవారు. ప్రధాన వార్తపత్రికల కంటే ముందు నా పత్రికను చదివేవారు. ఓ రోజు రాసేందుకు వార్తలేమీ లేవు. దాంతో పశువైద్యశాల ఉన్నా, బక్కచిక్కిన ఆవు అని ఒక కథనం రాసి పంపాను. దాంతో పశువైద్యుడి మీద సర్పంచ్‌ సీరియస్‌ అయ్యారు. ఆయనొచ్చి మా నాన్నకు చెబితే, నాకు తిట్లు పడ్డాయి. తరువాత రోజే నా పత్రిక మూతపడింది. 

ఇంట్లో నువ్వే చిన్నవాడివి కదా? మిగతా వాళ్లు ఏం చేస్తారు. 
చంద్రబోస్‌: మా పెద్దన్నయ్య, వదినలు ఇద్దరూ కండక్టర్లు. రెండో అన్నయ్య ముంబయిలో పనిచేస్తారు. అక్క, బావ వరంగల్‌లో ఉంటారు. ప్రతి పండగకి కలుసుకుంటాం. పండగలేకున్నా మేం కలిస్తే అదో వేడుకే.

 స్ఫూర్తినిచ్చిన గేయ రచయితలెవరు?
చంద్రబోస్‌: ‘భక్తప్రహ్లద’లో మొదటి పాట రాసిన చందాల కేశవదాసు నుంచి నాకన్నా నెల ముందు ‘నమస్తే అన్న’లో ‘గరంగరం పోరీ’ గీతాన్ని రాసిన సుద్దాల ఆశోక్‌తేజ వరకు అందరూ నాకు గురువుతో సమానమే. వీరిలో దైవం, ప్రాణంగా భావించేది మాత్రం ఆచార్య ఆత్రేయ. 
సుచిత్ర నృత్య దర్శకురాలు, మీరు గేయ రచయిత. మీ ఇద్దరికీ ఎలా కుదిరింది?
చంద్రబోస్‌: ‘పెళ్లి పీటలు’ సినిమాకు నేను పాటలు రాసి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. దానికి సుచిత్ర డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు‌. అవిడ కూడా నా పక్కనే కూర్చున్నారు.  ‘పరదేశీ’ సినిమాలో మంచి సాహిత్యం అందించారని మెచ్చుకుంది. అందులో నేను రాసిన పాట, అందులోని చరణాలను గుర్తు చేసింది. ఒక నృత్యదర్శకురాలై ఉండి నా సాహిత్యాన్ని ప్రస్తావించడం నాకు ఆశ్చర్యంతో పాటు, ఆనందం కలిగించింది.  పాటలోని కవిత్వాన్ని ఇంత చక్కగా అర్థం చేసుకుంది. కవిని కూడా అంతే అర్థం చేసుకుంటుందని భావించి అర్థాంగిని చేసుకోవాలనుకున్నాను. 

మీ ఇద్దరు పిల్లలు నంద వనమాలి, అమృత వర్షిణి  పేర్ల వెనక కథేంటి?
చంద్రబోస్‌: నాకు వనమాలి అనే పేరంటే చాలా ఇష్టం. మేం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ‘శ్రీమతి వెళ్లొస్తా’ అనే సినిమాలో ‘వనమాలి, వనమాలి వెళ్లనులే నిన్నొదిలి’ అనే పాటను రాశాను. ఆ గీతానికి ఆమే నృత్య దర్శకురాలు.  మా ఇద్దరి కలయికలో వచ్చిన మొదటి పాటది. అందుకే  అబ్బాయి పుడితే వనమాలి పేరు పెట్టాలని అనుకున్నాం. ఇక అమ్మాయి పుట్టినప్పుడు వర్షాలు చాలా రోజులకు కురిశాయి. వర్షమే అమృతంలా అనిపించింది. ఆ సమయంలో పుట్టింది కాబట్టి, అమృత వర్షిణి అని పేరు పెట్టాం. 
సుచిత్ర కొరియోగ్రాఫర్‌గా మానేయడానికి కారణమేంటి?
చంద్రబోస్‌: కారణమంటూ ఏం లేదు. పిల్లలు ఎదుగుతున్నారు. మా నాన్నను, వాళ్ల నాన్నను తనే చూసుకుంటుంది. ఒకరకంగా నేను ముందుకు సాగడానికి ఆమె  జీవితాన్ని త్యాగం చేసింది.
తనను పెళ్లి చేసుకుంటానని చెబితే ఇంట్లో ఎలా స్పందించారు?
చంద్రబోస్‌: నేను ఏది చేసిన కరెక్ట్‌గా చేస్తానని మా అమ్మకు నమ్మకం. చిన్నప్పటి నుంచే మా కుటుంబంలో అందరికీ అలాంటి నమ్మకం ఉంది. అమ్మకు సుచిత్ర గురించి చెప్పినప్పుడు నవ్వి ఓకే చెప్పింది. ఇక మా అమ్మానాన్నలను సుచిత్ర సొంతవాళ్ల కన్నా బాగా చూసుకుంది. నాకన్నా ఆమెకే మా అమ్మానాన్నలంటే ఎక్కువ ఇష్టం.

వాళ్లింట్లో ఎలా ఒప్పించావు?
చంద్రబోస్‌:  సుచిత్ర వాళ్లింటికి వెళ్లి నా మనసులో మాట నేరుగా చెప్పాను. నేనిలా సినిమాలు చేస్తున్నాను.  వారికి నమ్మకం కలిగేలా మాట్లాడాను. వారికి కూడా బాగా నచ్చడంతో పెళ్లికి అంగీకరించారు. వాళ్లది సంగీత నేపథ్యమున్న కుటుంబం.  మా మామగారు పాతతరం సంగీత దర్శకులు. ‘బంగారు సంకెళ్లు’, ‘స్నేహమేరా జీవితం’ లాంటి సినిమాలకు బాణీలు కట్టారు. 
ఒక పాట రాసేందుకు సాధారణంగా ఎంత సమయం తీసుకుంటావు?
చంద్రబోస్‌:  దర్శకుడిని బట్టి, సందర్భాన్ని బట్టి పాట ఎన్ని రోజుల్లో రాయగలననేది ఆధారపడి ఉంటుంది. ‘వన్‌ నేనొక్కడినే’లో  ‘యువర్‌ మై లవ్‌’  గీతాన్ని రాసేందుకు 29 రోజులు పట్టింది. అదే సుకుమార్, దేవీలతోనే చేసిన ‘రంగస్థలం’లో ఒక్కోపాటకు పట్టిన సమయం 30 నిమిషాలు మాత్రమే. ఒక రకమైన సమన్వయం కుదరడం వల్ల అంత తక్కువ సమయంలో మంచి పాటలు వచ్చాయి. 

మీ కెరీర్‌ పట్ల నాన్న సంతోషంగా ఉన్నారా? 
చంద్రబోస్‌: మా బాపుకు తొలినాళ్లలో నామీద నమ్మకం లేదు. పాటలు రాయడమేనే ఒక వృత్తి ఉంటుందని, అందులో ఉపాధి దొరుకుతుందన్న విషయం కూడా తెలియదు. చిరంజీవి, వెంకటేశ్‌ వాళ్ల సినిమాలకు వాళ్లు పాటలు రాసుకోరా? నువ్వు రాసుడేంది? అనేవారు. అప్పుడు ఇదంతా వారికి తెలియదు.  నన్ను నేను నిరూపించుకోవాలని కావాలనే ఒక సంవత్సరం పాటు సొంతూరు వెళ్లలేదు.  ఏడాది తర్వాత సితార పత్రికలో నా ప్రయాణం, పాటలు, కవిత్వం మీద ఒక అందమైన ఆర్టికల్‌ ప్రచురితమైంది. దాన్ని చూసి చాలా మురిసిపోయి వెంటనే నాకు ఫోన్‌ చేశారు. 

సింగిల్‌ టేక్‌ రైటర్‌వి అని అందరికీ తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు సింగిల్‌ టేక్‌ సింగర్‌ అని కూడా కితాబిచ్చారట కదా?
చంద్రబోస్‌: ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించిన ‘కొమరం పులి’కి అన్ని పాటలు రాశాను. పవర్‌స్టార్‌ పాట రికార్డింగ్‌ సమయంలో ట్రాక్‌ సింగర్‌ కొంత ఇబ్బంది పడ్డారు. నేను ఇలా పాడలి, అలా పాడాలి అని సలహాలివ్వడం చూసి నన్ను పాడమని అడిగారు. క్లిష్టమైన బాణీ, పదాలున్నప్పటికీ  కొన్ని వందల సార్లు పాడి పాటను జీర్ణం చేసుకున్నాను కాబట్టి అయిదు నిమిషాల్లోనే పాడేశాను. రెహమాన్‌ గారు ఆశ్చర్యపోయారు. సింగిల్‌ టేక్‌ సింగర్‌ అని బిరుదిచ్చారు. 
ఎన్ని కొత్త పదాలు కనిపెట్టావు?
చంద్రబోస్‌: నాకు భాష మీద విపరీత అభిమానం వల్ల కొత్త మాటలు పుట్టించాలనే కోరిక కూడా ఉంది. ‘స్టూడెంట్‌ నం.1’లో ‘వయస్కాంతం’అని రాశాను. ‘శ్రీమతి వెళ్లొస్తా’లో ముద్దు గురించి రాస్తూ ‘కిశ్శబ్దం’ అని ప్రయోగం చేశాను. పద ప్రయోగం చేసినప్పుడల్లా నిర్మాతతో పాటు, నేను కూడా పారితోషికం ఇస్తానని రాఘవేంద్రరావు గారు నాలో ఉత్సాహాన్ని నింపేవారు. దాంతో ప్రతిపాటలోనూ కొత్త పదాలు రాసేందుకు ప్రయత్నించాను. ‘అందరివాడు’లో మెగాస్టార్‌ కోసం ‘గ్రేటాది గ్రేటుడా’. ‘స్టారాది స్టారుడా’ లాంటి పదాలు ఉపయోగించాను. పవన్‌కల్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ కోసం ‘తయ్యారం’,‘కంగారం’లాంటి పదాలు ప్రయోగించాను. 
ఎవరైనా చెక్కులిస్తే బ్యాంకులో వేసుకుంటారు. కానీ నువ్వేంటి నీ దగ్గగరే అట్టిపెట్టుకున్నావట?
చంద్రబోస్‌: రామానాయుడు మొదటి పాటకు ఆ కాలంలోనే రూ.2500 ఇచ్చారు. దాన్ని పవిత్రంగా, అమూల్యంగా ఐదు నెలలు దాచుకున్నాను.  చెక్‌ వ్యవధి ఆరునెలలే ఉంటుంది. ఈలోగా నా స్నేహితులు, సన్నిహితులకు గర్వంగా చూపించి, అయిదో నెలలో బ్యాంక్‌లో వేశాను. ఇలా ‘బొంబాయి ప్రియుడు’కి రాఘవేంద్రరావు, ‘అడవి’ సినిమాకు ఆర్జీవీ ఇచ్చిన చెక్కులను కూడా జ్ఞాపకంగా దాచుకొన్నాను. రచయతలు, కళాకారులను చాలా ఇష్టపడతారాయన. ఆర్జీవీని కలిసిన తర్వాత ఆయనంటే అపారమైన గౌరవం ఏర్పడింది.

రాఘవేంద్రరావుతో ప్రయాణం ఎలా మొదలైంది?
చంద్రబోస్‌: కొన్నేళ్ల క్రితం వాల్ట్‌ డిస్నీవారి ‘లయన్‌ కింగ్‌’ సినిమా వచ్చింది. దాన్ని సురేశ్‌బాబు తెలుగులో డబ్‌ చేయాలనుకున్నారు. అందులోని పాటలిచ్చి వాటన్నింటినీ తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. నెల రోజులు ప్రతి పదాన్ని, పాటను అర్థం చేసుకుంటూ మొత్తం 8 పాటలను అనువాదం చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో సురేశ్‌బాబు నాకు మరో అవకాశం ఇద్దామని అనుకున్నారేమో. ఓ రోజు ‘సాహసవీరుడు సాగరకన్య’ షూటింగ్‌లో రాఘవేంద్రరావు గారిని పరిచయం చేశారు. నా గురించి, నేను రాసిన పాట గురించి ఆయనకు చెప్పారు. రాఘవేంద్రరావు గారిని చూడటమే అదృష్టం. అలాంటిది ఆయన నాతో మాట్లాడాను. జీవితానికి అది చాలు అనుకున్నాను.  ఆ తర్వాత కొన్నాళ్లకు రాఘవేంద్రరావు గారు పిలుస్తున్నారని ఒక వ్యక్తి తీసుకెళ్లారు.  ‘పెళ్లిసందడి’ కోసం పాట రాసే అవకాశమిచ్చారు. రాఘవేంద్రరావు, కీరవాణిల అధ్వర్యంలో పాటలు రాయించారు. ఇక అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ‘సౌందర్య లహరి’ కోసం ఒక పాటను నిమిషం వ్యవధిలో రాయమన్నారు. ఆ సందర్భంగా నీకన్నా బాగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరన్నారు.  ‘మౌనం మాట్లాడుతోంది’ పాటను రాశాను. నిర్వాహకులు పారితోషకం ఇస్తామన్నారు. ఆయన నాకు ఎన్నో అవకాశాలిచ్చారు. సొంత కొడుకులా చూసుకున్నారు. ఆయన జీవితాన్నే ఓ పాటగా రాసే అవకాశం ఇచ్చారు. అంతకన్నా అదృష్టం ఏముంటుందని నేను డబ్బులేమీ తీసుకోలేదు. దానికి టైటిల్‌ రోల్స్‌ చివరన కృతజ్ఞతలు చంద్రబోస్‌ అని వేశారు. అది ఆయన గొప్పతనం. 

వంద అవమానాలను ఎదుర్కోవాలని ఒక పుస్తకంలో రాసుకున్నావట?
చంద్రబోస్‌: సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు చాలా అవమానాలు ఎదురయ్యాయి. నేను బాగా చదువుకున్న కాబట్టి కొంత గౌరవాన్ని ఆశించాను. ఎమ్‌ఏ తెలుగు చేశావా? బీటెక్‌ చేసి పాటలు రాయడమేంటి? ఎవరి దగ్గరైనా పనిచేశావా? ఎలా వస్తారయ్యా? లాంటి అవమానాలు జరిగేవి. ఇలా రెండు మూడు చోట్ల ఇలాంటి మాటలు ఎదురయ్యాయి. కనీసం పాట వినకుండా ఇలా అంటున్నారేంటని బాధపడ్డాను.  ఆ సమయంలో నన్ను నేనే ఉత్తేజపరుచుకోడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. వంద అవమానాలు జరిగే దాకా ప్రయత్నించి, అప్పటికీ ఫలితం దక్కకుంటే వెనక్కి వెళ్దామనుకున్నాను. ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎవరైనా నొచ్చుకున్నట్లు మాట్లాడితే వాటిని పుస్తకాల్లో రాసుకున్నాను. ఇలా 21 అవమానాల తర్వాత అవకాశం దక్కింది.  అక్కడి నుంచి అవమానాల స్థానంలో సన్మానాలు మొదలయ్యాయి. 
‘పుష్ప’లో ‘దాక్కో దాక్కో మేక’ పాట విన్నాను. అది ఎవరి ఆలోచన?
చంద్రబోస్‌: సుకుమార్‌ గారిదే. 
మీ నాన్న కోరుకున్నట్లే జాతీయ పురస్కారాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.
చంద్రబోస్‌: థాంక్యూ సర్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని