ఒకే ఒక్క విజయం - bollywood Movies Released In 2020
close
Updated : 30/12/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే ఒక్క విజయం

సత్తా చాటిన అజయ్‌ దేవగణ్‌ ‘తానాజీ’

బాలీవుడ్‌కి ఈ ఏడాది అంతా నష్టమే

బై.. బై 2020

2020...హిందీ చిత్ర సీమకు మర్చిపోలేని సంవత్సరం. కరోనా కొట్టిన దెబ్బకు బాలీవుడ్‌ విలవిలలాడిపోయింది. ఏడాది ఆరంభంలో ‘తానాజీ’ రూపంలో భారీ విజయం దక్కడంతో మంచి శుభారంభం అనుకున్నారు. కానీ ఆ తర్వాత మూడు నెలలు సరైన విజయాలే లేవు. వేసవిలో ఆ లోటు తీరుద్దామనుకున్నా కరోనా కారణంగా అదీ నెరవేరలేదు. థియేటర్లు మూతపడటంతో ద్వితీయార్ధంలో దుమ్ములేపేద్దాం అనుకున్న భారీ చిత్రాలు  2021కి వెళ్లిపోయాయి. దీంతో భారీ నష్టాలు తప్పలేదు. బాలీవుడ్‌కి విజయాన్ని రుచి చూపించిన ఒకే ఒక్కడు ‘తానాజీ’. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న విడుదలై హిట్‌గా నిలిచింది. రూ.300కోట్ల పైనే వసూళ్లు సాధించింది. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా, కాజోల్‌ ప్రధాన పాత్రలో ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మరాఠా యోధుడు తానాజీ పాత్రలో అజయ్‌దేవగణ్‌ ఒదిగిపోయారు. ఈ ఏడాదిలో బాలీవుడ్‌కి చెప్పుకోదగ్గ విజయం అంటే ‘తానాజీ’ ఒక్కటే.

ఓ మోస్తరుగా...

టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భాఘీ 3’ భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.135కోట్లు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. వరుణ్‌ధావన్‌, శ్రద్ధాకపూర్‌ ప్రధాన పాత్రల్లో రెమో డిసౌజా తెరకెక్కించిన డ్యాన్స్‌ నేపథ్య చిత్రం ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’. ఈ సినిమా కూడా ఫర్వాలేదనిపించినా వసూళ్లు అందుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.97కోట్లు సాధించింది.

మెప్పించినా.. వసూళ్లు లేవు

బాక్సాఫీసుకు నాయికా చిత్రాల సత్తా చాటడంలో ఈ ఏడాది నాయికలు విఫలమయ్యారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా వసూళ్లు రాబట్టలేకపోయారు. యాసిడ్‌ దాడి బాధితురాలు జీవిత కథతో తెరకెక్కిన ‘ఛపాక్‌’లో నటించింది బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె. ఈ సినిమా ప్రేక్షకుల్ని చేరుకోలేకపోయింది. బాలీవుడ్‌ బాక్సాఫీసుకు నాయికా ప్రాధాన్య చిత్రాల సత్తా ఏంటో తెలియ  జెప్పిన కంగనా రనౌత్‌ ఈ ఏడాది డీలాపడిపోయింది. ఆమె కబడ్డీ క్రీడా కారిణిగా తెరకెక్కిన చిత్రం ‘పంగా’. నటన పరంగా కంగనాకు మంచి మార్కులే పడినా రొటీన్‌ చిత్రంగా   మిగిలింది. ఇక తాప్సి ప్రధాన పాత్రలో నటించిన ‘థప్పడ్‌’ మంచి పేరు తెచ్చుకుంది. వసూళ్లు మాత్రం రాలేదు.

అంచనాలు తప్పాయి

కచ్చితంగా హిట్‌ కొట్టి తీరుతాయి అనుకున్న సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశాపటానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘మలంగ్‌’. ట్రైలర్‌, ప్రకటన చిత్రాల ద్వారా భారీ స్థాయిలో ఆసక్తి రేపినా మెప్పించలేకపోయింది. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ వసూళ్లు అందుకోలేక పోయింది. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో ధర్మ ప్రొడక్షన్స్‌ తెర  కెక్కించిన హారర్‌ చిత్రం ‘భూత్‌ పార్ట్‌ 1: ది హాంటెడ్‌ షిప్‌’. ఈ చిత్రాన్ని ట్రయాలజీగా తీయాలనుకున్నారు కానీ ప్లాఫ్‌ కావడంతో ఈ సిరీస్‌లో మిగిలిన చిత్రాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిచూపించడం లేదని సమాచారం.

కొవిడ్‌ నష్టం భారీగానే...

కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడటంతో విడుదల   కావాల్సిన భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు  రాలేకపోయాయి. ఇది చిత్ర పరిశ్రమను భారీ ష్టాల్లోకి నెట్టేసింది. సాధారణంగా బాలీవుడ్‌ ఏటా సుమారు 200 చిత్రాలు విడుదలవుతాయి. మొత్తంగా రూ.3000 కోట్లు వసూళ్లు వస్తుంటాయని అంచనా. ఈసారి  రూ.600కోట్లు మించి వసూళ్లు రాలేదు. రాజస్థాన్‌లో పంపణీదారుడుగా ఆరు దశాబ్దాల అనుభవం ఉన్న రాజ్‌ భన్సల్‌ మాట్లాడుతూ ‘‘రాజస్థాన్‌లో ఇప్పటికీ థియేటర్లు తెరచుకోలేదు. జనవరికీ గానీ తెరచే పరిస్థితి లేదు. ఈ ఏడాది వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవడం సాధారణ విషయం కాదు. థియేటర్లు తెరిచాకా భారీ చిత్రాలు వరసగా థియేటర్లులోకి వస్తేనే కొంత ఉపశమనం కలుగుతుంది’’అని చెబుతున్నారు.

ఓటీటీకి వెళ్లక తప్పలేదు

థియేటర్లు మూతపడిన స్థితిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది ఓటీటీ వేదికలే. కరోనా కష్టకాలంలో చాలామంది నిర్మాతలకు ఇవే వరంగా మారాయి. చిన్నవే కాదు కొన్ని భారీ చిత్రాలూ ఈ బాట పట్టక తప్పలేదు. అమితాబ్‌బచ్చన్‌,  ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘గులాబో సితాబో’ కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైన తొలి చిత్రం. దీనికి భారీస్థాయిలో స్పందన రాకపోయినా ప్రేక్షకులు బాగానే చూశారు. ఆ తర్వాత సుశాంత్‌ రాజ్‌పూత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బెచారా’ ఓటీటీలోనే విడుదలై ఆదరణ పొందింది. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలా దేవి’, నవాజుద్దీన్‌ సిద్దిఖీ ‘రాత్‌ అఖేలీ హై’, జాన్వీకపూర్‌ ‘గుంజన్‌ సక్సేనా’, అలియా భట్‌, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సడక్‌ 2’, ఇషాన్‌ ఖత్తర్‌ ‘ఖాలీపీలీ’, రాజ్‌కుమార్‌ ఛల్లాంగ్‌ లాంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లక్ష్మి’ ఓటీటీలో విడుదలైనా మెప్పించలేకపోయింది. భూమి పెడ్నేకర్‌ ‘దుర్గామతి’, వరుణ్‌ధావన్‌ ’కూలీ నెం.1’ ఈ నెల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. థియేటర్లు తెరిచాకా   విడుదలైన మనోజ్‌ బాజ్‌ పాయ్‌ నటించిన ‘సూరజ్‌ పే మంగళ్‌ భరీ’, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఇందూ కీ జవానీ’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆశించినంతగా థియేటర్లకు తీసుకురాలేకపోయాయి.

ఇదీ చదవండి
రామోజీరావు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు: మయూరిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని