Cinema News: ఆ సవరణపై.. అసంతృప్తి - celebrities open on cinematography act
close
Published : 03/07/2021 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఆ సవరణపై.. అసంతృప్తి

సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై సినీ వర్గాల అభ్యంతరం  

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భారతీయ చిత్ర పరిశ్రమ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్‌.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో అసంతృప్తి రగులుతోంది. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తమిళ నటులు కమలహాసన్, సూర్య లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సినిమాటోగ్రఫీ చట్టంలో ఎలాంటి మార్పులు చేయాలని నిర్ణయించింది? అనేది ఆసక్తికరంగా మారింది.

1952లో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 2013లో జస్టిస్‌ ముఖల్‌ ముగ్దల్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. 2016లో శ్యామ్‌ బెనగల్‌ నేతృత్వంలో మరో కమిటీని నియమించి సినిమా ప్రదర్శనలకు అవసరమైన ధ్రువీకరణపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. ఈ రెండు కమిటీలు తమ నివేదికను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు సమర్పించారు. కమిటీ నివేదికలను పరిశీలించిన కేంద్రం... సినిమాటోగ్రఫీ చట్టం 2021 ముసాయిదా బిల్లును రూపొందించింది.

1. సవరణల ప్రతిపాదనలపై జులై 2వరకు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ జూన్‌ 18న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన ఇచ్చింది. చట్టంలో సవరించాలని భావిస్తున్న ప్రతిపాదనలు అందులో వివరించింది. జారీ చేసిన ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ ఛైర్మన్‌ను   ఆదేశించే అధికారం కేంద్రానికి ఉండేలా చట్టాలను సవరిస్తామని ప్రతిపాదించింది. సినిమా ప్రదర్శనలకు జారీ చేసే యు, ఏ, యుఏ, ఎస్‌ సర్టిఫికెట్లతోపాటు యూఏ సర్టిఫికెట్‌కు అదనంగా మరిన్ని మార్పులను ప్రతిపాదించింది.

2. యూఏ సర్టిఫికెట్‌ 1983లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఆ సర్టిఫికేట్‌ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు పైబడిన వారు చూసేలా.. మూడు విభాగాలుగా విభజించింది కొత్త సవరణ.

3. సర్టిఫికేషన్‌ కాలపరిమితి 10 ఏళ్లు చెల్లుబాటు ఉండగా.. ఉత్తర్వుల ద్వారా ఆ కాలపరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన చట్ట సవరణలను చేయనున్నట్లు తెలిపింది.

4. పైరసీ వల్ల సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి వరకు సరైన చట్టం లేదని గ్రహించారు. సినిమా పైరసీకి పాల్పడితే కనిష్ఠంగా 3 నెలలు, గరిష్ఠంగా 3 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.3 లక్షల జరిమానా విధించనున్నారు. సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం డబ్బును జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్రం ఏమంటోంది?

సినిమా ప్రదర్శనల ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో అధికారాలు ప్రస్తుత చట్టంలో సెక్షన్‌ 6లో ఉండేవి. 2000 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒకసారి సినిమా సర్టిఫికేట్‌ జారీ చేశాక ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అదే సందర్భంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటే దానికి తగిన చట్టాలు ఉండాలని అభిప్రాయపడింది. అలాగే దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీయడంతోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సినిమాలు ఉంటున్నాయంటూ తరుచూ కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయి. దేశసార్వభౌమత్వం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అంతర్గత భద్రత విషయంలో భావప్రకటన స్వేచ్ఛకు సహేతుక ఆంక్షలు ఉండొచ్చునని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని కేంద్రం చెబుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.దీనిపై నిరసన గళం ఎత్తారు కొందరు సినీ ప్రముఖులు.

దేశంలో సినిమా, మీడియా, అక్షరాస్యత అనేవి మూడు సింబాలిక్‌ కోతుల్లా ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచే ప్రయత్నాలకు వీటిని చూడటం, వినడం, మాట్లాడటమే ఏకైక మందు. స్వేచ్ఛ కోసం అంతా గళమెత్తాలి - కమలహాసన్‌.

భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటమే చట్టం... దాని స్వరతంతువులను గొంతు కోసి చంపడం కాదు- సూర్య.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని