Silicone Cookware: వీటితో వంట చేయడం ఎంతో ఈజీ! - all you need to know about silicone cookware in telugu
close
Published : 19/09/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Silicone Cookware: వీటితో వంట చేయడం ఎంతో ఈజీ!

వంట చేయడమంటే ఇది వరకు పెద్ద పనిగా భావించే వారు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద వంటైనా అలవోకగా పూర్తి చేసేస్తున్నారు అతివలు. అందుకు కారణం.. కాలక్రమేణా అనువుగా ఉండే కొత్త కొత్త వంట పాత్రలు పుట్టుకురావడమే! సిలికాన్‌ కుక్‌వేర్‌ కూడా అలాంటిదే! ఎటుపడితే అటు సులభంగా వంగేలా, హ్యాండీగా ఉండే ఈ వంటపాత్రల్లో వంట చాలా త్వరగా పూర్తవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బేకింగ్‌ చేసుకోవడానికి వీటికంటే అనువైన కుక్‌వేర్‌ లేదంటున్నారు. అంతేకాదు.. పర్యావరణహితమైన ఈ కుక్‌వేర్‌తో ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఢోకా లేదంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ సిలికాన్‌ కుక్‌వేర్‌? వీటిని వాడే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

సిలికాన్‌ అనేది సింథటిక్‌ రబ్బర్‌.. దీని తయారీలో వాడే ఆక్సిజన్‌, సిలికాన్‌, కార్బన్లు సహజసిద్ధమైనవి, సురక్షితమైనవని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ విభాగం (Food and Drug Administration) కూడా ఈ వంటపాత్రలు సురక్షితమైనవే అంటూ ఆమోదముద్ర వేసింది. అయితే వీటిలో వంట చేసే క్రమంలో వేడికి ఈ రబ్బర్‌ కరుగుతుందేమోనన్న సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ 428 డిగ్రీల ఫారన్‌హీట్‌/220 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఇవి తట్టుకోగలవని అంటున్నారు నిపుణులు. అలాగే ఉష్ణ నిరోధకాలు (Heat Resistant)గా, ఫ్రీజర్‌లో పెట్టేందుకు అనువుగా, ఒవెన్‌లో చేసే వంటకాల కోసం సైతం వీటిని ఉపయోగించుకోవచ్చు.

స్పూన్ల దగ్గర్నుంచి బ్రష్‌ల దాకా..!

సిలికాన్‌ కుక్‌వేర్‌/బేక్‌వేర్‌లో భాగంగా ప్రస్తుతం విభిన్న రకాల వంటపాత్రలు అందుబాటులోకొచ్చాయి. స్పూన్స్‌, స్పాచులాస్‌, బీటర్స్‌, బేక్‌వేర్‌ మౌల్డ్‌, కప్‌ కేక్‌ మౌల్డ్స్‌, ఫోల్డబుల్‌ పాట్‌/ప్యాన్‌, ఇతర వంట పాత్రలు, గ్రీజింగ్‌ బ్రష్‌.. వంటివి అందులో కొన్ని. వీటితో పాటు వేడి పాత్రల్ని ప్లాట్‌ఫామ్‌/డైనింగ్‌ టేబుల్‌పై పెట్టుకోవడానికి వీలుగా సిలికాన్‌ కుక్‌వేర్‌ ప్రొటెక్టర్స్‌, వేడిపాత్రల్ని పట్టుకోవడానికి సిలికాన్‌ గ్లోవ్స్‌ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వేడిని నిరోధించడమే వీటికున్న ప్రత్యేకత!

ప్రయోజనాలివే!

* ఇతర వంట పాత్రలతో పోల్చితే ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. ఆయా కుక్‌వేర్‌ సెట్‌ని బట్టి సుమారు రూ. 734 నుంచి రూ. 3,673 వరకు ఉంటుంది.

* అధిక వేడిని తట్టుకునే శక్తి ఉన్న ఈ వంటపాత్రల్లో ఆవిరి వంటలు, స్టీమ్‌ బేకింగ్‌ ఐటమ్స్‌ తయారుచేయడం సులభం!

* వంట చేసే క్రమంలో/బేకింగ్‌ సమయంలో.. ఒకేసారి ఉష్ణోగ్రతలు పెరిగినా, తగ్గినా.. సిలికాన్‌ వంట పాత్రలకు ఎలాంటి డ్యామేజ్‌ కాదని చెబుతున్నారు నిపుణులు. అందుకే డీప్‌ ఫ్రీజర్‌, ఒవెన్‌లలో పెట్టుకునే ఐటమ్స్‌ కోసం వీటిని ఉపయోగించచ్చు.

* సాధారణంగా బేకింగ్‌ చేసే క్రమంలో పాత్రలకు వెన్న పూసినా.. వాటి అవశేషాలు ఎంతో కొంత అంటుకుపోతాయి. కానీ సిలికాన్‌ బేక్‌వేర్‌తో ఆ సమస్య ఉండదు. అంతేకాదు.. ఇవి ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి కాబట్టి.. బేక్‌ చేసిన పదార్థాలు వీటి నుంచి వేరు చేయడం కూడా సులువవుతుంది. అలాగే వీటిని శుభ్రం చేయడమూ సులువేనట!

* ఇక ఇవి వేడికి రంగు మారవు.. పదార్థాల వాసన వీటికి అంటుకోదు.. ఎక్కువ కాలం మన్నుతాయి.

ఇలా ఎంచుకోవాలి?!

* నాణ్యమైన సిలికాన్‌ కుక్‌వేర్‌ని ఎంచుకున్నప్పుడే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ చేకూరతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మూడు అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి - సాధారణ సిలికాన్‌ కుక్‌వేర్‌తో పోల్చితే నాణ్యమైన వంటపాత్రల నుంచి రబ్బర్‌ తరహా వాసన వెలువడదు.. రెండోది - ఇవి ముట్టుకుంటే గట్టిగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. మూడోది - ఫుడ్‌ గ్రెయిన్‌ కోటింగ్‌ ఉన్నవి ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ పూత రసాయనాలు ఆహారంలో కలవకుండా అడ్డుగోడగా నిలుస్తుంది.

* గీతలు, పగుళ్లు లేని కుక్వేర్‌ని ఎంచుకోవాలి. తద్వారా వాటి తయారీలో వాడిన పదార్థాలు వేడికి బయటికి రాకుండా ఉంటాయి.

* వీటిని డిష్‌వాషర్‌లో వేయకూడదు.. అలాగే శుభ్రం చేయడానికి స్టీల్‌ స్క్రబ్బర్‌ని వాడకూడదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని