close
సినిమా రివ్యూ
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రివ్యూ: ఆండ్రాయిడ్‌ కట్టప్ప వెర్షన్‌ 5.25

చిత్రం: ఆండ్రాయిడ్‌ కట్టప్ప వెర్షన్‌ 5.25

నటీనటులు: సూరజ్‌ వెంజరమూడు, సౌబిన్‌ షాహిర్‌, సూరజ్‌ తెలక్కాడ్‌, కెండీ జింద్రో, సాయిజు కర్రప్‌ తదితరులు

సంగీతం: బిజిబల్‌

సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌

ఎడిటింగ్‌: శ్రీధరన్‌

నిర్మాత: సంతోష్‌ టి.కురువిల్లా

కథ, దర్శకత్వం: రతీష్‌ బాలకృష్ణన్‌ పొదువల్‌

విడుదల: ఆహా ఓటీటీ

కరోనా కారణంగా ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ప్రేక్షకులకు వినోదం పంచడం ద్వారా వారిని ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు అధికంగా వినియోగించేది యువతే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని వెబ్‌ సిరీస్‌లతో పాటు, ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులోకి అనువదిస్తున్నాయి. అలా ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప వెర్షన్‌ 5.25’. గతేడాది అక్కడ ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పించిందా? అసలేంటీ ఆండ్రాయిడ్‌ కట్టప్ప? ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది?

కథేంటంటే: వి.టి. భాస్కరరావు(సూరజ్‌ వెంజరమూడు) వృద్ధుడు. ఛాదస్తం ఎక్కువ. కనీసం ఇంట్లోకి అవసరమైన మిక్సీ, గ్రైండరే కాదు, మొబైల్‌ ఫోన్‌ కూడా వాడడు. సుబ్రహ్మణ్యం(సౌబిన్‌ షాహిర్‌) ఒక్కడే కొడుకు. చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతాడు. అతని చదువుకు తగిన ఉద్యోగం వచ్చినా ఏదో ఒక కారణం చెప్పి తండ్రి భాస్కరరావు కొడుకును ఇంటికి రప్పించేస్తాడు. ఎక్కడకు వెళ్లినా రాత్రికి ఇంటికి వచ్చేయాలంటాడు. ఒకరోజు రోబోలను తయారు చేసే జపాన్‌ కంపెనీ నుంచి జాబ్‌ ఆఫర్‌ వస్తుంది. రష్యా బ్రాంచ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. తండ్రితో గొడవపడి రష్యా వెళ్తాడు సుబ్రహ్మణ్యం. అదే సమయంలో వృద్ధుడైన తండ్రికి తోడుగా ఒక పనిమనిషిని పెట్టి వెళ్తాడు. భాస్కరరావును ఆమె సరిగా పట్టించుకోదు. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిసిన సుబ్రహ్మణ్యం తాను పనిచేస్తున్న కంపెనీలో తయారు చేసిన ఒక రోబోను తీసుకుని తండ్రి వద్దకు వస్తాడు. దాన్ని తన తండ్రికి సహాయకుడిగా ఏర్పాటు చేసి, రష్యా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మొబైల్‌ ఫోన్‌ కూడా వాడని భాస్కరరావు ఆ రోబోతో ఎలా కలిసిపోయాడు? అది చేసే పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? దాని వల్ల అతనికి ఏదైనా ఆపద ఏర్పడిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘ఘటోత్కచుడు’, ‘రోబో’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రాలు. ఒక రోబో మనుషులతో కలిసిపోయి వారి అవసరాలను తీరుస్తూ, చకచకా ఇంటి పనులు చేస్తూ తెరపై కనిపిస్తుంటే చిన్నా, పెద్దా అందరూ ఆశ్చర్యపోతూ చూశారు. ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ అలాంటి సినిమానే. అయితే, దర్శకుడు దీనికి పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. అసలు టెక్నాలజీ అంటేనే పడని ఓ వృద్ధుడు రోబోతో కలిసి ఎలా జీవించాడన్నది భావోద్వేగభరితంగా చూపించాడు. భాస్కరరావు, అతని కొడుకు సుబ్రహ్మణ్యం పరిస్థితులను వివరిస్తూ చిత్రాన్ని ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలన్నీ నేటి మధ్యతరగతి కుటుంబాలను అద్దం పట్టాయి. సమాజంలో తమ కొడుకు/కూతురు అత్యున్నత స్థానాలకు చేరాలని కోరుకుంటూ ఎంతో మంది తల్లిదండ్రులు వారిని ఉన్నత చదువులు చదివిస్తారు. అయితే, ఆ చదువుకు తగిన ఉద్యోగం రావాలంటే కన్నవారిని, ఉన్న ఊరిని వదలి వెళ్లాల్సిన పరిస్థితి ప్రతి కుటుంబంలోనూ మనకు కనిపిస్తుంది. దాన్నే గుండెలకు హత్తుకునేలా చూపించాడు దర్శకుడు.  ఆయా సన్నివేశాలన్నీ భావోద్వేగంతో సాగుతాయి. పుట్టిన ఊరిని వదిలి కొడుకుతో పట్టణాలకు వెళ్లలేక తల్లిదండ్రులు పడే వేదన అందరికీ తెలిసిందే. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు వచ్చే పని మనుషులు ఎలా వ్యవహరిస్తారు? వాళ్ల చర్యల వల్ల తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడతారన్నది కళ్లకు కట్టారు. ప్రథమార్ధమంతా ఈ సన్నివేశాలతో నడిపిన దర్శకుడు విరామ సమయానికి పల్లెటూరికి మరమనిషి రాకతో తర్వాత ఏం జరుగుతుందని ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించాడు.

ద్వితీయార్ధంలోనే అసలు కథ మొదలవుతుంది. తొలుత రోబోను అంగీకరించని భాస్కరరావు ఒక సంఘటనతో దాన్ని నమ్మడం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి భాస్కరరావు-కట్టప్ప ఇద్దరూ స్నేహితుల్లా మారిపోతారు. భాస్కరరావుకు ప్రతి పనిలోనూ కట్టప్ప సహకరిస్తుంటాడు. కొడుకులేని లోటును తీరుస్తుంటాడు. ఊళ్లోనూ కట్టప్పకు మంచి క్రేజ్‌ వస్తుంది. భాస్కరరావు దాన్ని ఒక మరమనిషిలా చూడటం మర్చిపోయి, సొంత బిడ్డలా భావిస్తాడు. ఎంతలా అంటే, దాన్ని జ్యోతిషుడి దగ్గరకు తీసుకెళ్లి జాతకం చూపించడమే కాదు, గ్రహశాంతికి పూజలు కూడా చేయిస్తాడు. ఇక్కడే దర్శకుడు సమాజంలో ఉన్న కుల, మత భేదాలను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ‘భవిష్యత్‌లో కులానికి, మతానికి ఎలాంటి స్థానం ఉండదు. అలాంటి చెడు ఆలోచనలు వదిలేస్తే, నువ్వు భవిష్యత్‌లో జీవించినట్టే’ వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మరమనిషిని తిరిగి జపాన్‌ కంపెనీకి ఇచ్చేయాలని సుబ్రహ్మణ్యం చెప్పిన సందర్భంలో భాస్కరరావు పడే ఆవేదన మనల్నీ కంటతడి పెట్టిస్తుంది. ‘కొడుకుగా నీ స్థానాన్ని వాడు భర్తీ చేయలేడు. వాడి స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవు’, ‘ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అందుకని పిల్లల్ని కనడం మానేశారా’, ‘మనం కూడా దేవుడు రాసిన ప్రోగ్రామ్‌లో బొమ్మలమే, మీ పరిభాషలో దాన్ని చెప్పాలంటే తలరాత అంటాం’ వంటి డైలాగ్‌లు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఒక చక్కటి క్లైమాక్స్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు. సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు బరువెక్కిన గుండెలతో భాస్కరరావు, కట్టప్పల జ్ఞాపకాలు వెంటాడతాయి.

ఎవరెలా చేశారంటే: మలయాళ చిత్రాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అందులో నటించే నటీనటులు పెద్ద పెద్ద స్టార్‌లు అయినా, ఆ పాత్రల్లో ఒదిగిపోతారు. ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’లో ఏ పాత్ర నటించినట్లు కనిపించదు. భాస్కరరావు, సుబ్రహ్మణ్యం, హిటోమి, ప్రసన్నలతో పాటు తెరపై కనిపించే ప్రతి నటుడు వారి వారి పాత్రల్లో జీవించారు. తమ సహజ నటనతో కట్టిపడేశారు. ముఖ్యంగా భాస్కరరావుగా పాత్ర పోషించిన సూరజ్‌ వెంజరమూడు తన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు. సూరజ్‌ తెలక్కాడ్‌ నిజమైన ‘రోబో’గా చక్కగా నటించాడు. ఇక తెలుగులో భాస్కరరావు పాత్రకు శుభలేక సుధాకర్‌తో పాటు, మిగిలిన పాత్రలకు కూడా డబ్బింగ్‌ చక్కగా కుదిరింది. సంభాషణలు చిరునవ్వులు పంచుతాయి.

ఇక ఈ సినిమాకు సాంకేతిక వర్గం పనిచేసిన తీరు అద్భుతం. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు. అదంతా తెరపై కనిపిస్తుంది. బిజుబల్‌ సంగీతం సినిమాలో మనల్ని లీనం చేస్తుంది. పాటలు కూడా కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. సాను వర్గీస్‌ ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించారు. భాస్కరరావు-కట్టప్పల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చక్కగా ఉంటుంది. క్లైమాక్స్‌లో కేరళ అడవుల్లో రోబోతో కలిసి ఒక మనిషి నడిచి వెళ్తుంటే ఆ చక్కని దృశ్యాలకు సరైన వేదిక వెండితెర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం థియేటర్లో చూసే పరిస్థితి లేదు కాబట్టి, మొబైల్‌లో చూసి ముచ్చట పడాల్సిందే. శ్రీధరన్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండేది. బహుశా మలయాళంలో విడుదలైన చిత్రాన్ని ఎలాంటి కోతలు లేకుండా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారేమో. దర్శకుడు రతీశ్‌ బాలకృష్ణన్‌ ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ను తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. మొదటి సినిమానే అయినా ఎంతో భావోద్వేగభరితంగా చూపించాడు. ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, ప్రేక్షకుడికి కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. కథాగమనం కూడా నెమ్మదిగా ఉన్నా, రోబో చేసే పనులతో అది పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు బలహీనతలు
+ నటీనటులు - ప్రారంభ సన్నివేశాలు
+ దర్శకత్వం - నెమ్మదిగా సాగే కథాగమనం
+ సాంకేతిక బృందం పనితీరు  
 


 

 

 

 

చివరిగా: ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’.. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారప్ప!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.