రివ్యూ చూడగానే కన్నీళ్లు వచ్చాయి: గోపాల్‌రెడ్డి - alitho saradaga latest promo with cinematographer gopal reddy bhargav
close
Published : 21/07/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ చూడగానే కన్నీళ్లు వచ్చాయి: గోపాల్‌రెడ్డి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను చేసిన మొదటి చిత్రం ‘ముద్ద మందారం’ రివ్యూ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్‌.గోపాల్‌రెడ్డి అన్నారు. ఆ రివ్యూలో ‘అన్ని బాగున్నాయి.. ఫొటోగ్రఫీ తప్ప’ అని రాశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఎస్‌.గోపాల్‌రెడ్డి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కమెడియన్‌ ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. తన సినిమా ప్రయాణం, పెళ్లి తదితర విషయాలు పంచుకున్నారు. ఇంకా గోపాల్‌రెడ్డి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

‘‘పని విషయంలో సీరియస్‌గా ఉండే నేను షూటింగ్‌ అయిపోయిన తర్వాత మాత్రం అందరితో మంచి స్నేహితుడిగా ఉంటా. ‘సిరిసిరి మువ్వ’ సినిమా సమయంలో ఓ అమ్మాయిని చూశాను. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆమెకు నా ప్రేమ వ్యక్తపరిచాను. అటు నుంచి కూడా సరే అనడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. అలా ఆయన రాజమండ్రి అల్లుడయ్యాను. మమ్మల్ని కలిపిన సినిమా ‘సిరిసిరి మువ్వ’. ఇప్పుడు వినిపిస్తున్న పాన్‌ ఇండియా సినిమాను అప్పట్లోనే నాగార్జునతో ప్లాన్‌ చేశాం. ‘హలో బ్రదర్‌’ తర్వాత ఆ సినిమా అనుకున్నాం. అయితే స్క్రిప్టులో మార్చాల్సి వచ్చింది. స్క్రిప్టు మార్చడం ఇష్టం లేకపోవడంతో మార్చే ప్రసక్తే లేదని చెప్పాను. అలా.. ఆ పాన్‌ ఇండియా ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒక్క రాఘవేంద్రరావు మినహా మిగతా దర్శకులంతా నా కోపానికి గురై నా చేతిలో తిట్లు తిన్నవారే. సినిమా షూటింగ్‌ సమయంలో చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగేవారు’’ అని గోపాల్‌ రెడ్డి అన్నారు.

ఎక్కువగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన గోపాల్‌రెడ్డి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ తన సత్తా నిరూపించుకున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశారాయన. 1990లో వచ్చిన క్షణక్షణం చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘వర్షం’, ‘శ్రీరామదాసు’ చిత్రాలకు ఆయనకు రెండుసార్లు దక్షిణాదిన ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా పురస్కారం లభించింది. 1983లో ఆనంద భైరవి, ఆ తర్వాత క్షణక్షణం, హలో బ్రదర్‌ చిత్రాలకు ఆయనను నంది అవార్డులు కూడా వరించాయి. 

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం జూలై 26న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని