థియేటరూ ఊపిరి పీల్చుకో...
close
Updated : 30/07/2021 07:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటరూ ఊపిరి పీల్చుకో...

టికెట్ల రెపరెపల చప్పుడు వినిపిస్తోంది..

పోస్టర్ల కళకళల తళుక్కు కనిపిస్తోంది...

వెలవెల బోయిన సీట్లను అలంకరించడానికి సినిమా ప్రేక్షక లోకం కదిలి వస్తోంది...

థియేటరూ ఊపిరి పీల్చుకో!

బుకింగ్‌ అబ్బాయి కడుపు నింపడానికి...

ఆపరేటర్‌ ఆకలి తీర్చడానికి..

క్యాంటిన్‌ కుర్రాడి కన్నీళ్లు తుడవడానికి..

పార్కింగ్‌ బాయ్‌కి ఉపాధి చూపడానికి..

థియేటరూ ఊపిరి పీల్చుకో!

ఎన్నో పాత్రలు కొత్తగా పుట్టడానికి

నటులంతా తారలై మెరవడానికి

నిన్నే నమ్ముకున్న యజమాని కళ్లలో ఆనందం కురవడానికి

ఇరవై నాలుగు కళలు వెండితెరపై జీవం పోసుకోవడానికి..

థియేటరూ ఊపిరి పీల్చుకో!

దర్శకుల మదిలో నూతన కథలు ఆవిష్కరించడానికి..

సంగీత, సాహిత్యాలతో ప్రేక్షకులను సత్కరించడానికి..

నిపుణులంతా... వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి..

తెలుగుచిత్ర సీమను దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి...

థియేటరూ ఊపిరి పీల్చుకో!

ప్రేక్షకుడా...!

నీ పాద స్పర్శకు... నే శ్వాసిస్తా!

నీ సందడే... గుండెచప్పుడై పునఃజీవిస్తా!

మాస్క్‌ కట్టుకో... శానిటైజర్‌ పూసుకో..

కరోనాను కాంపౌండ్‌లోకైనా రాకుండా కాపలా నే కాస్తా...

నీ భద్రతే... నా భవితగా కాంక్షిస్తా!

ప్రేక్షకుడా నీ ఆనందమే.. ఊపిరిగా పీలుస్తా!

తొలి దశ కరోనా తర్వాత తెలుగు సినిమా రంగం గురించి ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు మాట్లాడుకున్నాయి. ఏ భాషలో లేని రీతిలో తెలుగులో సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విజయాలు అందుకున్నాయి. రెండో దశ కరోనా వచ్చినా తెలుగు సినిమా పరిశ్రమ ధైర్యంగానే కనిపించిందంటే కారణం అదే. లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకి వరుస కడతారని భావించారంతా. పైపెచ్చు ఈసారి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు ఇదివరకటి కంటే ఎక్కువ సంఖ్యలో వస్తారనే నమ్మకంతోనే పరిశ్రమ సినిమాల్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు, టికెట్ల ధరల విషయంలో యాజమాన్యాల అసంతృప్తి అక్కడ వారిని ముందడుగు వేయనీయడం లేదు. అందుకే పెద్ద బడ్జెట్‌ సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి.

* గడిచిన 17 నెలల కాలంలో 12 నెలలకి పైగా థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. దాంతో యాజమాన్యాలకి పెద్దఎత్తున నష్టాలు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1700కిపైగా ఉన్న థియేటర్లలో 34 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 10 వేల మంది ఆధారపడుతున్నారు. వాళ్లంతా ఉపాధి కోల్పోయారు. తెలంగాణలో వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. సింగిల్‌ స్క్రీన్‌లలో పార్కింగ్‌ రుసుం వసూలుకు అనుమతిచ్చింది. దాంతో తెలంగాణలో థియేటర్లు మళ్లీ యథావిధిగా తెరిచేందుకు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలపై ఈ ఏడాది ఏప్రిల్‌లో తీసుకొచ్చిన జీవో ప్రదర్శనకారులకి, చిత్ర పరిశ్రమకి శరాఘాతంగా మారిందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. 50శాతం ప్రేక్షకులతో, ఆ ధరలతో ఏసీ థియేటర్లు నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. పలువురు ప్రముఖ నిర్మాతల చేతుల్లో ఏపీలో కొన్ని థియేటర్లు ఉన్నాయి. వాటిలో చాలావరకు శుక్రవారం పునః ప్రారంభం కావడం లేదని తెలుస్తోంది.

మూడు ఆటలేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఇష్క్‌’ 150పైగా థియేటర్లలోనూ, ‘తిమ్మరుసు’ 200కిపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలూ విడుదలవుతున్నాయి. గురువారం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రదర్శనకారులు విజయవాడలో సమావేశమయ్యారు. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లాలో థియేటర్లు తెరవడం లేదని ప్రదర్శనకారులు స్పష్టం చేశారు. దీనికితోడు ఏపీలో ప్రస్తుతం రాత్రి 10 తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంది. దీనివల్ల సెకండ్‌ షో నిర్వహణ కష్టమవుతోంది. అందుకే అక్కడ మూడు ఆటలే ఆడే అవకాశం ఉంది. ప్రేక్షకుల స్పందనని చూసి... షో సమయాల్లో మార్పులు చేసి నాలుగు ఆటలు పడేలా చర్యలు తీసుకుంటామని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ ‘ఈనాడు సినిమా’తో తెలిపారు. తెలంగాణలో యథావిధిగా నాలుగు ఆటలు పడనున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని