Top webseries: ఉత్కంఠ రేపే వెబ్‌సిరీస్‌లివే! - feature story on trending webseries list
close
Published : 27/10/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top webseries: ఉత్కంఠ రేపే వెబ్‌సిరీస్‌లివే!

ఒకప్పుడు థియేటర్లు మాత్రమే వినోదాన్ని పంచేవి. ఇప్పుడు అరచేతిలోనే కావాల్సినంత వినోదం దొరుకుతోంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా, డిస్నీ హాట్‌స్టార్‌ ఇలా ఓటీటీ వేదికలెన్నో ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి. స్టార్‌ హీరోలను తలదన్నే బడ్జెట్‌తో, సూపర్‌హిట్‌ చిత్రాలను మించిన కంటెంట్‌తో వినోదాల విందును అరచేతిలో పెడుతున్నాయి. యాక్షన్‌, డ్రామా, క్రైమ్‌ ఎందులోనూ ‘తగ్గేదేలా’ అంటూ కొత్తకొత్త వెబ్‌సిరీస్‌లు పుట్టుకొస్తున్నాయి. అలా ఈ మధ్యకాలంలో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లేంటో చూద్దాం.

స్క్విడ్‌ గేమ్‌

ప్రపంచంలో ట్రెండ్‌ అవుతున్న నంబర్‌ వన్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌గేమ్’‌. అప్పుల పాలైన వారికి వందలకోట్ల ప్రైజ్‌మనీ ఎరచూపి ఒక రహస్య దీవిలో ఆటల పోటీలు నిర్వహిస్తారు. 456 మంది పాల్గొనే ఈ ఆటలో ఒక్కరే విజేతగా నిలిచే అవకాశముంటుంది. మిగతా వారంతా ఓడిపోయి ప్రాణాలు కోల్పోతారు. పోటీ ప్రపంచంలో పడి మనిషిలో నశించిపోతున్న మానవత్వాన్ని, సమాజంలోని అంతరాలను సునిశితంగా, భావోద్వేంగా చూపించిన ‘స్క్విడ్‌గేమ్‌’లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్లున్నాయి. ప్రతి ఎపిసోడ్‌ వీక్షకులను కట్టిపడేస్తోంది.


 కార్టెల్‌

గ్యాంగ్‌వార్‌ సినిమాలని ఇష్టపడేవారికి మంచి వినోదాన్ని అందించే వెబ్‌సిరీస్‌ ‘కార్టెల్‌’.  ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు ముంబయిని పంచుకొని అండర్‌వరల్డ్‌ మాఫియాను నడుపుతుంటారు. వీళ్లందరిని నియంత్రిస్తూ రాణిమాయి ఆ మహానగరాన్ని శాసిస్తుంటుంది. ఎప్పుడైతే ఆమె అనారోగ్యం పాలై మంచాన పడిందో, అప్పటి నుంచి ముంబయి మీద పట్టు కోసం అయిదుగురి మధ్య గ్యాంగ్‌వార్‌ మొదలవుతుంది. ఈ అంతర్గతం యుద్ధం ఎటు దారితీసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్‌ ప్రియులకు పండగలాంటి వెబ్‌సిరీస్‌ ఇది. ఆల్ట్‌ బాలాజీ, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లలో ప్రసారం అవుతోంది.


గ్రహణ్‌

దేశరాజధాని దిల్లీలో జరిగిన 1984 అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్‌ క్రైమ్ డ్రామా ‘గ్రహణ్‌’. ఆనాటి భయానక పరిస్థితిని కళ్లకు కట్టడమే కాదు, ఆ హింస వల్ల కోల్పోయిన జీవితాలు, సామాన్యులు పడిన వేదనను అద్భుతంగా చూపించారు. పవన్‌ మల్హోత్ర, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్లో జీవించారనే చెప్పాలి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నటన ఎందులోనూ తగ్గలేదీ సిరీస్‌. గుండెలను తాకే ఈ వెబ్‌సిరీస్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. పవన్‌ మల్హోత్ర ప్రధాన పాత్రలో సోనీలివ్‌ రూపొందించిన మరో వెబ్‌సిరీస్‌ ‘టబ్బర్‌’. దీనికి మంచి ఆదరణే దక్కుతోంది. ఒక హత్య నుంచి కుటుంబాన్ని కాపాడుకునే తండ్రి కథతో తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా ఇది. అక్కడక్కడా ‘దృశ్యం’ సినిమా ఛాయలు కనిపించినప్పటికీ ఉత్కంఠ రేపే కథనంతో ఆకట్టుకుంటోంది.

కోటా ఫ్యాక్టరీ2

ఐఐటీ, మెడిసిన్‌ ప్రవేశ పరీక్షల శిక్షణకి రాజస్థాన్‌లోని కోటా నగరానికి ఏటా లక్షల్లో విద్యార్థులు వస్తారు. ఒకరకంగా ప్రవేశ పరీక్షల కర్మాగారమని పిలవొచ్చు. అంతలా ప్రసిద్ధి చెందిందిది. ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితులని వదిలి ఐఐటీ కలను నెరవేర్చుకోడానికి ఒంటరిగా వచ్చిన కుర్రాడి కథే ‘కోటా ఫ్యాక్టరీ’. మొదటి సీజన్‌ను ‘ది వైరల్‌ ఫీవర్‌’ నిర్మించి యూట్యూబ్‌లోనే విడుదల చేస్తే ఘనవిజయం సాధించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ హక్కులు తీసుకొని రెండో సీజన్‌ని రూపొందించింది. గతనెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. కోచింగ్‌ సెంటర్లలో ఉండే పరిస్థితి,  పోటీ ప్రపంచాన్ని, విద్యార్థుల ఎదుర్కొనే ఒత్తిడిని కళ్లకు కట్టినట్లు చూపించారు. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.

ఫ్యామిలీమ్యాన్‌2

మనోజ్‌ బాజ్‌పాయి, ప్రియమణి నటించిన ‘ఫ్యామిలీమ్యాన్‌’ మొదటి సీజన్‌ ఘనవిజయం సాధించింది. రెండో సీజన్ కొద్ది నెలల క్రితమే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. సమంత ప్రతినాయిక పాత్రలో అలరించింది. సీక్రెట్‌ ఏజెంట్‌ అయిన శ్రీకాంత్ ఉగ్రదాడి నుంచి దేశాన్ని ఎలా కాపాడాడనే కథాంశంతో తెరకెక్కింది. సమంత పాత్రపై కొంత విమర్శలు వచ్చినప్పటికీ, వెబ్‌సిరీస్‌ మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

హౌస్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌: ది బురారీ డెత్స్‌

దిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2018లో జరిగిన ఈ ఘటన వెనకున్న అసలు నిజాన్ని డాక్యుమెంటరీ సిరీస్‌గా తెరకెక్కించారు. మొత్తం మూడు ఎపిసోడ్లున్న ఈ సిరీస్‌ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. పదకొండు మంది ఎందుకు చనిపోయారనే కారణాలు వివరంగా ఇందులో చూపించారు. ఎందుకు చనిపోయారనే విషయం తెలిసుకునే కొద్దీ వెన్నులో వణుకు పుడుతుంది. ఒక డాక్యుమెంటరీని ఇంత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించడం ఇది వరకు చూసి ఉండరు. ఇలాంటిదే ‘క్రైమ్‌ స్టోరీస్‌: ఇండియా డిటెక్టివ్స్‌’ కూడా ఉత్కంఠతో సాగే డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌.

మనీ హైస్ట్: పార్ట్‌ 5

 ‘మనీహైస్ట్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో ఓ సంచలనం. అరంగేట్ర వెబ్‌సిరీస్‌గా రికార్డులు సృష్టించిన ‘మనీహైస్ట్‌’ ఐదో సీజన్‌ ఈ మధ్యే విడుదలై అమితంగా ఆకట్టుకుంటుంది. బ్యాంక్‌ దోపిడి నేపథ్యంలో థ్రిల్లింగ్ ఉండే వెబ్‌సిరీస్‌ ఇది. తెలుగు వెర్షన్‌ కూడా విడుదలైంది. ఇందులో కనిపించే స్నేహం, దోపిడి, భావోద్వోగాలు, పోరాటాలు చూపు తిప్పుకోనివ్వవు. 

కుడి ఎడమైతే

కాలం చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఈ కాన్సెప్ట్‌ను ఉపయోగించుకుని ఆసక్తికరంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘కుడి ఎడమైతే’. ‘యూటర్న్‌’లాంటి విభిన్న కథను ప్రేక్షకులకు అందించిన పవన్‌కుమార్‌ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవల ఆహాలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. గ్లామర్‌ డాల్‌ అమలాపాల్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ వీక్షకులను ఆకట్టుకుంది. ఒక విభిన్నమైన వెబ్‌సిరీస్‌ని చూడాలనుకునే వారు..‘కుడి ఎడమైతే’పై ఓ లుక్కేయిండి. 

మరికొన్ని వెబ్‌సిరీస్‌లు

అన్‌హర్డ్‌

మహారాణి

సన్‌ఫ్లవర్‌

 సమంతర్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని