వీళ్లు అంత ఈజీగా స్టార్లు అయిపోలేదు! - bollywood hero and financial struggles
close
Updated : 15/06/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీళ్లు అంత ఈజీగా స్టార్లు అయిపోలేదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందమైన శిల్పాన్నే చూస్తారంతా... అలా మారడానికి అది తిన్న దెబ్బలు ఎన్నో ఎవరికి తెలుసు? మెరిసే బంగారాన్నే చూస్తారంతా.. అది అలా జిగేల్‌ మనడానికి ఎంత వేడిని తట్టుకుందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు శిల్పాల్లా ఆకట్టుకుంటున్న, బంగారంలా మెరుస్తున్న మన సినీతారలు ... ఎన్నో కష్టాలు పడినవారే. ప్రస్తుతం సక్సెస్‌బాటలో పరిగెడుతూ.. వందల కోట్లను ఆర్జిస్తున్న బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, షారుఖ్‌ఖాన్, గోవిందా జీవితాల్లో ఎన్నో ఆర్థిక కష్టాలు దాటుకొని ఈ స్థాయికి చేరుకున్నారు.

వాష్‌రూమ్స్‌ కడిగి... 

ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న షారుఖ్‌.. సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబయికి పయనమైన రోజులను గుర్తు తెచ్చుకునేందుకు ఎప్పుడూ సిగ్గుగా భావించనని చెబుతాడు. ‘‘ముంబయి నగరంలో అడుగుపెట్టినప్పుడు చేతిలో పైసా లేదు. తినడానికే ఆలోచించాల్సిన పరిస్థితి. కడుపు మాడ్చుకొని గడిపిన రోజులు ఎన్నో. ఇక నిద్రపోవాలంటే ఒబెరాయ్‌ హోటల్‌ బయటనే. రోజు గడవడానికి హోటల్లోని వాష్‌రూమ్స్‌ శుభ్రం చేసే పనిని ఎంచుకున్నా. ఓటమి అంటే నాకు భయం. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను ఎన్నో ఓటములు చవి చూశా. ఆ రోజుకి ఇంటి అద్దె చెల్లించాలి. కానీ, నా చేతిలో డబ్బులు లేవు. సామాన్లను, మమ్మల్ని రోడ్డు మీదకు నెట్టేశారు. ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు చూశా.’’ అంటూ అవకాశాల కోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటారు.


పాతాళం నుంచి ఎవరెస్టంత ఎత్తుకు..

బాలీవుడ్‌లో అధిక విజయాలు నమోదు చేసుకున్న కథానాయకుల్లో అమితాబ్‌ ఒకరు. ఆయన కెరీర్‌ ఆరంభంలో వరుసగా 7 సినిమాలు కలిసిరాలేదు. అయినా ఆయన నిరాశ పడలేదు. ‘జంజీర్‌’, ‘దివార్‌’, ‘షోలే’ వంటి హిట్లతో స్టార్‌గా మారారు. సినీ రంగంలో మరింత బలంగా తనదైన ముద్రవేయాలనే ఉద్దేశంతో ‘అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌)’ను స్థాపించారు. ఎన్నో ఈవెంట్లూ నిర్వహించారు. సినిమాలూ నిర్మించారు. ఈ రెండింటితో ఆర్థికంగా అధిక నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అప్పులపాలయ్యారు. ఒకానొక సందర్భంలో ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఇంటిని సైతం తాకట్టు పెట్టారు. ఎటు చూసినా కష్టాలే పలకరిస్తున్న వేళ..  రియాల్టీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ద్వారా మళ్లీ బిగ్‌బీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ‘బ్లాక్‌’, ‘పా’, ‘సర్కార్‌’, ‘పింక్‌’, ‘గులాబో సితాబో’ ఇలా ఎనభైఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ‘నువ్వు సినిమాలకు పనికి రావ’ని బయటకు పంపిన చోటే... మహావృక్షమై నిలిచారు. ‘ఇక అమితాబ్‌ పని అయిపోయింది’ అన్నప్పుడల్లా... మళ్లీ కొత్తగా పుట్టారు. భారతీయ సినీ పరిశ్రమలో హిమాలయమంత ఎత్తుకు ఎదిగారు. ‘‘ఓడిపోయినప్పుడు.. నిరాశ పడకూడదు. తప్పులు తెలుసుకోవాలి. దిద్దుకోవాలి. ముందుకు సాగాలి. మన పని చిత్తశుద్ధితో చేస్తే చాలు... విజయం తప్పక వరిస్తుంది.’’ అని చెప్పే అమితాబ్‌ ఎన్నో దెబ్బలు తిని శిల్పంగా మారారు. 


రిక్షా ఎక్కడానికి డబ్బులేక...

గోవిందా.. పూర్తిపేరు గోవిందా అరుణ్‌ అహుజా. గోవిందా ఎనర్జీనే కాదు.. నటనా, నృత్యాన్ని చూసినా మనకూ ఊపు వచ్చేస్తుంది. 90వ దశకంలో అలరించిన గోవిందా.. నేటి తరం నాయకులతోనూ అదే రీతిలో నటిస్తుంటారు. నాన్న అరుణ్‌ నటులైనా... నిలుదొక్కుకోవడం అంత సులువుగా జరగలేదు.  ‘రాజాబాబు’, ‘కూలీ నం.1’, ‘దివానా మస్తానా’, హీరో నం.1’ వంటి విజయాలు ఆయన ఖాతాలో ఊరికే పడలేదు. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రుల కష్టముంది. తర్వాత చాలా సినిమాలు విజయం సాధించలేకపోయాయి. హీరోగా ఎదిగిన ఆయన ‘షికారీ’ చిత్రంలో విలన్‌గానూ నటించారు. ఇదీ కలిసిరాలేదు. ఒకానొక సమయంలో పరిశ్రమలో అవకాశాలే లేకుండా పోయాయి. దానితోడు చేతిలో చిల్లిగవ్వ లేదు. పైగా అప్పులు. ‘‘డబ్బులు ఎక్కడ ఖర్చుచేయాల్సి వస్తుందోనని రిక్షాలో ప్రయాణించకుండా నడిచినా సందర్భాలెన్నో’’ అని ఎన్నోసార్లు చెప్పారు. ఇలా జీవితంలో ఒడిదొడుకులు ఎన్నో చూసిన గోవిందా తర్వాత ఎంపీగానూ గెలిచి ప్రజాసేవలో పాల్గొన్నారు. ‘‘ఏదీ ఊరికే రాదు. నాకు విజయాలున్నప్పుడు అంతా నా చుట్టే ఉండేవారు. నేను ఫ్లాపుల్లోకి వెళ్లాక.. పలకరించేవారు కరవయ్యారు. అయినా నేను నిలదొక్కుకున్నా’’ అని చెప్పే గోవిందా రాత్రి చీకట్లను దాటుకొని వచ్చిన కిరణంలా నిలుస్తాడు.


వెయిటర్‌ టూ ఫొటోగ్రాఫర్‌గా...

భాషతో సంబంధం లేకుండా పాత్రలో ఇమిడిపోయే నటుడు బొమన్‌ ఇరానీ. ఆయన పుట్టిన వెంటనే తండ్రి చనిపోవడంతో కష్టాల సముద్రాన్ని ఈదారు. స్పీచ్‌, లెర్నింగ్‌ డిసేబిలిటీస్‌ ఉన్న ఆయనకు దాన్నుంచి బయటపడేందుకు పాటలు నేర్చుకున్నారు. ఒకసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు వాళ్లమ్మ ఆ పాటని రికార్డ్‌ చేసి వినిపించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక తండ్రి స్థానంలో కుటుంబ బాధ్యతని నెట్టుకొచ్చేందుకు తాజ్‌హోటల్‌ మేనేజర్‌ని కలిసి రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్‌లో పని అడిగారట బొమన్‌. పనిలో చేరే ముందు ఆ మేనేజర్‌ చెప్పిన మాటలు.. ‘‘ జీవితంలో ఎత్తుకు ఎదగాలనుకుంటే కింద నుంచే రావాలి’’ అలా రూమ్‌ సర్వీస్‌తో ప్రారంభమైంది ఆయన కెరీర్‌. అలా ఏడాదిన్నర వరకూ వెయిటర్‌గా అక్కడే కొనసాగారు. పెళ్లి తర్వాత శ్రీమతి సలహాతో నచ్చిన పనిని ఎంచుకుని అందులో విజయం సాధించాలనుకున్నారు. దీంతో ఆయనకు ఇష్టమైన ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. వెయిటర్‌గా ఉన్నప్పుడు వచ్చిన టిప్‌తో కెమెరా కొని అందులో క్రీడల ఫొటోలు తీసి రూ.20, 30కి అమ్మేవారు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవారు. ఒకరోజు స్నేహితుడి సలహా మేరకు యాడ్‌ ఆడిషన్‌కి వెళ్లి దానికి ఎంపికయ్యారు. అలా 180 యాడ్స్‌లో నటించి మెప్పించాక.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన కెమెరాలోనే తీయడం మరో విశేషం. లోబడ్జెట్‌తో తీసిన ఆ చిత్రమే బొమన్‌కు టర్నింగ్‌ పాయింట్‌. అది చూసిన విధు వినోద్‌ చోప్రా సినిమాలో నటించమని రూ.2లక్షలు ఆఫర్‌ చేశారు. అలా వరుసగా బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌3’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజూ’లో నటించి గుర్తింపు పొందారు. అంతేకాదు.. తెలుగులోనూ ‘అత్తారింటికి దారేది’, ‘పవర్‌’ చిత్రాలతో తెలుగుతెరపై మెరిశారు. 


దిల్లీలో వాచ్‌మెన్‌గా..

ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉన్న నటుల్లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఒకరు. ఆయన బాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు వాచ్‌మెన్‌గా పనిచేశారు. 1999లో ‘సర్ఫరో’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నవాజుద్దీన్‌కి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునేందుకు 10ఏళ్లు పైనే పట్టింది. సినిమా తొలిరోజుల్లో నిలదొక్కుకునేందుకు నటనలో శిక్షణ తీసుకొని ముంబయికి వచ్చారాయన. రోజూ ఉదయం, బయోడేటా, ఫొటోలు పట్టుకొని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏ పాత్రలోనూ నటించే అవకాశం రాలేదు. 70ఎంఎం స్ర్కీన్‌ కాకపోయినా బుల్లితెరలో నటించినా చాలు అనుకున్నా అక్కడా నిరాశే ఎదురైంది. ఇక బతకడమే కష్టంగా రోజులు మారాయి. చేతిలో డబ్బులు లేవు. ఒంట్లో శక్తి లేదు. కడుపులో ఆకలికేకలు.. వీటన్నింటి మధ్య 13కి.మీ.. అంథేరీ నుంచి బంద్రాకి ప్రయాణం చేశారు.. మార్గం మధ్యలో ఆకలేస్తుంటే రోటీలు ఇస్తే కడుపు నింపుకున్న ఆ రోజులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారాయన. ఇలాంటి కష్టాలెన్నో చూసిన నవాజుద్దీన్‌ నమ్మిన సూత్రం ఒకటే.. ‘‘మనలో ప్రతిభ ఉంటే చాలు.. కాస్త ఆలస్యమైనా విజయం తప్పక వరిస్తుందని, అలాగే ఏ నేపథ్యంలో వచ్చామన్నది కూడా అనవసరం’’ అని చెబుతారాయన. లంచ్‌బాక్స్‌, మాంటో, రామన్‌ రాఘవ్‌ 2.0 చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మిం ఫెస్టివల్‌లో ఆయన నటించిన 8చిత్రాలు ప్రదర్శించడం ఒక గొప్ప ఘనతైతే.. ప్రపంచంలో ఇలాంటి గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు నవాజుద్దీన్‌  కావడం విశేషం.


వెయిటర్‌ నుంచి ఫోర్బ్స్‌ జాబితా వరకూ..

జాతీయ అవార్డు , పద్శశ్రీ, ఫిలింఫేర్‌.. ఇలా అవార్డులు ఒకవైపు.. మహిళా సాధికారత, ప్రజలకు సామాజిక సమస్యలపై తన చిత్రాల ద్వారా అవగాహన కల్పించడం.. ఇలా చేయడం ఒక్క అక్షయ్‌ కుమార్‌కే సాధ్యం. కెరీర్‌ ప్రారంభంలో మేరేం చేశారని అడిగితే ఆయన చెప్పే జవాబు వెయిటర్‌ అని.. పంజాబీ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీలో పుట్టిన ఆయన.. యాక్టింగ్‌ మీద మక్కువతో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునేందుకు బ్యాంకాక్‌ వెళ్లారు. దీని కోసం చదువుని సైతం పక్కన పెట్టేశారు. తన కలలు అనేది ఖర్చుతో కూడుకున్న విషయమని తెలుసుకున్న అక్షయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ సమయంలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేశారు. ఇందుకోసం వెయిటర్‌, చెఫ్‌ అవతారాలు ఎత్తారాయన.. అలా బ్లాక్‌బెల్ట్‌తో భారత్‌లోకి అడుగుపెట్టారు. ఇవే కాకుండా కోల్‌కతాలో కొన్నాళ్లు ప్యూన్‌గా పనిచేశారు. ఆపై బంగ్లాదేశ్‌కు చేరుకొని సేల్స్‌మేన్‌ అవతారమెత్తారు. ఇదికాకుండా దిల్లీలో బంగారం వ్యాపారస్థుడిగా మారారు.. ఇవన్నీ చేసినా సంతృప్తి దొరక్క ముంబయిలో మార్షల్‌ ఆర్ట్స్‌లో జాబ్‌ చేశారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు ముంబయిలో ఆయన దగ్గర మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునే విద్యార్థులు ఆయన శరీరాకృతిని చూసి మోడలింగ్‌ రంగానికి వెళ్లమని.. అలా చేస్తే ఆర్థికంగానూ స్థిరపడొచ్చని సలహా ఇచ్చారట. కేవలం ఫ్రీ ఫోర్ట్‌ఫొలియో షాట్‌ కోసం జయేష్‌ సేథ్‌ అనే ఫొటో గ్రాఫర్‌ వద్ద అసిస్టెంట్‌గా కూడా చేశారు అక్షయ్‌.. అలా బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా వచ్చే డబ్బును దాచుకొని జీవనం కొనసాగించాడు. కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఏమిటి అంటే .. ఒకరోజు మోడలింగ్‌కి వెళ్లేటప్పుడు బెంగళూరు ఫ్లైట్‌ మిస్‌ అవ్వడంతో నిరాశ చెందానని. .అయినా ఆ రోజుని పాడుచేయకుండా తన ఫొటోలు తీసుకొని ఫిల్మ్‌ స్టూడియోల చుట్టూ తిరిగితే.. తన మొదటి చిత్రం  సౌగంధ్‌లో అవకాశమొచ్చిందని చెబుతారు అక్షయ్‌. నమస్తే లండన్‌, హాలిడే, సింగ్‌ ఈజ్‌ కింగ్‌, ప్యాడ్‌మ్యాన్‌ అలా వెయిటర్‌గా చేసిన ఆయన ఫోర్బ్స్‌-2020లోనూ చోటు సంపాదించుకున్న భారతీయ నటుడిగా పేరొందారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని