తర్వాత ఏంటి?
close
Updated : 31/05/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తర్వాత ఏంటి?

చిత్రసీమలో కొత్త దర్శకులదే జోరంతా. హిట్టు మాట వినిపించడమే ఆలస్యం.. వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేసే ప్రయత్నం చేస్తుంటారు. వీలైనంత వేగంగా స్టార్‌ కథా నాయకుల దృష్టిలో పడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో వచ్చిన ఈ విరామ సమయంలో అటు అగ్ర దర్శకులు.. ఇటు కుర్ర డైరెక్టర్ల నుంచి చాలా కొత్త కబుర్లు వినిపించాయి. అయితే హిట్టు కొట్టీ.. కొత్త సినిమాల విషయంలో స్పష్టత ఇవ్వని దర్శకులు చిత్రసీమలో పలువురు ఉన్నారు. ఇప్పుడు వాళ్ల కబురు కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘మళ్లీరావా’ చిత్రంతో ఓ అందమైన ప్రేమకథను సినీప్రియులకు రుచి చూపించి.. తొలి అడుగులోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు గౌతమ్‌ తిన్ననూరి. రెండో ప్రయత్నంగా ‘జెర్సీ’ సినిమాతో జాతీయ స్థాయిలో మెరిశారు. చరిత్రలోనే మిగిలిపోయిన అనేక మంది సచిన్‌ల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని.. తండ్రీ కొడుకుల అనుబంధంతో అల్లుకున్న ఓ చక్కటి కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. దీనికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని.. ఇప్పుడు బాలీవుడ్‌లో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు గౌతమ్‌. దీని తర్వాత ఆయన తెలుగులో చేయనున్న చిత్రమేదన్నది స్పష్టత లేదు. కథానాయకుడు రామ్‌చరణ్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోలకు కథలు వినిపించినా.. దేనిపైనా స్పష్టత రాలేదు.

* ‘ఛలో’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. గతేడాది నితిన్‌ హీరోగా ‘భీష్మ’ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు మరో కొత్త కబురేమీ వినిపించలేదు. సాయి తేజ్‌, వరుణ్‌ తేజ్‌ లాంటి యువ హీరోల కోసం కథలు సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నా.. ఇంత వరకు ఏదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన మహేష్‌ - త్రివిక్రమ్‌ల కొత్త చిత్రం కోసం స్క్రిప్ట్‌ వర్క్‌లో సహాయ పడుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. కొవిడ్‌ పరిస్థితులు కుదటపడగానే ఆయన నుంచి కొత్త కబురు వినిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

* ‘ఘాజీ’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మెరిశారు సంకల్ప్‌ రెడ్డి. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా వరుణ్‌ తేజ్‌తో ‘అంతరిక్షం’ చిత్రం చేశారు. ఇది ఓ మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. సంకల్ప్‌ తెలుగులో మరో కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. బాలీవుడ్‌లో విద్యుత్‌ జమ్వాల్‌తో ఓ యాక్షన్‌ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కరోనా పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతూ వస్తోంది.

* ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి యువతరం మెచ్చే కథలతో బాక్సాఫీస్‌ ముందు వరుస విజయాలు అందుకున్నారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో ఇటీవలే కథానాయకుడిగానూ తెరపై మెరిశారు. అయితే ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న తర్వాతి చిత్రమేదన్నది ఇంత వరకు స్పష్టత లేదు. వెంకటేష్‌తో ఓ హార్స్‌ రేసింగ్‌ సినిమాని పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించినా.. ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఒక క్రైమ్‌ డ్రామా కథాంశంతో ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపించినా.. దానిపైనా ఎలాంటి స్పష్టత రాలేదు.

మలి అడుగు ఎవరితో..

వెండితెరపై ఏటా డజను మంది కొత్త దర్శకులైనా తళుక్కుమని మెరుస్తుంటారు. ఈ ఏడాది ఆరంభం నుంచే వారి జోరు కనిపించింది. ‘ఉప్పెన’ సినిమాతో విజయాన్ని అందుకొని.. తొలిప్రయత్నంలోనే చిత్రసీమ దృష్టిని ఆకర్షించారు దర్శకుడు బుచ్చిబాబు సాన. ఇప్పుడాయన ఎన్టీఆర్‌ కోసం కథ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్‌ ఉండనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి మరింత కాలం వేచి చూడక తప్పదు. మరి ఈలోపు బుచ్చిబాబు మరేదైనా కొత్త చిత్రం ప్రకటిస్తారేమో చూడాలి.

* భారతీయ శిక్షా స్పృతిలోని ‘సెక్షన్‌ 211’ పాయింట్‌ స్ఫూర్తితో ‘నాంది’ సినిమాని తెరకెక్కించి మెప్పించారు విజయ్‌ కనకమేడల. ఈ సినిమాతోనే 8ఏళ్ల విరామం తర్వాత హీరో నరేష్‌కు మంచి విజయాన్ని అందించారు. ఈ ఇద్దరి కలయికలోనే మరో చిత్రం పట్టాలెక్కనున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. విజయ్‌ ఆ ప్రాజెక్ట్‌ ఉంటుందని చెప్పినా.. అదెప్పుడన్నది స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన ఓ పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ‘నాంది’ బాలీవుడ్‌ రీమేక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. వీటిలో రెండో సినిమాగా పట్టాలెక్కేది ఏదన్నది తెలియాల్సి ఉంది.

* నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శిలను ‘జాతిరత్నాలు’గా మార్చి.. సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు అనుదీప్‌. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంగా సాగే మరో విభిన్నమైన వినోదాత్మక కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ‘జాతిరత్నాలు 2’ సైతం ప్రకటించారు. ఈ రెండిటిలో ముందు ఏదో తేలాల్సి ఉంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని