డెలివరీకి వారం ముందు కరోనా: హరితేజ - before delivery a tested positive for covid
close
Published : 29/04/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డెలివరీకి వారం ముందు కరోనా: హరితేజ

తనకి ఎదురైన ఇబ్బందుల గురించి నటి ఏమన్నారంటే

హైదరాబాద్‌: సరిగ్గా మరో వారంలో డెలివరీ అనగా.. తాను కరోనా బారినపడ్డానని నటి, ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత హరితేజ తెలిపారు. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ భావోద్వేగ వీడియోని షేర్‌ చేశారు. డెలివరీ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకొన్నారు. డెలివరీకి కొన్నిరోజుల ముందు ఇంటిల్లిపాది కొవిడ్‌బారిన పడడంతో తాను ఎంతో బాధపడ్డానని ఆమె అన్నారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి కూడా కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

‘డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా ఉందని.. సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. బేబీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోనివిధంగా మా కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతో కంగారుగా, భయంగా అనిపించింది. అప్పటివరకూ నాకు వైద్యం అందించిన డాక్టర్లు డెలివరీ చేయలేమని చెప్పారు. దాంతో నేను కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాను. నా భర్తకు నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. సర్జరీ అనంతరం పాప పుట్టింది. పాపకు కొవిడ్‌ పరీక్ష చేయగా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది‌. దాంతో పుట్టిన వెంటనే బేబీని నాకు దూరంగా ఉంచారు. రోజూ వీడియో కాల్స్‌ చేసి బేబీని చూసేదాన్ని. పాపకు పాలు ఇవ్వడానికి కూడా లేదు. నాకెంతో బాధగా అనిపించేది. చికిత్స అనంతరం నన్ను ఇంటికి పంపించారు. దేవుడు దయ వల్ల మా ఇంట్లో వారందరికీ నెగటివ్‌ వచ్చింది’’ అని హరితేజ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని.. మంచి ఆహారం తీసుకోవాలని.. జనసమూహాలకు దూరంగా ఉండాలని హరితేజ సూచించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని